పంది మూత్రపిండం భలేగా పనిచేస్తోంది.
న్యూయార్క్: వైద్య రంగంలో మరో అద్భుతం జరిగింది. అవయవ మార్పిడిలో సరికొత్త అధ్యాయానికి ముందడుగు పడింది. అమెరికాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు ఇటీవల పంది మూత్రపిండాన్ని మానవ శరీరానికి తాత్కాలికంగా అమర్చారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, మనిషి శరీరంలో పంది కిడ్నీ సాధారణంగానే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో అవయవమార్పిడి సర్వ సాధారణమే అయినప్పటికీ.. అవయవాల కొరత వేధిస్తోంది.
ఇందుకు పరిష్కారం కనుగొనే దిశగా శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనషులకు అమర్చే అంశంపై పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూయార్క్‌లోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన రోగికి పంది మూత్రపిండం అమర్చాలని నిర్ణయించారు. ఇందుకు ఆ రోగి బంధువులు కూడా అంగీకరించడంతో గత నెల ఆపరేషన్ నిర్వహించారు. పంది మూత్రపిండాన్ని రోగి శరీరానికి అమర్చి మూడు రోజల పాటు పరిశీలించారు.
ఈ మూత్రపిండం సాధారణంగానే పనిచేసిందని, రోగనిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేదని సర్జన్ డా. రాబర్డ్ మోంట్గోమెరి తెలిపారు.
అవయవాల కొరతకు పరిష్కారం కనుగొనే క్రమంలో గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు పందుల అవయవాలపై దృష్టి పెట్టారు. అయితే దీంట్లో కొన్ని సమస్యలున్నాయి. పంది కణాల్లోని గ్లూకోజ్ మనిషి శరీర వ్యవస్థకు ఇది సరిపోలడం లేదు. దీంతో ఇది రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి తిరస్కరణకు గురవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చేసిన ప్రయోగంలో జన్యు సవరణ చేసిన పంది నుంచి అవయవాన్ని సేకరించారు. పంది కణాల్లో చక్కెర స్థాయిలను తొలగించి, రోగ నిరోధక వ్యవస్థకు దాడిని నివారించేలా జన్యువుల్లో మార్పులు చేశారు. జన్యు పరంగా మార్పులు చేసిన పందులను గాల్‌సేఫ్‌గా పిలుస్తారు. గాల్‌సేఫ్‌లను మాంసం అలర్జీ ఉన్నవారికి ఆహారంగానూ, మానవ చికిత్సలో వనరులుగా వినియోగిస్తున్నారు.
వీటికి అమెరికా ఫుడ్, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ 2020లో ఆమోదం తెలిపింది.
0 Comments