GET MORE DETAILS

విద్యుత్‌ ఉద్యోగులతో పెట్టుకుంటే షాక్‌ తప్పదు : ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలో ఉద్యోగుల సమావేశం

 విద్యుత్‌ ఉద్యోగులతో పెట్టుకుంటే షాక్‌ తప్పదు : ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలో ఉద్యోగుల సమావేశం



ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులపై విద్యుత్‌ సంస్థ యాజమాన్యం వేధింపులకు పాల్పడుతూ అభద్రతా భావానికి.. భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల ఐకాస నేతలు ఆరోపించారు. విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ఐకాస రాష్ట్ర స్థాయి సమావేశాన్ని విజయవాడలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకాస ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ... ‘ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆందోళనలను తీవ్రతరం చేస్తాం. యాజమాన్యం చర్యలతో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) తీసుకోవాలని ఉద్యోగులు భావిస్తున్నారు. విద్యుత్‌ ఉద్యోగులతో పెట్టుకుంటే కరెంట్‌ షాక్‌ తప్పదు. గతంలో మంత్రి సమక్షంలో జరిగిన సమావేశం మినిట్స్‌ను ఇప్పటి వరకూ ఇవ్వలేదు. విద్యుత్‌శాఖలో జరుగుతున్న పరిణామాలను సీఎం జగన్‌ తెలుసుకోవాలి. ఆయనకు వాస్తవ సమచారం ఇవ్వడం లేదని భావిస్తున్నాం. గతంలో ఇంధనశాఖ, ట్రాన్స్‌కోకు వేర్వేరు అధికారులుంటే.. ప్రస్తుతం ఒక్కరే ఉంటూ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము వ్యవహరించలేదు. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా ప్రాణాలకు తెగించి పని చేశాం. సీఎం ఏనాడూ ఉద్యోగుల సేవలను ప్రశంసించలేదు’ అని పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని విడుదల చేశారు. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రైవేటీకరణ ప్రతిపాదన నిలిపేయాలని, గత రెండేళ్లలో బహిరంగ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించి చేసిన వ్యయంపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలు తేల్చాలని కోరారు. ఉద్యోగులపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లు, క్రమశిక్షణ కేసులను వెంటనే ఉపసంహరించాలని, డిస్కంలలో కొత్త సేవా నిబంధనలను రూపొందించాలన్న నిర్ణయాన్ని నిలిపేయాలని, ఉద్యోగ సంఘాలు/ఆఫీసు బేరర్ల బలవంతపు బదిలీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Post a Comment

0 Comments