GET MORE DETAILS

బుద్ధునిపై బ్రాహ్మణసన్యాసులు కోపగించటానికి కారణమేమిటో...?

బుద్ధునిపై బ్రాహ్మణసన్యాసులు కోపగించటానికి కారణమేమిటో...?
ఈ ప్రపంచసుఖాలపై విముఖత కలిగిన గౌతముడు అంత:పురంలో నిదురిస్తున్న భార్య యశోధరను కొడుకు రాహులుడిని చివరిసారిగా చూచి, చెన్నుడు ఏర్పాటుచేసిన గుర్రంపైనెక్కాడు.  వెళ్ళిపోతున్న సిద్ధార్థుడిని ఆపటానికి చెన్నుడు ప్రయత్నించాడు. తానెందుకు వెళుతున్నానో చెన్నుడికి వివరించాడు. తోటలో గుర్రాన్ని తన ఆభరణాలను చెన్నుడికి ఇచ్చాడు. తన వద్దగల కత్తితో గడ్డం, తలవెంట్రుకలు తీసుకొన్నాడు.

చెన్నుడు అంత:పురం చేరి రాజుకు గౌతముడు వెళ్ళిపోయిన సంగతి చెప్పాడు. దీనినే మహాభినిష్క్రమణం అంటారు.

సిద్ధార్థుడు అనేక రోజులపాటు అనేక గ్రామాలు తిరిగాడు. చివరకు వైశాలినగారాన్ని చేరి అక్కడ 'అలారకమల ' అనే గురువును ఆశ్రయించి సాంఖ్యదర్శనవిజ్ఞానంలో  గొప్పపాండిత్యాన్ని పొందాడు. అయినప్పటికి ఈ విద్యలేవి అతనికి తృప్తినివ్వలేదు.

తరువాత మగధరాజధాని రాజగృహానికి చేరాడు. వీధులలో బిక్షాటన చేస్తున్న సిద్ధార్థున్ని రాజు బింబిసారుడు  గుర్తించి సిద్ధార్థుని ప్రయత్నాన్ని విరమింపచేయాలని చూశాడు. చివరకు తన రాజ్యాన్ని కూడా అర్పిస్తానని చెప్పాడు. అయినప్పటికి సిద్ధార్థుడు కాదన్నాడు. అయితే తనకు జ్ఞానోదయమైన తరువాత బింబిసారుడిని తప్పకకలుస్తానని మాటిచ్చాడు.

రాజగృహంలోనే కొన్నాల్లుండి ఉద్దాకరామపుత్రుడు (రుద్రకరామపుత్ర) అనే గురువుదగ్గర  ఉపదేశాలు విన్నాడు.

అయినప్పటికి అతనికి తృప్తి కలుగలేదు. ఐదుమంది బ్రాహ్మణపరివ్రాజకులు ( సన్యాసులు) శిష్యులైనారు.

తరువాత బుద్ధుడు ఉరువేల ప్రాంతాన్ని చేరాడు. అక్కడ హఠయోగం, రాజయోగాలను నేర్చుకొన్నాడు. అయినప్పటికి సిద్ధార్థునికి తృప్తి కలుగలేదు.అక్కడే కఠినఉపవాస దీక్షలు చేసి శరీరాన్ని శుష్కింప చేయసాగాడు. ఆరు సంవత్సరాలపాటు కఠినవుపవాస దీక్షచేశాడు. ఉపవాసాల వలన ప్రయోజనం లేదని కొద్దికొద్దిగా ఆహారాన్ని తీసుకోవడం ప్రారంభించాడు. సిద్ధార్థుడు ఆహారం భుజిస్తూ ఇహలోక సుఖాలను అలవర్చుకొని లక్ష్యానికి దూరమైతున్నాడని ఆ పరివ్రాజకులు భావించి కొపగించి సిద్ధార్థున్ని వదిలేసి వెళ్ళిపోయారు.

ఉరువేలలో అశ్వత్తవృక్షం ( బోధివృక్షం / రావిచెట్టు) కింద ధ్యానానికి కూర్చున్నాడు. చెట్టుకింద ధ్యానముద్రలోనున్న సిద్ధార్థుని చూచి సుజాత అనే స్త్రీ భోజనం పెట్టింది. ఏడువారాల ధ్యానం తరువాత వైశాఖపౌర్ణమి రోజున సిద్ధార్థునికి జ్ఞానోదయం కలిగింది, సిద్ధార్థుడు బుద్ధుడైనాడు. జ్ఞానోదయం వలన కలిగిన ఆనందంలో  నలభైఐదురోజులు ఏకాంతంగా నిశ్చలంగా వుండిపోయాడు.

తాను తెలుసుకొన్న సత్యాలను మొదటగా తన్నోదిలేసి వెళ్ళిపోయిన బ్రాహ్మణపరివ్రాజకులకు బోధించాలని బుద్ధగయ (ఉరువేల ) ను వదలి వారణాసి సమీపంలోని మృగవనం (జింకలవనం) లో ఆ ఐదుమందిని కలిసివారికి తన సిద్ధాంతాలను బోధించాడు. బుద్ధధర్మాన్ని అనుసరించి వారు బుద్ధునిశిష్యులైనారు. దీనినే ధర్మచక్రపరివర్తనమంటూరు. బౌద్ధసంఘం స్థాపించారు.

బుద్ధుడి బోధనలలో ప్రముఖమైనవి నాలుగు ఆర్యసూత్రాలు, అవి (1) దు:ఖం.అంటే జీవితమంటేనే దు:ఖమని అర్ధం. (2) దు:ఖకారణం, కోరికలే దు:ఖానికి కారణం (3) దు:ఖనివారణ, కోరికలను అదుపులోవుంచుకోవడం వలన దు:ఖాన్ని నిరోధించవచ్చును. (4) దు:ఖనివారణా మార్గం, దానికి ఎనిమిది సూత్రాలను లేదా అష్టాంగమార్గాన్ని అనుసరించాలి.ఆ అష్టాంగమార్గాలేమిటో మీకు తెలుసు.


జి.బి.విశ్వనాథ, 9441245857, అనంతపురం.

Post a Comment

0 Comments