ఐస్ క్రీం ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలుసా ?
ఐస్ క్రీం తినడమే మనకు తెలుసు. కాని దానిని ఎవరు కనిపెట్టారు అనే ప్రశ్న వేసుకున్నా అది మనకు తెలియదు కాబట్టి దానిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వం చైనా వంటవాళ్ళు రకరకాల పండ్ల నుంచి గుజ్జును, రసాన్ని తీసి చల్లగా ఉండటం కోసమని దానిలో మంచు ముక్కలు కలిపి నిల్వచేసేవారట. అది ఐస్‌క్రీం తొలి రూపం అన్నమాట. నాలుగువేల ఏళ్ళ క్రితం ఒక చైనా చక్రవర్తి ఇంట్లో పని చేసే వంటవాడు చక్రవర్తిని మెప్పించడానికి పండ్ల గుజ్జులో మంచు ముక్కలు కలిపి వడ్డించాడు. అది చక్రవర్తికి బాగా నచ్చింది. రోజూ ఈ వంటకమే వడ్డించమన్నాడు. అలా ఐస్‌క్రీం క్రమంగా ఆదరణ పొందింది. నీరో చక్రవర్తి పండ్లను తేనెతో కలిపి మంచు ముక్కలతో పాటు తినేవాడట. అదీ ఒక ఐస్‌క్రీం లాంటిదే. 1550లో జూలియస్‌విల్లే ఫ్రాంక్ అనే వైద్యుడు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉప్పు కలిపిన ఐసు ముక్కలు ఉపయోగిస్తే ఐస్‌క్రీం మెత్తగా త్వరగా తయారవుతుందని కనిపెట్టాడు. 1620లో ఫ్రాన్స్‌కు చెందిన గెరాల్డ్ టిసైన్ అనే వ్యక్తి ఇప్పుడు మనం తింటున్న ఐస్‌క్రీంకు తుది రూపం ఇచ్చాడు.
అయితే మొదటి ఐస్‌క్రీం ఫ్యాక్టరీ తయారు కావడానికి చాలాకాలం పట్టింది. 1852లో జాకబ్ ఫస్సెల్ అనే పాలవ్యాపారి, పాలు అమ్మగా మిగిలిన మీగడను సద్వినియోగం చేసుకోవడానికి తొలి ఐస్‌క్రీం ఫ్యాక్టరీని నిర్మించాడు. అతడి ఐస్‌క్రీంలకు బాగా గిరాకీ ఏర్పడింది. ఇక ' కోన్ ఐస్‌క్రీం ' కూడా అనుకోకుండా రూపుదాల్చిందే. 1904 లో అమెరికాలో ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ ఐస్‌క్రీం అమ్ముతుండగా కప్పులు అయిపోయాయి. జనం ఎగబడుతుండే సరికి ఐస్‌క్రీం అమ్ముతున్న పెద్దమనిషి ఆ పక్కనే ఉన్న రొట్టెలను తెచ్చి వాటిని చుట్టచుట్టి వాటి మధ్యలో ఐస్‌క్రీం పోసి అమ్మాడు. అలా ' కోన్ ' వ్యాప్తిలోకి వచ్చింది.
ఈ విధంగా మనం ఐస్ క్రీంను తినగలుగుతున్నాం.
పుల్ల ఐసు :
చల్లగా, తియ్యగా, పుల్లగా రకరకాల రుచులలో ఉండే పుల్ల ఐసు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? స్కూలుకు వెళ్ళేప్పుడో స్కూలు నుంచి వచ్చేప్పుడో బండి వాడు అమ్ముతున్న ఐస్ ను కొనుక్కోకుండా ఎవరు ఉంటారు? పాలైసు, ద్రాక్షా ఐసు, ఆరెంజ్ ఐసు, సేమ్యా ఐసు, డబుల్ ఐసు... అబ్బా ఎంత బాగుంటాయో. మరి ఈ పుల్ల ఐసు ఎలా వచ్చింది అనంటే అనుకోకుండా వచ్చిందని చెప్పాలి. అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన 'ఫ్రాంక్ ఎవర్‌సన్' తన 11 ఏళ్ళ వయసులో 1905లో అనుకోకుండా దీనిని కనిపెట్టాడు. ఫ్రూట్ జ్యూస్‌ను డీప్‌ఫ్రిజ్‌లో పెట్టి మర్చిపోయిన ఎవర్సన్ మరుసటిరోజు ఉదయం దానిని తీసి చూస్తే గడ్డ కట్టి కనిపించింది. టేస్ట్ చూస్తే చాలా బాగుందనిపించింది. అప్పటి నుంచి అతడు ఫ్రూట్ జ్యూస్ లో పుల్ల గుచ్చి, డీప్ ఫఫ్రిజ్‌లో పెట్టి పుల్ల ఐసు తయారుచేయడం మొదలెట్టాడు. దానికి 'పాప్సికల్' అనే పేరు పెట్టాడు. అలా అలా అది అ దేశం నుంచి అన్ని దేశాలకు చేరింది.
అలాగే ఎగ్జిబిషన్‌లోనో, షాపింగ్ మాల్స్‌లోనో కనిపించే పింక్ కలర్ బొంబాయి మిఠాయి (కాటన్ కాండీ) ని 1897 లో 'విలియం మొరిసన్, జాన్ సి వార్టన్' అనే అమెరికా వ్యక్తులు తయారు చేశారు. కలర్ చక్కెరను మిషన్ తిరగలిలో వేసి దూదిపొరల్లాంటి బొంబాయి మిఠాయిని వాళ్ళు తయారు చేశారు. 1904లో ఒక ట్రేడ్ ఫెయిర్‌లో దీనిని మొదటిసారిగా అమ్మారు. అప్పటి నుంచి ప్రతి ఎగ్జిబిషన్‌లో అది కనిపిస్తూనే ఉంది.
0 Comments