GET MORE DETAILS

ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన అక్టోబర్‌ మహావిప్లవం

 ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన అక్టోబర్‌ మహావిప్లవం

"న్యూఏజ్‌ వీక్లీ'' సౌజన్యంతో




    1917లో విజయవంతమైన అక్టోబర్‌ విప్లవం దాకా మానవ సమాజానికి సంబంధించిన అవగాహనను మార్చేసిన సంఘటనలను చరిత్రలో కొన్నింటిని ఉదహరించవచ్చు. ఫ్రెంచ్‌ విప్లవం, ప్రజల విప్లవకర ఆశలు, ఆకాంక్షలను రగిలించే సందర్భంలో ఆ తరువాత బోనపార్టిజంకు ఆహారంగా మారినప్పుడు, మొట్ట మొదటిసారిగా కార్మికవర్గ రాజ్యాన్ని స్థాపించడంలో రష్యా విప్లవం విజయవంతమైంది. అనేకమంది దార్శనికులు, తత్వవేత్తలు దోపిడీలు, అసమానతలు, అన్యాయాలు లేని సమాజం గురించి ఆలోచించే ప్రయత్నం చేశారు. కార్ల్‌ మార్క్స్‌, ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ల భావజాలాన్ని అనుసరిస్తూ, లెనిన్‌ నాయకత్వంలో రష్యన్‌ ప్రజలు సోవియట్‌ రష్యాను ప్రపంచపటం పైకి తీసుకొని వచ్చారు.

    ఆ సందర్భంలో అమెరికాకు చెందిన జర్నలిస్ట్‌ జాన్‌ రీడ్‌ ఆ కాలంలో జరిగిన చారిత్రాత్మక మార్పును తన ''ప్రపంచాన్ని కుదిపిన ఆ పది రోజులు'' రచనలో వివరించాడు. రష్యా విప్లవం కఠినతరమైన సైద్ధాంతిక పరిశీలనలు, సాహసోపేతమైన మార్క్సిస్టు భావాల ఆచరణాత్మక పునాదులపై నిర్మితమైంది. పెట్టుబడిదారీ దోపిడీ కబంద హస్తాల నుండి నిరంకుశ జార్‌ పాలన నుండి రష్యన్‌ ప్రజలను విముక్తి చేసే సందర్భంలో విప్లవకరమైన మార్క్సిస్టు భావజాలం, సామ్రాజ్యవాద వ్యతిరేక విలువలను, సోషలిజం, అంతర్జాతీయవాదాలను రష్యా విప్లవానికి తెలిపింది. ఈ భావజాలపరమైన పూర్వ సిద్ధాంతమే ప్రపంచ చరిత్రలో రష్యన్‌ విప్లవంతో ప్రజలపైన, చరిత్రపైన ఒక ప్రాధాన్యత గల ప్రభావాన్ని చూపించి, ప్రపంచ వ్యాప్తంగా విముక్తి ఉద్యమాలకు ప్రేరణ కలిగించింది.

 నూతన సమాజన్ని నిర్మించడంలో మార్క్సిజం పాత్ర గురించి యూరప్‌ వ్యాప్తంగా తీవ్రమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. కానీ లెనిన్‌, రష్యాలో ఉన్న నిర్దిష్టమైన పరిస్థితులకు అన్వయించి మార్క్సిజంను అమలు చేశాడు. ఆ సమయంలో మార్క్సిస్ట్‌ శ్రేణులు, పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన జర్మనీ, ఇంగ్లాండ్‌ లాంటి దేశాలలో విప్లవకర పరిస్థితులు పరిపక్వమయ్యాయని అంచనా వేశారు, కానీ వాటికి బదులుగా వెనుకబడిన దేశంగా ఉన్న రష్యాలో మొట్టమొదటి సారిగా సోషలిస్టు విప్లవం వచ్చింది. ఎందుకంటే నిరంకుశ పాలనను కూలదోసేందుకు చాలా నిజాయితీగా నాయకత్వాన్ని, సైద్ధాంతిక పొందికను లెనిన్‌ కార్మిక కర్షక మైత్రికి అందించాడు.


 దోపిడీ రూపాలు, దోపిడీ పద్ధతులు, అంతస్థుల దొంతరల పరిష్కారం కోసం సిద్ధాంతం, సందర్భానుసారమైన దాని అన్వయింపు అత్యావశ్యకమని రష్యన్‌ విప్లవం, అప్పటినుండి జరిగిన విముక్తి పోరాటాల అనుభవాల నుంచి ఎవరైనా ఒక అభిప్రాయానికి రావచ్చు.

    మార్క్సిస్టులకు, సోషల్‌ డెమోక్రట్లకు మధ్య జరిగిన తీవ్రమైన చర్చల గురించి లెనిన్‌ ఈ విధంగా రాశాడు... ''విప్లవకర సిద్ధాంతం లేకుండా విప్లవోద్యమం ఉండదు. సంకుచితమైన ఆచరణాత్మక కార్యాచరణతో అవకాశవాదం కలిసి వెళ్తున్నప్పుడు, ఇలాంటి భావాలను ఒక్కసారిగా బలవంతంగా రుద్దకూడదు'' (లెనిన్‌, 1902). విప్లవ సిద్ధాంతం, ఆచరణ, దోపిడీని అంతం చేసే పోరాటం రానున్న భవిష్యత్‌ తరాలకు ప్రేరణగానూ, ఉపయుక్తంగానూ ఉంటుంది. విప్లవ సందేశం చాలా స్పష్టంగా ఉంది: నిర్దిష్టమైన పరిస్థితులకు అనుగుణంగా సిద్ధాంతాన్ని నిర్దిష్టంగా అన్వయించాలి.

    భారతదేశం రష్యన్‌ విప్లవం గురించి విని చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. అది భారత స్వాతంత్య్రోద్యమంలో కొత్త ఆశలకు, కార్యక్రమాలకు దారి చూపించింది. భారతదేశ ప్రజలు చాలా తొందరగానే ఎర్రజెండా వైపు, దేశంలో అన్ని రూపాలలో జరుగుతున్న దోపిడీని, కుల, మత, వర్గ, లింగాల మధ్య విదేశీ పాలనలో పెరుగుతున్న అసమానతలను అంతం చేస్తుందన్న తన వాగ్దానానికి ఆకర్షితులయ్యారు. వేల సంఖ్యలో యువత క్రమంగా సోషలిస్టు భారతదేశం అనే లక్ష్యాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించి, భారతదేశ స్వాతంత్య్రోద్య మంలో అత్యంత ప్రగతిశీలమైన సేవలను అందించారు.

 అది స్వతంత్ర రాజ్యాంగ సభ, సంపూర్ణ స్వాతంత్య్రం, కార్మిక హక్కులు, జమీందారీ వ్యవస్థ రద్దు, ప్రాథమిక హక్కుల డిమాండ్‌ కోసం అప్పుడే ఏర్పడిన భారత కమ్యూనిస్ట్‌ పార్టీ యొక్క అత్యున్నతమైన త్యాగాలు, నిస్వార్థమైన సన్నద్ధతతో పాటు రష్యన్‌ విప్లవ ఆదర్శాలకు ప్రభావితులైన భగత్‌సింగ్‌ లాంటి వ్యక్తుల సేవలు సాధనాలుగా రుజువయ్యాయి. మన నాయకులు కూడా భారతదేశంలోని వాస్తవ పరిస్థితులలో ఉన్న సంక్లిష్టతను అర్థం చేసుకొని, పార్టీ మహాసభలో అంటరానితనానికి సంబంధించి కొన్ని కదిలించే వ్యాఖ్యానాలు చేసి, దానిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

    ఈ విప్లవకర భావజాలం యొక్క మార్గదర్శకత్వంలో, 1920లో పారిశ్రామిక కార్మికులను, 1936లో విద్యార్థు లను, ద్వారా రైతులను, ప్రగతిశీల రచయితల సంఘం ద్వారా రచయితలను, 1943లో పీపుల్స్‌ థియేటర్‌ అసోసియేషన్‌ ద్వారా కళాకారులను వామపక్షం సమీకరిం చింది. ఈ సంఘాలన్నీ పరీక్షా కాలంలో నిలబడి, సమాజం రరరలోని ప్రగతిశీల వర్గాలకు ప్రతినిధులుగా మిగిలి ఉన్నాయి.

    ఘనమైన చరిత్ర నుండి గుణపాఠాలు నేర్చుకోవడంతో పాటు, నేడున్న వామపక్షం ముందున్న ఒక కర్తవ్యం (స్వాతంత్య్రోద్యమ కాలంలో ఉన్న సంక్లిష్టమైన కర్తవ్యం లాంటిది) ఉంది. బీజేపీ, ఆరెస్సెస్‌ పాలనలో కుల వివక్షత, మత సమీకరణలు, లింగ బేధాలు మన వైపు చూస్తున్న కాలంలో మనమున్నాం. ఈ పాలన మనం కష్టపడి సాధించుకున్న స్వేచ్ఛలను, అందరినీ కలుపుకొని పోయే స్వాతంత్య్రోద్యమ వారసత్వాన్ని నెమ్మది నెమ్మదిగా ధ్వంసం చేస్తుంది. అదే సమయంలో ప్రజలు ద్రవ్యోల్బణం, ఆకలి, అసమానతలు, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు. నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధానం కూడా జాతీయ ఆస్తులను నెమ్మదిగా ధ్వంసం చేస్తున్నది. గడచిన కొన్ని సంవత్సరాలుగా, ఆరెస్సెస్‌ విభజన కథనాల సవాళ్ళు లెక్కకు మించిన సంఖ్యకు చేరాయి. ఆరెస్సెస్‌ ప్రచార యంత్రాంగం ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తూ, తమ అసమ్మతిని వ్యక్తం చేస్తున్న వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నది.

   ఈ సంక్షోభంలో కూరుకుపోవడంతో, దాని భావజాలం యొక్క ప్రాధాన్యత, దాని పోరాటం చాలా స్పష్టమయింది. లౌకిక, ప్రజాతంత్ర, ప్రగతిశీల ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి బీజేపీని ఓడించడం మనముందున్న ప్రధాన తక్షణ కర్తవ్యం.

    మనుస్మృతిని ఆరాధించే ఆరెస్సెస్‌ మూలం, విభజన, హింసాత్మక భావాలతో కూడిన రాజకీయాలలో ఉంటుంది. వారు రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడుతూ, మతాధికార శ్రేణీగత వ్యవస్థ ఉన్న సమాజంతో పాటు పితృస్వామిక, కుల, మత, లింగ వివక్షతలు గల సమాజం దిశగా ధృఢమైన ధోరణితో వ్యవహరిస్తారు.

   బీజేపీ, ఆరెస్సెస్‌లకు వ్యతిరేకంగా ఒక రాజీలేని భావజాలపరమైన పోరాటాన్ని నేడు దేశంలో ఉన్న పరిస్థితి డిమాండ్‌ చేస్తుంది. ఈ పోరాటంలో వామపక్షం కీలకమైన పాత్రను పోషించాలి. దాని వలన మాత్రమే మనం ప్రజలకు చేరువగా ఉండగలం. దాని ఫలితంగా రాజకీయ, ఎన్నికల పోరాటాలలో విజయం సాధించవచ్చు. భావజాలపరమైన సమస్యలపై అవగాహన పొందేందుకు, వామపక్షం యొక్క పాత్ర ప్రభావం లౌకిక, ప్రజాస్వామిక శక్తులపై కూడా ఉంటుంది.

 నేడు కార్మికులపైన, మన లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌ పైన దాడి చేస్తున్న సమయంలో, రష్యన్‌ విప్లవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం, కార్మిక వర్గాలు ఐక్యం కావాలనే రష్యన్‌ విప్లవం పిలుపును అనుసరించడం ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే సందర్భంలో అందరం ఒక్కచోటకు సమీకరణ కావడం కూడా ముఖ్యమే. ఎందుకంటే ఇది మాత్రమే మానవజాతి చరిత్రలో మొదటిసారిగా సంభవించిన ఏకైక సంఘటన. రష్యన్‌ విప్లవ వార్షికోత్సవాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవడం, ఆ విప్లవాన్ని స్మరించుకునే చర్యలు నయా ఉదారవాద పెట్టుబడిదారీ వర్గాలలో వణుకు పుట్టిస్తాయి.

    సోవియట్‌ యూనియన్‌ కూలిపోయినప్పటికీ, వంద సంవత్సరాల తరువాత కూడా రష్యన్‌ విప్లవ అనుభవాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేరణ, స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాయి.

Post a Comment

0 Comments