GET MORE DETAILS

భక్తులు కోరిన కోర్కెలు సిద్దింపజేసే మహిమాన్విత తేరాల సిద్దేశ్వర స్వామి ఆలయ చరిత్ర

 భక్తులు కోరిన కోర్కెలు సిద్దింపజేసే మహిమాన్విత తేరాల సిద్దేశ్వర స్వామి ఆలయ చరిత్ర



ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా దుర్గి మండలం తేరాల గ్రామ శివారు లో వెలసిన తేరాల శ్ర్రీ భ్రమరాంభిక సిద్దేశ్వర దేవాలయం గురించి తెలుసుకుందాం.

 ఈ ఆలయం లో శివుడిని ఆరాధించిన భక్తుల కోరికలు వెంటెనే సిద్దిస్తాయి కాబట్టి సిద్దేశ్వర స్వామి గా పేరు వచ్చిందని పెద్దలు చెపుతారు..సుందర మనోహర ఆలయ నిర్మాణం,ప్రశాంతత కు నిలయం లా ఉండే ఈ దేవాలయాన్ని పరశురాముడు నిర్మించారని ఆధారాలు ఉన్నాయి . పరశురాముడు తల్లి తండ్రులను చంపిన బ్రహ్మహత్యా పాప నివారణకు ఈ ప్రాంతం కు వచ్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్ష్యమయి ఈ ప్రాంతంలోశివాలయం నిర్మించమని చెప్పగా,పరశురాముడు ఈ దేవాలయం నిర్మించారని చెపుతారు. తాను నిర్మించిన దేవాలయం ఎదురుగా ఒక కోనేరు నిర్మించి దానిలో స్నానమాచరించి శివలింగం ప్రతిష్ట చేయాలని భావించి పరశురాముడు కోనేరు నిర్మించి, కోనేరు లోకి దిగగానే కోనేరు లోని నీరు రక్త వర్ణం లోకి మారతాయి పరశురాముడు.కలత చెంది శివుణ్ని ప్రార్ధించగా, ప్రత్యక్షమయి విభూతి ప్రసాదించి కోనేరు లో చల్లమని ఆజ్ఞాపిస్తారు. శివ దేవుడు ప్రసాదించిన విభూతి ని కోనేరులో వేయగానే, నీరు విభూతి రంగు లో మారతాయి. పరశురాముడు శివదేవునికి నమస్కరించి ఆ కోనేరు నీరు లో స్నానమాచరించి పాప విముక్తి పొందారని చెపుతారు.

నేటికి తేరాల సిద్దేశ్వర ఆలయం లో ఉన్న కోనేరు కు విభూధి గుండం అని పేరు.నేటికి అందులో నీరు విభూధి రంగులోనే ఉండటం విశేషం. పరశురాముడు స్నానమాచరించి ఆలయం లో శివలింగం ను ప్రతిష్టించ బోగా స్యయంభూ గా శివలింగం ఆలయం లో వెలుస్తుంది. ఆ దృశ్యం చూసి పరశురాముడు భక్తి పారవశ్యం పొంది శివదేవుని కృప పొందినట్లు చెపుతారు. సాదారణం గా ఆలయాలు తూర్పు ముఖ ద్వారం తో నిర్మించబడతాయి,కాని పరశు రాముడు నిర్మించిన ఆలయాలు పడమర దిక్కు ముఖ ద్వారంగా నిర్మించారని ఇలాంటి శివాలయాలు కు మాచర్ల లో రామప్ప గుడి,కంభంపాడు గ్రామం లో పురాతన శివాలయాలు కూడా ఉదాహరణ గా చెప్పవచ్చు.. ఆలయం గర్బ గుడి లోని శివలింగం కు అభిషేకించే భాగ్యం ఇక్కడ భక్తులకు కల్పిస్తారు,శివలింగం ను తాకిన వారు సాక్షాత్తు ఆ కైలాశ నాధుని తాకిన మధురానుభూతి, భక్తి భావన కలుగుతుందని భక్తులు చెపుతారు, స్వామి వారి మూల విరాట్టు కు ఎదురుగా ఉన్న భ్రమరాంబికా దేవి విగ్రహం,ఆ పక్కనే ఉండే గణపతి,పరశురాముడు విగ్రహాలు కనువిందు చేస్తాయి. ప్రతి పౌర్ణమి రోజు రాత్రి వేళ దేవతలు,మహర్షులు వచ్చి సిద్దేశ్వర స్వామి కి పూజలు చేస్తారని,దీనికి కొన్ని నిదర్శనాలు ఉన్నట్లు తేరాల గ్రామ పెద్దలు చెపుతారు. శివ దేవుడు స్వయంగా పౌర్ణమి రోజుల్లో ఈ ఆలయానికి రాత్రి వేళ వచ్చి కొంత సమయం గడుపుతారని, మహర్షులు ఈ అటవీ ప్రాంతం లో తపస్సు ఆచరించి,స్వామి వారి వరాలు పొందిన పుణ్య స్తలం అని, తరతరాల నుండి పెద్దలు చెప్తుండగా నేటికి భక్తులు ఈ ఆలయ మహత్యం గురించి తమ పూర్వీకులు,పెద్దలు చెప్పిన విషయాలు మననం చేసుకుంటారు. వందల సంవత్సరాల క్రితం ఈ అటవీ ప్రాంతం లో మహర్షులు తపస్సు ఆచరించి ప్రధాన ఆలయ పరిసర ప్రాంతం పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం గా ఉంటుంది.కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ కీకారణ్యం లో భారీ రాళ్ళతో ఈ ఆలయ నిర్మాణం జరపటం విశేషం.నేటికి జనసంచారం లేని అటవీ ప్రాంతంలో ఇంతటి మనోహర నిర్మాణం దైవ సృష్టి కి నిదర్శణం అని భక్తులు చెపుతారు.. రావి చెట్టు మర్రి చెట్టుకలసి వుండటం ఈ ఆయల ప్రాంగణం లో మరో అధ్బుతం నిర్మాణం మనం చూడవచ్చు, గోగర్బం అనే ప్రత్యేక నిర్మాణం ఈ ఆలయం లో మనం చూడవచ్చు, అతి చిన్న ద్వారం కలిగి ఉంటుంది. ఈ ద్వారం చూస్తే అతి సన్నని వారు కూడా పట్టరు అనిపిస్తుంది.భక్తి తో శివున్ని తలుచుకుని ద్వారంలొకి ప్రవేశిస్తే ఎంతటి లావు వారు అయినా, అవలీలగా దూరి సిద్దేశ్వర స్వామిని దర్శించుకుంటారు. భయపడే వారు అతి బక్కపలచని వారు అయినా గోగర్బం లో నుంచి వెళ్లలేరు,మధ్య లో ఇరుక్కు పోయి వెనక్కి వస్తారు.సిద్దేశ్వరుని తలచుకుని ఈ అతి చిన్న ద్వారం గోగర్బం నుండి ఆవలి వైపు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటే పుణ్యఫలాలు పొందుతారని భక్తుల విశ్వాసం . ఈ గోగర్బం నుండి వెళ్లలేని భక్తులు స్వామి వారిని ఆలయ ప్రధాన ద్వారం నుండి వెళ్ళి దర్శిస్తారు.

గోగర్బం కట్టడం : 

కాశీక్షేత్రం లోను మరియు ఇక్కడే మాత్రమే కలదని చెపుతారు. ఆలయం లోపల పరశురాముని ప్రతిమ భ్రమరాంభికా తల్లి శిల్పాలు అతి మనోహరంగా ఉంటాయి.శివున్ని మనం ప్రత్యక్షముగా అభిషేకించే భాగ్యం ఈ దేవాలయం లో మనకి కల్పిస్తారు.ఈ దేవాలయం సందర్శించిన వారు ఆ వాతావరణం ను ప్రశంసించకుండా ఉండలేరు.దేవాలయం బయట ఈ ఆలయానికి సంబందించి అలనాటి రాజులు వేయించిన శాసనాలు మనం చూడవచ్చు. ఈ ఆలయ ప్రాంగణం పక్కనే ఉన్న క్వారీ తవ్వకాలలో పురాతన రాతి విగ్రహాలు బయలు పడ్డాయి,అవి కూడా మనం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. ఆలయం వెనుక కొద్ది దూరం లో తేరాల చెరువు లో అతి పురాతన రూపులమ్మ దేవాలయం ఉండేదని,ఈ ఆలయం వరదల వల్ల,ప్రకృతి విపత్తుల వల్ల నాశనం అయిందని చెపుతారు. ఇప్పటికి తేరాల చెరువులో పురాతన రాజగోపురం లాంటి నిర్మాణం మనం చూడవచ్చు,ఈ నిర్మాణం అతి పురాతన మయినది అని చెపుతారు. భ్రమరాంభిక సిద్దేశ్వర దేవాలయం తేరాల గ్రామం కు కూడా కిలో మీటర్ పైగా దూరంలో ఉంది. ఈ నాటికి సరి అయిన రోడ్దు మార్గం లేని అటవీ ప్రదేశం లో ఈ ఆలయాన్నిఎలా నిర్మంచారు?.అంత భారీ రాళ్ళను ఎలా ఈప్రాంతానికి ఎలా తరలించారు? అని ఆలోచించిన వారికి అది నిజంగా అద్బుతం అని తోస్తుంది.. శివరాత్రి పర్వదినాన ప్రతి సంవత్సరం ఈ ఆలయం లో గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు,వేలాది మంది భక్తులు పలు ప్రాంతాల నుండి వచ్చి స్వామి వారిని దర్శించి రాత్రంతా జాగారం చేసి,దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తారు. కార్తీక మాసం లో భక్తులు ఇక్కడ కు ఎక్కువ వస్తుంటారు. ప్రతి సోమవారం స్వామి వారిని అభిషేకించి,పూజలు నిర్వహించుటకు తేరాల,మాచర్ల,వెల్దుర్తి,దుర్గి ల నుండే కాక దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. కార్తీకమాసం లో ఈ ఆలయం లో స్వామి వారిని దర్శించి,అభిషేకం చేస్తే సకల పాపాల హరణం అవుతాయని భక్తుల నమ్మకం,కనుక అధిక సంఖ్య లో భక్తులు ఈ ఆలయానికి వస్తారు. సాధారణ రోజుల్లో భక్తులు రద్దీ తక్కువగా ఉంటుంది . తేరాల కు చెందిన విశ్వ బ్రాహ్మాణ సామాజిక వర్గానికి చెందిన పూజారులు ఇక్కడ వంశ పారంపర్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు,ప్రతి రోజు దేవాలయం వచ్చి స్వామి వారికి పూజా కార్యాక్రమాలు,స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తుంటారు. విశాలమయిన ఈ దేవాలయ ప్రాంతం పచ్చని చెట్ల తో సుందరంగా ఉంటుంది. దేవాలయ పరిసరాల్లో దాదాపు ఎటు చూసినా పచ్చని అటవీ ప్రకృతి,కొండలు,వాగులు,వంకలు, పచ్చని పొలాలతో రమణీయంగా,ఆహ్లాదంగా కనిపిస్తుంది ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం విపరీతంగా నచ్చేలా ఉంటుంది. కార్తీక వనభోజనాలకు ఈ ఆలయ ప్రాంగంణం బాగా ఉపయోగపడుతుంది..ఈ ఆలయానికి దూర ప్రాంతం నుండి భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రస్తుతం ఈ ఆలయానికి నూతన ద్వార నిర్మాణం జరుపుతున్నారు. మాచర్ల నుండి ఈ ఆలయానికి 5 కి.మీ.ప్రయాణిస్తే చేరుకోవచ్చు. దుర్గి మండలం పోలేపల్లి,తేరాల గ్రామాల నుండి కూడా ఈ ఆలయానికి చేరుకోవచ్చు కాని,సరైన రహదారి నిర్మాణం లేదు. కాని మండాది నుండి వెళ్ళే అడ్డదారి లో నుండి ఈ ఆలయానికి వెళ్లే ప్రాంత రోడ్దు నిర్మాణం సరిగా లేదు,వర్షా కాలం లో ఈ రోడ్ల పై ద్వి చక్ర వాహనాలు,ఆటోలు వెళ్లాలన్నా అతి క్లిష్టంగా ఉంటుంది. ఈ ఆలయం పక్కనే కె.సి.పి.సిమెంట్ వారి మైనింగ్ యూనిట్ ఉంటుంది,ఈ ఆలయ అభివృద్ది,సౌకర్యాల కల్పన విషయం లో కె.సి.పి.సంస్త కృషి కూడా చాలా ఉంది. అతి పురాతన ఈ ఆలయం లో గుప్త నిధులు ఉండవచ్చని కొందరు దుండగలు ఈ ఆలయం ని గతం లో కొంత ద్వంసం చేసారు.అటవీ ప్రాంతం లో ఉండటం,రాత్రి వేళ సరైన రక్షణ లేకుండటమే దీనికి కారణమని తేరాల గ్రామస్తులు చెపుతున్నారు. అతి పురాతన,చారిత్రక ఆనవాళ్ళు ఉన్న తేరాల శ్ర్రీ భ్రమరాంభిక సిద్దేశ్వర దేవాలయం ను సంరక్షించుకోవాల్సిన భాద్యత దేవాదాయ శాఖ కు ఉంది. ప్రభుత్వంవారు,అధికారులు ఈ దేవాలయ విశిష్టత తెలుసుకొని మాచర్ల నుండి సరి అయిన రోడ్డు నిర్మాణం జరిపి, ఆలయం లో మరిన్ని సౌకర్యాలు కలుగచేస్తే, ఈ శ్ర్రీ భ్రమరాంభిక సిద్దేశ్వర దేవాలయం పల్నాడు ప్రాంతం లో మరొక కాశీక్షేత్రం లా ప్రసిద్ది పొందుతుంది.

సేకరణ :: పత్రికా మిత్రుల సౌజన్యం తో... జి.సిహెచ్. అనంతరామయ్య

Post a Comment

0 Comments