రైలు ప్రయాణం - చైన్ వెనుక సాంకేతికత.
రైలు ప్రయాణం అనేది కోట్లాది మంది జీవితాల్లో భాగంగా మారింది. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ఎదిగిన భారతీయ రైల్వే వ్యవస్థ శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆధునికత వైపు వేగంగా దూసుకుపోతుంది. దేశవ్యాప్తంగా వందశాతం ఎలక్ట్రిఫికేషన్ అందిస్తోంది. అంతే కాకుండా వందల బులెట్ ట్రైన్ ప్రాజెక్టులు, వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్లు. ఇవన్నీ కలిసి భారత రైల్వేను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయి.
అయితే రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి కోచ్‌లో "అత్యవసర పరిస్థితుల్లో రైలును ఆపాలంటే చైన్ లాగండి" అనే బోర్డు మనం గమనించవచ్చు. రైలులో ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, ప్రయాణికుడు ప్రమాదవశాత్తూ కింద పడినప్పుడు, లేదా మంటలు చెలరేగినప్పుడు రైలును వెంటనే ఆపడానికి ఈ చైన్ ఉపయోగపడుతుంది. కానీ ఇది ఎలా పనిచేస్తుంది? ఎప్పుడు ఉపయోగించాలి? దుర్వినియోగం చేస్తే ఏమవుతుంది? అనే విషయాలు మీకోసం ప్రత్యేకంగా.
చైన్ వెనుక సాంకేతికత.
రైలులోని ప్రతి బోగీ (కోచ్)లో ఉండే ఈ చైన్.. రైలు ప్రధాన ఎయిర్ బ్రేక్ సిస్టమ్‌తో నేరుగా అనుసంధానమై ఉంటుంది. ప్రయాణికుడు చైన్ లాగిన వెంటనే ఆ కోచ్‌లోని బ్రేక్ పైప్ వాల్వ్ తెరుచుకుంటుంది. దాంతో గాలి బలంగా బయటకు వెళ్లిపోవడం వల్ల ఎయిర్ ప్రెషర్ తక్షణమే తగ్గిపోతుంది. ఈ మార్పును ఇంజిన్‌లో ఉన్న ఎయిర్ ప్రెషర్ గేజ్ గుర్తిస్తుంది. వెంటనే అలారం మోగి, లోకో పైలట్ (రైలును నడిపే డ్రైవర్) దృష్టికి వస్తుంది.
లోకో పైలట్ తీసుకునే చర్యలు.
అలారం వినిపించగానే, పైలట్ వెంటనే రైలును ఆపడానికి చర్యలు తీసుకుంటాడు. మొదటగా మూడుసార్లు హారన్ మోగించి.. గార్డుకు, భద్రతా సిబ్బందికి సంకేతం ఇస్తాడు. తర్వాత బ్రేక్ వేస్తూ రైలును ఆపేస్తాడు. రైలు ఆగిన వెంటనే గార్డు, సెక్యూరిటీ సిబ్బంది ఏ కోచ్‌లో చైన్ లాగారో గుర్తించి అక్కడికి చేరుకుంటారు. కారణం ఏమిటో తెలుసుకుని అవసరమైతే సహాయక చర్యలు ప్రారంభిస్తారు. ఒకవేళ అది నిజమైన అత్యవసర పరిస్థితి అయితే తక్షణ రక్షణ చర్యలు, ప్రథమ చికిత్స, లేదా ఇతర సహాయం అందజేస్తారు.
ఎప్పుడు చైన్ లాగాలి?
• ఈ చైన్‌ను కేవలం అత్యవసర పరిస్థితుల్లోనే ఉపయోగించాలి.
• కోచ్‌లో మంటలు చెలరేగినప్పుడు,
• ప్రయాణికుడు అకస్మాత్తుగా కిందపడినప్పుడు,
• మహిళలు లేదా పిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు,
• అస్వస్థత, హార్ట్‌అటాక్ లేదా ఇతర ఆరోగ్య అత్యవసరాలు వచ్చినప్పుడు,
• రైలులో అపరాధ కార్యకలాపాలు (దొంగతనం, వేధింపులు) జరిగినప్పుడు.
• ఇలాంటి సందర్భాల్లో చైన్ లాగడం ద్వారా రైలును తక్షణమే ఆపి, ప్రాణ నష్టం జరగకుండా నివారించవచ్చు.
ఆకతాయితనం చేస్తే కఠిన శిక్షలు.
దురదృష్టవశాత్తూ చాలామంది సరదాగా లేదా కారణం లేకుండా చైన్ లాగుతుంటారు. ఇది భారతీయ రైల్వే చట్టం ప్రకారం నేరం. అలాంటి సందర్భాల్లో రూ.1,000 వరకు జరిమానా లేదా జైలుశిక్ష లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది. ఇంకా, ప్రయాణికుడిని రైల్వే పోలీసులు పట్టుకుని FIR నమోదు చేసి కోర్టులో హాజరు పరచవచ్చు. ఒకసారి చైన్ లాగితే, బ్రేక్ పైప్‌లోని గాలి మళ్లీ నింపే వరకు రైలు కదలదు. గార్డు లేదా డ్రైవర్ సిస్టమ్ రీసెట్ చేసి గాలి ఒత్తిడిని సరిచేస్తారు. ఈ ప్రక్రియకు సాధారణంగా 10 నుండి 15 నిమిషాలు పడుతుంది. అందువల్ల తప్పుడు అలారాలు రైలును ఆలస్యానికి గురిచేస్తాయి.
0 Comments