GET MORE DETAILS

పూర్వం గుర్రాలకు రెక్కలుండేవా...? ఏమో...!

 పూర్వం గుర్రాలకు రెక్కలుండేవా...? ఏమో...!
పూర్వం గుర్రాలకు కూడా బలమైన రెక్కలుండేవట. ఆ రెక్కల సాయంతో విచ్చలవిడిగా లోకమంతా తిరుగుతూ  మానవజాతిని ధిక్కరించి సంచరించి నష్టపరిచేవట. అమితమైన అశ్వశక్తితో అవి కల్గించే నష్టాన్ని పెట్టేబాధలను భరించలేక మానవులు దేవేంద్రునితో మొరపెట్టుకొన్నారట. దేవేంద్రుడేమో బ్రహ్మదేవుని ఆశ్రయించి దేవదేవా ప్రభు ఓ సృష్టికర్తా హయములనుండి సంభవించే మానవుల ఇడుములు కావమన్నడట. సరే ఇకనుండి గుర్రాలకు రెక్కలులేకుండా సృష్టిస్తానని బ్రహ్మ హామీ  ఇచ్చాడట. అప్పటినుండి సృష్టిలో  గుర్రాలకు రెక్కలులేకుండా సృష్టించాడట. 

ఈ చర్యతో దేవేంద్రుడు సంతోషించాడట, మానవులు తప్ప. ఎందుకంటే అప్పటికే రెక్కలతో పుట్టిన తురగరాజుల తగాదాలు అలాగే వుండిపోయాయట. రెక్కలున్న గుర్రాల ఆగడాలకు అడ్డుకట్ట వేసేటందుకు ఇంద్రుడు, శాలిహోత్రుడనే గంధర్వుడిని పిలిచి గుర్రాల రెక్కలన్నింటిని ఖండించమని ఆజ్ఞాపించి ఆ పనికై ఇంద్రాయుధాన్ని దివ్యశక్తులను ప్రసాదించాడట. దాంతో శాలిహోత్రుడు భూలోకంలో గుర్రాలను వెతకివెతకి వాటి రెక్కలన్నింటని ఖండించాడట. తమ రెక్కలబలం తగ్గడంతో గుర్రాలన్ని డీలాపడిపోయాయట. ఈ తేజీల ధైన్యస్థితికి జాలిపడి శాలిహోత్రుడు బ్రహ్మదగ్గరకు వెళ్ళి అశ్వాల ధీనస్థితిని వివరించి కరుణించాల్సిందిగా ప్రార్థించాడట. జాలిపడిన చతుర్ముఖుడు గుర్రాలరెక్కలశక్తిని వాటి కాళ్ళకు ఇస్తున్నానని, మనుష్యులకు అవిలోబడివుండాలని చెప్పి, గుర్రాలకు కూడా హెచ్చరించాడట. అదిగో ఆనాటినుండి గుర్రాలకాళ్ళకు అమితమైన శక్తి లభించిందట. రెక్కలబలం కాల్లకు రావడంతో గుర్రాలు పరుగులో మేటి అయ్యాయట. 

మానవులు గుర్రాలను మచ్చికచేసుకొని యుద్ధ సాధనంగాను, రవాణారంగంలోను ప్రయాణానికి వాహనంగాను వినియోగించసాగాడట.

 హిందూపురాణాలలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగావున్న పురాతన నాగరికతలన్నింటిలోనూ ఈ రెక్కల గుర్రాల ప్రస్తావన వుంది. గ్రీకు పురాణాలమేరకు  పెగాసస్ ఓ పౌరాణికరెక్కలగుర్రం. వాల్ కైరి అనే రోమన్ వీరుడు యుద్ధంలో చనిపోయిన వ్యక్తుల ఆత్మలను తీసుకొని రెక్కలగుర్రంపై ప్రయాణించి వాటినిస్వర్గానికి చేర్చాడు.

టియన్మా అనే రెక్కలగుర్రం, చైనీయుల పురాణాల ప్రకారం Chollima నుండి ఉద్భవించి మానవులకు దేవతలకు వాహనంగా ఉపయోగపడింది.

క్రైస్తవంలో గాబ్రియ అనే రెక్కల గుర్రముంది. ముస్లీంల ఇళ్ళలో రెక్కలున్న గుర్రంఫోటోలను పవిత్రంగా వుంచుకోవడం చూస్తున్నాం.

తుల్పర్ అనేది టర్కిపురాణాల ప్రకారం వేగవంతమైన అశ్వరాజం.

పాలసముద్రంనుండి రెక్కలుగల ఉచ్చెైశ్వము పుట్టినసంగతి మనకు తెలుసు.

గుర్రం దాదాపుగా 45 లక్షల సంవత్సరాల కిందట జీవంపోసుకొంది. అప్పటి గుర్రాలకు మిగతా పశువులలాగే ఒకకాలికి రెండు గిట్టలుండేవి పరిమాణం (ఆకారం) కూడా చాలాచిన్నదిగా వుండేది.అయితే జీవపరిణామక్రమంలో అహారాన్వేషణకు మాంసాహార జంతువులనుండి రక్షించుకోటానికి  వేగంగా పరిగెత్తటానికి కాలికి ఒకేగిట్ట ఏర్పడం జరిగింది. ఇదో పరిణామక్రమమన్నమాట.

 ఇప్పటికి దాదాపుగా ఆరువేల సంవత్సరాల కిందటనే మానవుడు గుర్రాన్ని మచ్చికచేసుకొని వ్యవసాయానికి రవాణాకు ఉపయోగించడం నేర్చుకొన్నాడు.

గుర్రం జీవితకాలం 25 సం॥రాలనుండి 30॥ సంవత్సరాలు మాత్రమే. కాకపోతే కొన్ని ప్రత్యేకపరిస్థితులలో  అంటే జంతుప్రదర్శనశాలలు మొ॥ చోట్ల 40 సంవత్సరాల వరకు బ్రతికే అవకాశముంది.19వ శతాబ్దిలో ఓల్డ్ బిల్డిరకానికి చెందిన గుర్రమెుక్కటి 62 సంవత్సరాలు బ్రతికినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. గిన్నిస్ రికార్డు మేరకు అత్యంతకాలం అనగా 56 సంవత్సరాల నివసించిన గుర్రంవుంది.

భారతదేశంలో చతురంగబలాలలో అశ్వదళం ప్రముఖమైంది.ఒకపుడు భారతదేశయుద్ధాలలో ఏనుగు ప్రముఖపాత్ర వహించగా అరబ్బుల రాకతో మేలుజాతి గుర్రాలు సైనికదళంలో చోటు చేసుకొన్నాయి.

అలాగని భారతీయులకు గుర్రాలగురించి తెలియదనుకొవడం పొరబాటు. సూర్యుని రథానికి ఏడుగుర్రాలున్నాయి. శ్రీరాముడు అశ్వమేధయాగం చేశాడు. నకులసహదేవులు అశ్వగోశాస్త్రాలలో నిష్ణాతులు. దమయంతి చేపట్టిన బూటకపు స్వయంవరాన్ని చేరుటకు శీఘ్రవేగంతో గుర్రాలను పూన్చిన రథాన్ని తోలాడు. శాతవాహనులు, ఇక్వాకులు ఆనందగోత్రీకులు అశ్వమేధయాగాలు చేశారు.

 అశ్వమేధయాగానికి ఉపయోగించే అశ్వశరీరం పూర్తిగా తెల్లగావుండి చెవులుమాత్రం నల్లగా వుండాలి.

అశ్వశాస్త్రంలో  శాలిహోత్రుడు, నలుడు, అశ్వనిదేవతలు, నకుల సహదేవులు నలుడు మొ॥వారు ప్రముఖులు. మన అశ్వశాస్త్రం ప్రకారం గుర్రాల గుణకర్మల ఐదురకాలుగా విభజించారు. అవి బ్రాహ్మణం, వైశ్య, క్షత్రియ, శూద్ర, చండాల. వీటిలో పై నాలుగు లక్షణాల మేలుకలయికే చండాలం. పరమోత్క్రష్టమైనది, పూజనీయమైనది కూడా.

తెల్లనివి నల్లనివి ఎర్రనివి పసుపుపచ్చ వర్ణావుతోనున్న గుర్రాలను శుద్ధమని అంటారు.

జూలు తోకవెంట్రుకలు శరీరరోమాలు చర్మం గిట్టలు  తెల్లగావుంటే శంభావనమంటారు.

జూలు మాత్రమే తెల్లగావుండి మిగతా శరీరం  నల్లగా వుంటే కర్తలమన్న మాట.


✅ శ్రీకృష్ణుడి గుర్రాల పేర్లు ఉచ్ఛైశ్వర్య, శేభ్య, సుగ్రీవ.

✅ అర్జునుడి గుర్రంపేరు శ్వేతవాహన.

✅ జాన్సీలక్ష్మి గుర్రాల పేర్లు సారంగి, పవన్‌, బాదల్.

✅ అలెగ్జాండర్ గుర్రంపేరు బుసెఫెలస్ (Bucephalus).

✅ మహరాణా ప్రతాప్ సింగ్ గుర్రం పేరు చేతక్.


జిబి.విశ్వనాథ, 9441245857, అనంతపురం.

Post a Comment

0 Comments