GET MORE DETAILS

శాస్త్ర సాంకేతికతతోనే సవాళ్లకు పరిష్కారం - కేఎల్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌

శాస్త్ర సాంకేతికతతోనే సవాళ్లకు పరిష్కారం - కేఎల్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌



సమాజంలోని సమస్యలను పరిష్కరించాలంటే శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు పెరగాలని, అవి జీవనవిధానంలో అనూహ్యమార్పులను తెస్తాయని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో ఉన్న కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవం శనివారం జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వర్చువల్‌ విధానంలో పాల్గొన్న శివన్‌ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘విద్య, వైద్యం, పారిశ్రామిక, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, టెలికం సహా అన్ని రంగాల్లో సాంకేతిక వినియోగం పెరిగింది. అంతరిక్ష సాంకేతికతలో ఇస్రో ఏటేటా గణనీయమైన ప్రగతిని సాధిస్తోంది. గత ఆరు దశాబ్దాల్లో ఇస్రో పరిధిని విస్తరిస్తూ వస్తున్నాం. భారత ప్రభుత్వం కేంద్రీకృత రంగాల్లో ఒకటిగా అంతరిక్షాన్ని గుర్తించడం శుభపరిణామం. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే అంతరిక్ష పరిజ్ఞానం గురించి బోధించాలి’ అని సూచించారు. ‘వాతావరణ మార్పులు, కొత్త వ్యాధుల కారణంగా ఆర్థిక మాంద్యం ఏర్పడుతోంది. కొవిడ్‌ మహమ్మారి సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు మనల్ని సన్నద్ధం చేసింది. ఇందుకు తగిన పరిశోధనలు జరగాలి. జీవితంలో ఏదైనా సాధించగలమనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి, దేశం గర్వించే స్థాయికి చేరేందుకు కష్టపడాలి’ అని శివన్‌ సూచించారు.  

అయిదుగురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు :

ఏరోస్పేస్‌, ఆటోమొబైల్‌, చిత్ర పరిశ్రమ తదితర రంగాలకు చెందిన అయిదుగురు ప్రముఖులకు కేఎల్‌ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ శివన్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. ఆయన వర్చువల్‌ పద్ధతిలో హాజరవ్వడంతో.. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ప్రసాదరావు డాక్టరేట్న్‌ు అందుకున్నారు. వోల్వో ఛైర్మన్‌, ఎండీ కమల్‌బాలి, ప్రవచనకర్త డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు, సినీనటుడు అలీ, సిలికాన్‌ ఆంధ్రా వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్‌కు గౌరవ డాక్టరేట్లను కేఎల్‌ఈఎఫ్‌ అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ చేతులమీదుగా అందజేశారు. కేఎల్‌యూ కులపతి డాక్టర్‌ ఎస్‌ఎస్‌ మంథా, ఉపకులపతి డాక్టర్‌ పార్థసారథి వర్మ, ప్రో వీసీ వెంకట్‌రామ్‌, కేఎల్‌ఈఎఫ్‌ కార్యదర్శి కోనేరు కాంచనలత, బోర్డు సభ్యులు పున్నయ్యచౌదరి, త్రిమూర్తులు, ఆచార్యులు డాక్టర్‌ కిషోర్‌బాబు, డాక్టర్‌ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments