GET MORE DETAILS

ఫీజుల కోసం 'నారాయణ' బరితెగింపు - 80 శాతం చెల్లిస్తేనే అనుమతి : సాయంకాలం వరకూ బయటే ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు

 ఫీజుల కోసం 'నారాయణ' బరితెగింపు -  80 శాతం చెల్లిస్తేనే అనుమతి : సాయంకాలం వరకూ బయటే ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు



ఫీజుల వసూల కోసం నారాయణ కళాశాల బరితెగింపుకు పాల్పడింది. తక్షణమే 80 శాతం ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని, లేదంటే లోపలకు పంపించేది లేదని యాజమాన్యం తేల్చిచెప్పింది. తమకు కొద్దిరోజుల గడువు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకున్నా..యాజమాన్యం కనికరించలేదు. ఈ సంఘటన విశాఖ జిల్లా ఆనందపురం మండల కేంద్రం సమీపాన వెల్లంకిలో గల నారాయణ కళాశాలలో చోటుచేసుకుంది. ఈ కళాశాలలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమారు 1100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.1.90 లక్షల నుంచి రూ.2.30 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 22 నుంచి కళాశాలకు అనధికారికంగా సెలవులు ప్రకటించారు. సోమవారం నుంచి అర్ధసంవత్సర పరీక్షలు ఉండటంతో ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు ఆదివారం ఉదయం కళాశాలకు చేరుకున్నారు. 80 శాతం ఫీజు చెల్లిస్తేనే లోపలికి పంపిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒక్కసారిగా తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఇప్పటికిప్పుడు ఈ విషయం చెబితే ఎలా చెల్లిస్తాం..కొద్దిరోజులు గడువు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకున్నారు. అయినా యాజమాన్యం కనికరించలేదు. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు సాయంత్రం వరకూ కళాశాల బయటే వేచి ఉన్నారు. సహనం కోల్పోయిన తల్లిదండ్రులు పరీక్షల ముందు నాలుగు రోజులు సెలవులు ఇచ్చేసింది కాక ఫీజు కడితే గానీ పరీక్షలకు అనుమతించేది లేదని చెప్పడం దుర్మార్గమైన చర్య అని ప్రిన్సిపల్‌, ఎజిఎంను నిలదీశారు. మరోవైపు తల్లిదండ్రులు రాకుండా కళాశాలకు వచ్చిన విద్యార్థులనూ సాయంత్రం వరకు బయటే కూర్చోబెట్టడం నిరంకుశమని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనక్కి తగ్గిన యాజమాన్యం నాలుగైదు రోజుల్లో ఫీజు చెల్లించాలని చెప్పి రాత్రి సమయంలో విద్యార్థులను కళాశాలలోకి అనుమతించింది.

సాయంకాలం వరకూ బయటే ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు

సాయంకాలం వరకూ బయటే ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు

Post a Comment

0 Comments