GET MORE DETAILS

ఆ కళాశాలకు 50 ఏళ్ల చరిత్ర ఉంది - చదువు చెప్పడమే కాదు, కొలువు దీరేవరకూ బాధ్యత తీసుకుంటుంది.

 ఆ కళాశాలకు 50 ఏళ్ల చరిత్ర ఉంది - చదువు చెప్పడమే కాదు, కొలువు దీరేవరకూ బాధ్యత తీసుకుంటుంది. ఈ కళాశాలలో చదువుకున్న వేల మంది మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కంచరపాలెంలో ఉన్న కెమికల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ (గైస్‌) ప్రగతి పథంలో దూసుకుపోతోంది. 17వ తేదీనాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు..మరెంతో ఖ్యాతి సొంతం చేసుకుంది. విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటూ వారిని ఉన్నత స్థానాల్లో నిలబెడుతోంది. 

కళాశాల ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకుని ప్రతిష్టాత్మక సంస్థగా నిలబడం అంటే మాటలు కాదు. ఇది సాధించాలంటే ఇక్కడ పని చేసే కళాశాల పెద్దలు, సిబ్బందిలో చిత్త శుద్ధి అవసరం. ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాళ్లతోపాటు, అధ్యాపకులు, ఇతర కార్యాలయం సిబ్బంది ఈ కాలేజీ ఎదుగుదలలో విశిష్ట సేవలు అందించారు. ప్రాంగణంలో సౌకర్యాల కల్పన, విద్యార్థులకు అందించే ఉత్తమ విద్యలో రాజీ లేకుండా పనిచేయడంతో పాటు కాలేజీ చదువులు ముగిశాక విద్యార్థులకు ఉద్యోగాలు అందించంలో వీరు కృతకృత్యులయ్యారు. దీంతో రాష్ట్రంలోనే ప్రాంగణ నియాయమాకల నిర్వహణ ద్వారా నూరు శాతం ఉద్యోగావకాశాలు కల్పించిన కాలేజీగా ఈ ఏడాది గుర్తింపు పొందింది. దీంతో సగర్వంగా నిలదొక్కుకుని 51వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది కెమికల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ (గైస్‌). ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడురోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. 

కంచరపాలెంలోని ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగు కాలేజీ (కెమికల్‌ ఇంజినీరింగు కాలేజి) 1985లో ఏర్పాటు చేశారు. దీన్ని మొదట్లో గవర్నమెంటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నిషియన్‌ కోర్సెస్‌ (జీఐఏటీసీ)గా ఏర్పాటు చేశారు. 1986లో దీనికి గవర్నమెంటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెస్టు డిప్లమా కోర్సెస్‌ ఇన్‌ ఇంజినీరింగు అండ్‌ టెక్నాలజీ (జీఐపీడీసీఈ అండ్‌ టి)గా మార్చారు. మళ్లీ 2008లో  గవర్నమెంటు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ ఇంజినీరింగు కాలేజీ (కెమికల్‌ ఇంజినీరింగు కాలేజి)గా పేరు మార్చి దీన్ని కొనసాగిస్తున్నారు.  

ప్రాధాన్యత : 

ఇక్కడి కెమికల్‌ ఇంజినీరింగు కాలేజీ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక కాలేజీగా గుర్తింపు పొందింది.  డిప్లమా స్థాయిలో కెమికల్‌ అండ్‌ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన నాలుగు కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీగా ఇదొక్కటే. హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, స్టీల్‌ ప్లాంటు విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున ఇక్కడి విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇవి కాకుండా విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్‌ ఏర్పాటుతో మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పార్మాసిటీలో అనేక పార్మా కంపెనీలు ఉన్నాయి. దువ్వాడలోని స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలోని పారిశ్రామిక కారిడార్స్‌కు కెమికల్‌ ఇంజినీరింగు విద్యార్థులు అవసరం ఉంటుంది.  

ఏఏసీటీఈ గుర్తింపు :

కాలేజీలో నిర్వహిస్తున్న కోర్సులకు ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ గుర్తింపు ఉంది. నాలుగు కోర్సుల్లో చేరాలంటే పాలిసెట్‌లో ర్యాంకుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వార్షిక ఫీజు రూ.3800లు. ఏడాదికి లక్షలోపు ఉన్న బీసీ/ఓసీ విద్యార్థులకు, రెండు లక్షల లోపు ఆదాయ ఉన్న ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు రూ.600లు మాత్రమే ఫీజు చెల్లించే అవకాశం ఉంది. జూన్‌లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.

మొదటి సంవత్సరంలో బేసిక్‌ సైన్సు, ఇంజినీరింగు సబ్జెక్టులు, రెండో ఏడాదిలో ప్రతి కోర్సుల్లోనూ  కెమికల్‌ ఇంజినీరింగ్‌తో సంబంధం ఉన్న అల్లీయ్డ్‌ ఇంజినీరింగు సబ్జెక్టులు మెకానికల్‌ ఇంజినీరింగు, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌తో పాటు వారి స్పెషలైజేషన్‌ సబ్జెక్టులు (ప్యూర్‌ బ్రాంచి)బోధిస్తారు. మూడో ఏడాది 5, 6 సెమిస్టర్లో విద్యార్థులను ఇండ్రస్టియల్‌ ట్రైనింగ్‌కు పంపిస్తారు. బోర్డ్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌షిప్‌ (బోట్‌) పర్యవేక్షణలో జరుగుతుంది. ఇండ్రస్టియల్‌ ట్రైనింగ్‌ సమయంలో విద్యార్థులకు రూ.2890 స్టైఫండ్‌ ఇస్తారు. ఏడవ సెమిస్టర్‌లో మిగతా అకడమిక్‌ సబ్జెక్టులు బోధిస్తారు. నవంబర్‌–అక్టోబర్‌లో కోర్సు పూర్తవుతుంది. 

ఉద్యోగాల సాధనలో బాలికల రికార్డు :

కెమికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు చదివితే బాలికలకు ఉద్యోగావశాలు రావనే పాత నమ్మకాలకు పాతర వేసే విధంగా ఈ కాలేజీ నిర్ణయం తీసుకుంది. అందుకే ప్రతి ప్రాంగణ నియామకాల్లోనూ బాలికలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటరమణ ప్రత్యేక ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఈ కాలేజీల నుంచి 170 మంది ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించగా బాలికలు ఉద్యోగాల సాధనలో అర్ధ సెంచరీ సాధించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు.

అంతే కాకుండా మల్టీనేషనల్‌ కంపెనీల్లో వీరు ఉద్యోగాలు సాధించడం మరో కొత్త మలుపుగా చెప్పవచ్చు. ఒక అకడమిక్‌ సంవత్సరంలో 50 మంది బాలికలు ప్రభుత్వ డిప్లమా ఇంజినీరింగ్‌ కాలేజీలో ఉద్యోగాలు సాధించడం ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాలేదు. దీంతో ఈ కాలేజీకి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఈకాలేజీకి చెందిన ఓ విద్యార్థిని రూ.5.44లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందింది. 

కెమ్‌దోసా సహకారం :

కెమికల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం (కెమ్‌దోసా) కాలేజీ అభివృద్ధికి తన వంతుగా సాయం అందిస్తోంది. కాలేజీ ఏర్పాటు చేసి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు, ఆయిల్‌ టెక్నాలజీ, ప్లాస్టిక్‌ అండ్‌ పాలిమర్స్, పెట్రోకెమిల్స్‌ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి  25ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ ఉత్సవాలు ఒకేసారి నిర్వహిస్తున్నారు. దీనికి కెమ్‌దోసాతోపాటు ఇతర దాతలు పూర్తి సహకారం అందిస్తున్నారు. 

ఉద్యోగాల కల్పనలో మేటి :

విద్యార్థులు కోర్సు ఆఖరి సంవత్సరంలోనే అనేక రాష్ట్ర, జాతీయ కంపెనీలతోపాటు మల్టీ నేషనల్‌ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు పొందుతున్నారు.  వీరు 19ఏళ్లకే ప్రారంభంలో రూ.18000–50,000లు నెలవారి జీతాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు కంపెనీల్లో వీరు ఉద్యోగాలు పొందుతున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ జరుగుతోంది. దీంతో ఈ కాలేజీకి డిమాండు పెరిగింది. ప్రాంగణ నియామకాల్లో ఈ కాలేజీకి చెందిన విద్యార్థులు రూ.5.54లక్షల అత్యధిక వార్షిక వేతనం పొందడం గమనార్హం. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతర్, మలేషియా, సింగపూర్‌లలో ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు. 

కోర్సుల వివరాలు :

డిప్లమా స్థాయిలో కెమికల్‌ ఇంజినీరింగు, పెట్రో కెమికల్‌ ఇంజినీరింగ్, ప్లాస్టిక్స్‌ అండ్‌ పాలిమర్స్, ఆయిల్‌ టెక్నాలజీ విభాగాల్లో ఒక్కొక్క విభాగానికి 60సీట్లు చొప్పున కోర్సులు నిర్వహిస్తున్నారు.

పారిశ్రామిక శిక్షణకు ప్రాధాన్యం :

విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తయారు చేయడానికి పారిశ్రామిక శిక్షణ, స్కిల్‌ డవలప్‌మెంటుకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. దీని వల్ల వీరు పాస్‌అవుట్‌ కాగానే వివిధ పరిశ్రమాల్లో ఉద్యోగాలు సాధించడానికి వీలవుతుంది. నూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్సు (హైదరాబాదు), ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ (మెదక్‌), సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(ఇస్రో–షార్‌) (శ్రీహరికోట), కేసీపీ సుగర్స్‌ అండ్‌ ఇండ్రస్టియల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (వుయ్యూరు), ఆంధ్రా సుగర్స్‌ లిమిటెడ్‌ (తణుకు), ఇంటర్నేషనల్‌ పేపర్స్‌ లిమిటెడ్‌ (రాజమండ్రి), పరవాడలోని విజయశ్రీ ఆర్గానిక్స్, వెర్డెంట్‌ లైఫ్‌ సైన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌టీపీసీ), మైలాన్‌ ల్యాబరేటరీస్, టయోట్సు రేర్‌ ఎర్త్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌–అచ్చుతాపురం, విశాఖపట్నంలోని కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్, ది ఆంధ్రా పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్, ఈస్టిండియా పెట్రోలియం ప్రైవేట్‌ లిమిటెడ్, ది ఆంధ్రా పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్, విశాఖపట్నం కోఆపరేటివ్‌ డైరీ, హెవీ ప్లేట్స్‌ అండ్‌ వెసల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌ లిమిటెడ్‌–పైడిభీమవరం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వీరికి పారిశ్రామిక శిక్షణ ఇస్తున్నారు. 

అందరికీ ఉద్యోగావకాశాలు :

అందరికీ ఉద్యోగావకాశాలు నినాదంతో పనిచేస్తున్నాం. ఆదిశగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రణాళిక అమలు చేస్తున్నాం. కాలేజీలో విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. నూతన భవన సముదాయం నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేసేందుకుందుకు చర్యలు తీసుకున్నాం. త్వరలో ఐఎస్‌ఓ 9000, ఎన్‌బీఏ అక్రిడిషన్‌కోసం వెళ్తాం. ఎన్‌బీఏ అక్రిడిటేషన్‌ వచ్చిన తర్వాత ఫెర్టిలైజర్‌ టెక్నాలజీ కోర్సును ప్రారంభిస్తాం. సేఫ్టీ కోర్సుల హబ్‌గా తయారు చేస్తాం.  ప్రస్తుతం ఫైర్‌ సేఫ్టీ, ఇండస్ట్రియల్‌ సేఫ్టీ కోర్సులు ఉన్నాయి. ఇతర సేఫ్టీ కోర్సుల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాలేజీ ప్రాంగణంలో బాలికల వసతి, భోజన సౌకర్యాల ఏర్పాటుకు అధునాతన భవనం ఉంది. ఇక్కడ 50 మందికి హాస్టల్‌ సదుపాయం ఉంది. పరిమిత సంఖ్యలో బాలురకు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో  హాస్టల్‌ సదుపాయం ఉంది.

- డాక్టర్‌ కె.వెంకటరమణ,  ప్రిన్సిపాల్

Post a Comment

0 Comments