GET MORE DETAILS

Creativity: సృజనాత్మకతను పెంచుకోండిలా...!

 Creativity: సృజనాత్మకతను పెంచుకోండిలా...!




❋ ఏ రంగంలోనైనా సృజనాత్మకత ఉంటేనే గుర్తింపు లభిస్తుంది. ప్రస్తుత అవసరాలకు, పరిస్థితులకు అనుగుణంగా మెదడుకు పని చెప్పి వినూత్న, విభిన్న ఆలోచనలు వెలికితీసేవారే కెరీర్‌లో దూసుకెళ్లగలరు. కొందరు స్వతహాగా సృజనాత్మకంగా ఆలోచించగలరు. మరికొందరు సృజనను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. భిన్నంగా ఆలోచించడం, ఆలోచనలు అమలు చేయడం వంటి విషయాల్లో కొన్ని చిట్కాలు పాటిస్తే సృజనాత్మకత పెరిగే అవకాశముంది. అవేంటో చూద్దాం..

❋ వచ్చిన ఆలోచనలను వెంటనే పుస్తకంలో రాయడం అలవాటు చేసుకోండి. దీనివల్ల వాటిని మరచిపోతామన్న భయం పోతుంది. అలాగే ఆలోచనలను రాసుకోవడం వల్ల మెదడులో కొత్త ఆలోచనలు వచ్చి చేరుతాయి. ‘బ్రెయిన్‌ డంపింగ్‌’ పద్ధతి ద్వారా మెదడులో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

❋ మనమేంటో మన స్నేహితులను చూస్తే తెలుస్తుందట. కాబట్టి తెలివైన, మంచి మిత్రులతో స్నేహం చేయడం ద్వారా.. జ్ఞానం పెరుగుతుంది. వారితో చేసే సంభాషణలు, వాదనల్లో ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి.

❋ మంచి పాటలు వినండి. సృజనాత్మకత, భావోద్వేగాలు కలిగించే మెదడు ప్రాంతాన్ని సంగీతం ఉత్తేజపరుస్తుందట. ముఖ్యంగా శాస్త్రీయ సంగీతం సృజనాత్మకతను ప్రేరేపించడంలో ముఖ్యపాత్ర వహిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

❋ ఒక విషయంపై మీరో అభిప్రాయానికి వచ్చారనుకోండి. దాని గురించి మరొకరికి చెప్పి వారేమనుకుంటున్నారో కూడా తెలుసుకోండి. ఇతరుల అభిప్రాయం తెలుసుకోవడం ద్వారా మీరు ఊహించిన విషయాలు భిన్నంగా ఉండొచ్చు. దీంతో కొత్తకోణంలో ఆలోచించే అవకాశాలుంటాయి. కాబట్టి మీరు మాత్రమే ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేయకుండా.. ఇతరులతో చర్చించండి.

❋ ధ్యానం చేయడం మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. దీనివల్ల ఏకాగ్రత పెరగడమే కాదు, భిన్నమైన కొత్త ఆలోచనలు చేసే శక్తి పెరుగుతుంది. ఎప్పుడైనా కొత్తగా ఆలోచించలేకపోతే కాసేపు ధ్యానం చేసి ఆ తర్వాత ప్రయత్నించండి. కచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.

❋ మీ ముందు కనిపించేవాటి గురించే కాదు.. మీకు కనిపించని ప్రాంతాల గురించి, భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఆలోచించండి. మీరు కూర్చున్న చోటే కూర్చొని మరో ప్రాంతంలో కూర్చునట్లు ఊహించుకోండి. అక్కడో సమస్య వచ్చిందని అనుకోండి.. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించండి.

❋ ఇప్పుడు ఏదైనా రాసుకోవాలంటే.. ఫోన్‌లోని నోట్‌ప్యాడ్‌లోనో, కంప్యూటర్‌లోనో టైప్‌ చేస్తుంటారు. కానీ సృజనాత్మకత పెరగాలంటే చేతితో రాయాలని నిపుణులు చెబుతారు. ఇకపై ఏదైనా రాయాలనుకుంటే కీబోర్డుకు బదులు పెన్ను పట్టుకోండి.

❋ ఏదైనా వివరించేటప్పుడు చేతులకు పని చెప్పండి. సెమినార్‌, మీటింగ్‌, స్నేహితులతో ముచ్చట్లు.. ఇలా ప్రతిచోటా మనం మాట్లాడుతుంటాం. ఇతరులకు విషయాలు చెబుతున్నప్పుడు చేతులు ముడుచుకొని, వెనక్కిపెట్టుకుని మొక్కుబడిగా చెప్పకుండా మీ చేతుల్ని మాటల్లో భాగం చేయండి. మీ చేతులను కదుపుతూ వివరణ ఇవ్వండి. ఇలా చేస్తే మాటలు మరింత అర్థవంతంగా ఉండటంతోపాటు.. చెప్పే విధానం, ఇతరులు వినే విధానం మారుతుంది.

❋ కళ్లకు వ్యాయామం చేయించండి. అప్పుడప్పుడు రెండు కనుగుడ్లను పైకి కిందకు, దగ్గరికి దూరంగా కదుపుతుండండి. దీనివల్ల మెదడు కుడి, ఎడమ భాగాల మధ్య సమన్వయం బాగుంటుందని ఓ సర్వేలో తేలింది. సృజన అవసరమైనప్పుడు ఈ వ్యాయామం చేసి చూడండి. చక్కటి ఆలోచనలు వస్తాయట.

❋ కొన్నిసార్లు నిలబడటం కన్నా నేలపై పడుకోవడం ద్వారా సృజనాత్మకత బాగుంటుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. కొందరికి పజిల్స్‌ ఇచ్చి పరిష్కరించమని చెబితే.. నిలుచున్నవారి కంటే నేలపై పడుకున్నవారే పరిష్కరించగలిగారని పరిశోధకులు పేర్కొన్నారు.

❋ మనం ఉండే మానసిక స్థితిని బట్టి సృజనాత్మకత ఆధారపడి ఉంటుంది. సంతోషకరమైన వాతావరణంలో ఇది ఎక్కువగా ఉంటుందని, మానసిక స్థితి బాగోలేకపోతే సృజనాత్మకత ఉండదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి మానసిక స్థితి సరిగ్గా లేకపోతే నవ్వండి. బాగా నవ్వడం ద్వారా మానసిక స్థితి సాధారణంగా మారడంతోపాటు కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది.

❋ వ్యాయామం.. శారరీక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అది మనుషుల మూడ్‌ను మార్చేయడంతోపాటు, సృజనాత్మకతను రెండు రెట్లు పెంచుతుందట.

❋ బయటకు వెళ్లడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఇల్లు లేదా ఆఫీసుల్లో ఎప్పుడూ ఒకేచోట ఉండటం వల్ల సృజనాత్మకత రాదు. తరచూ బయటకు వెళ్లడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం వల్ల మెదడు ఉత్తేజం చెంది కొత్త ఆలోచనలు చేసే వీలు కలుగుతుంది.

❋ మంచి నిద్ర.. మంచి ఆలోచనలు కలగడానికి దోహదపడుతుంది. కనీసం 7-8గంటలు నిద్రపోతేనే మెదడుకు కావాల్సిన విశ్రాంతి, మేధో మథనానికి శక్తి లభిస్తుంది. రాత్రిపూట నిద్రే కాదు, పగటిపూట తీసే కునుకు కూడా సృజనాత్మకత పెరగడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments