GET MORE DETAILS

మృదుస్వభావి, అజాతశత్రువు, ఆర్థిక నిపుణులు, మహాచార్య శ్రీ కొణిజేటి రోశయ్య గారు.

మృదుస్వభావి, అజాతశత్రువు, ఆర్థిక నిపుణులు, మహాచార్య శ్రీ కొణిజేటి రోశయ్య గారు.
అన్నీ తెలిసిన మనిషి... ఆవేశపడని మనిషి... ఆలోచించే మనిషి... జాగ్రత్త చెప్పే మనిషి... పక్కన ఉంటే భరోసాగా ఉంటుంది. రోశయ్య అలాంటి భరోసా ఇచ్చిన మనిషి. అదుపు తప్పబోయిన పరిస్థితుల్ని బ్యాలెన్స్‌ చేసిన మనిషి. ఈ రాజనీతిజ్ఞత మహా మహా ఆచార్యులకు మాత్రమే ఉంటుంది. అందుకే ఆయన మహాచార్య.   


తొలి జీవితం : 

కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో ఆదెమ్మ, సుబ్బయ్య దంపతులకు జన్మించారు.గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు. 

గుంటూరులో చదువుతున్నప్పుడు , విద్యార్థి నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు.అతను జూన్ 4, 1950 న శ్రీమతి శివలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యారు.

 87 ఏళ్ల రోశయ్య  జీవితంలో 65 ఏళ్లు రాజకీయరంగంతోనే మమేకమై ఉంది. ఆయన హయాంలో రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని గద్దెనెక్కించారూ అంటే కీలకమైన మంత్రి పదవులకు గుర్తుకొచ్చే నాలుగైదు పేర్లలో రోశయ్య  పేరు తప్పకుండా ఉండేది.


ఏ శాఖ ఇస్తారనే చర్చలు : 

‘రోశయ్యకు మంత్రి పదవి వస్తుందా, రాదా’ అనేది కాదు ప్రశ్న, ఈయనకు ఈ దఫా ఏ శాఖ ఇస్తారనే చర్చలు రాజధాని నుంచి గ్రామాల్లో అరుగుల వరకు జరిగేవి. 


చలోక్తులు, చెణుకులతో సభ : 

అసెంబ్లీలో ఆయన ఉంటే చెణుకులతో సభ ఘొల్లుమనేది. చలోక్తులు సందర్భానుసారం పిట్ట కథలతో వాతావరణాన్ని సర్దుబాటు చేసేవారు. ఆ కథలో ఎత్తిపొడుపు తగలాల్సిన వాళ్లకు సూటిగానే తగిలేది, మళ్లీ నోరెత్తడానికి సందేహించేటంతగా, ఇలాంటి అస్త్రం మన దగ్గర ఉండబట్టే మన అమ్ములపొది ఇంత పటిష్టంగా ఉందనే భరోసా సొంతపార్టీ వాళ్లకు మళ్లీ మళ్లీ కలిగేది. టీవీలో చూసేవాళ్లకు అది ఓ ఇన్‌ఫోటైన్‌మెంట్‌.

రాజకీయ ప్రస్థానం :

రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు నేర్చారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు, 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు, 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ (ఆర్ధిక ప్రణాళిక)ను ఇప్పటికి 15 సార్లు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అతను జవహర్‌లాల్ నెహ్రూతో సహా భారత ప్రధానమంత్రులతో సన్నిహితంగా వ్యవహరించాడు.


పార్లమెంట్ లో తెలుగు :

1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికై పార్లమెంట్ లో తెలుగులో మాట్లాడేవారు. మాతృభాషలో మాట్లాడే సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. 


రాష్ట్ర పాలన.. రాజ్యాంగ పరిరక్షణ :

రోశయ్య దక్షిణాదిలో కేరళ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రంలోనూ కనిపిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి, టి. అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి, వైఎస్‌ రాజశేఖర రెడ్డి.. మొత్తం ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. క్లిష్టమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్‌గా రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్, బల్కంపేటలోని స్వగృహంలో విశ్రాంత జీవనాన్ని గడుపుతున్నారు.

ఆర్థికమంత్రిగా :

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం.బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు.ఇతడికి ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది.

కఠినమైన ఆర్థిక నిర్వహణ సూత్రాలకు కట్టుబడి ఉండటం మరియు ప్రభుత్వ నిధుల సమర్థవంతమైన సమీకరణ మరియు వినియోగించడం, సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా రాష్ట్రానికి ఆయన చేసిన కృషికి మంచి గుర్తింపు ఉంది.


దైవం... గురువు... మిత్రుడు...

సామాన్య, మధ్యతరగతి వారు నివసించే ప్రదేశంలో ఒక విశాలమైన ప్రాంగణం, అందులో అందమైన భవంతి. పోలీస్‌ సెక్యూరిటీ దాటి లోపలికి అడుగుపెడితే వేణుగోపాలుడి విగ్రహం. ముందు గదిలో అడుగుపెట్టగానే ఎదురుగా ఉన్న గోడకు కుడివైపు తొండంతో ఉన్న వినాయకుడి తంజావూర్‌ చిత్రపటం కనిపిస్తుంది. కొంచెం ఎడమ వైపు ఆయన రాజకీయ గురువు ఆచార్య ఎన్‌జీ రంగా ఫొటో, కుడివైపు గోడకు రాజకీయ మిత్రులు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటో ఉన్నాయి. గురువుకి, మిత్రుడికి ఆయన మనసులో ఉన్న మహోన్నతమైన స్థానానికి ప్రతీకల్లా ఉన్నాయవి.


దినచర్య :

అప్పుడిన్ని కుదుపుల్లేవు... అప్పుడు సమయం సాయంత్రం ఐదుగంటలు. అప్పుడే విచ్చుకుంటున్న మల్లెల్లా ఉన్న స్వచ్ఛమైన తెల్లని దుస్తుల్లో లోపలి నుంచి వచ్చారాయన. ‘‘ఎలా ఉన్నారు?’’ అని పలకరించినప్పుడు ‘‘ఇదిగో ఇలా. ఆరోగ్యం బాగుంది, జీర్ణం కావడం లేదు’’ అంటూ నవ్వారు. ఉదయం లేచిన తర్వాత ఏడు గంటలకు ఇంటి ఆవరణలోనే ఓ గంట సేపు వాకింగ్‌ చేయడం. పేపర్లు చదవడం, టీవీలో వార్తలు చూడటం, వేళకు ఆహారం, విశ్రాంతి... ఇదీ ఇప్పుడాయన దినచర్య.


గౌతు లచ్చన్నల ప్రభావం: రంగా శిష్యుడు :

ఇప్పుడేమీ పట్టించుకోవడం లేదంటూనే తన అనుభవంలోని విషయాలను బయటపెట్టారు. తన హయాంలో ఒక నాయకుడు ఉంటే.. అతడి ఆదేశాన్ని పాటించే అనుచరులు ఎక్కువ మంది ఉండేవారని చెప్పారు. ఇప్పటి రాజకీయ రంగం.. నాయకులు ఎక్కువైపోయి ఇబ్బంది పడుతోంది. దాంతో తరచూ కుదుపులకు లోనవుతోందని అన్నారు. ఆచార్య రంగా, గౌతు లచ్చన్నల ప్రభావంతో రాజకీయ రంగంలోకి వచ్చానని, రంగా శిష్యుడినని చెప్పుకోవడంలో సంతోషం ఉంటుందని చెప్పారు.  

కలం పట్టిన చెయ్యి :

రోశయ్య గుంటూరు హిందూ కాలేజ్‌లో బీకామ్‌ చదువుతున్న రోజులవి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సొంత పరిపాలనలో తొలి అడుగులు వేస్తోంది దేశం. ఆ అడుగులు సమసమాజ స్థాపన దిశగా పడటం లేదని గళమెత్తిన పథనిర్దేశకులలో ఆచార్య రంగా కూడా ఉన్నారు. ఆయన తన ప్రసంగాలతో యువతలో ఆలోచన రేకెత్తించేవారు. అలా ప్రభావితమైన వారిలో రోశయ్య ఒకరు. సమాజానికి కొత్త పథాన్ని నిర్మించాలంటే ఉన్న దారి ఎటు వెళ్తోందో తెలుసుకోవాలి. ప్రతిరోజూ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలు చదవడం అలా అలవాటైంది ఆయనకు. అలాగే తాను తెలుసుకున్న సమాచారాన్ని పదిమందికి తెలియచేయాలనే తపన కూడా అప్పుడే మొదలైంది.

వార్తలు రాసి గుంటూరులో ఉన్న ఆంధ్రపత్రిక ఆఫీస్‌కి వెళ్లి ఇచ్చేవారు రోశయ్య. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘‘విలేఖరి తాను స్వయంగా చూసిన విషయాన్ని రాస్తే, ఆ కథనంలో సమగ్రత ఉంటుంది. ఆ వార్తకు విశ్వసనీయత వస్తుంది. అప్పట్లో పత్రికలు మేము (విలేఖరులు) రాసుకెళ్లిన విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ప్రచురించేవి. 


అప్పట్నుంచి తెల్లదుస్తులే...

రోశయ్య కాలేజ్‌ వదిలిన ఏడాది వరకు మాత్రమే ప్యాంటు, షర్టు వేసుకున్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి రావడమే తడవుగా తెల్ల ధోవతి, తెల్లలాల్చీకి మారిపోయారు. ‘‘రోజూ తెల్లదుస్తులు ధరించడం అలవాటైపోయింది. రోజూ అన్నం తింటాం. బోరు కొడుతుందా’’ అని చమత్కరించారు. చిన్నప్పటి నుంచి తనది అత్యంత నిరాడంబరమైన జీవితం అని చెబుతూ.. తల్లి వండినది తినడమే తప్ప.. అదిష్టం, ఇదిష్టం లేదనడం తెలియదన్నారాయన.


బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ...

బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ..‘‘మా నాన్నకు వ్యవసాయంతోపాటు వ్యాపారం కూడా ఉండేది. ఒకసారి సేల్స్‌ ట్యాక్స్‌ అధికారి వచ్చి లెక్కలు, పన్నులు అంటూ అధికారం ప్రదర్శించాడు. అప్పుడు ‘దుకాణం పెట్టడానికి పెట్టుబడి మీరివ్వలేదు, వ్యాపార లావాదేవీల్లో సహాయం చేయలేదు. మీకు లెక్కలు చూపిస్తూ, మీ ఆదేశాలు పాటిస్తూ వ్యాపారం చేయాలా’ అని వ్యాపారం మానేసి వ్యవసాయానికే పరిమితమయ్యారు. బ్రిటిష్‌ పెత్తనాన్ని అంతగా నిరసించేవారాయన’’ అని తండ్రి ముక్కుసూటి తనం గురించి చెప్పారు.

అంత కచ్చితమైన భావాలు కలిగిన మనిషి పెంపకంలో జాగ్రత్తగా మెలగడం ఎలాగో నేర్చుకున్నానంటారు రోశయ్య. ‘‘ఒకసారి జారిన తర్వాత ఆ మాట ఎప్పటికీ ఉండిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను పాటిస్తాను, నా పిల్లలకూ అదే చెప్పాను’’ అని జీవిత సూత్రాన్ని బయటపెట్టారు. ఇంకా.. ‘‘మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రులకు ఏదైనా చెప్పాల్సి వస్తే.. ఆ విషయాన్ని అందరిలో చెప్పేవాడిని కాదు, పర్సనల్‌గా చెప్పేవాడిని. అలాగే నా మీద వచ్చిన విమర్శలను ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోలేదు. అవి అభిప్రాయభేదాలంతే, ఎవరికి వారు తమ తమ పార్టీలను పరిరక్షించుకునే ప్రయత్నాలు తప్ప మరేమీ కాదు. విమర్శలను హుందాగా స్వీకరించగలిగితే వ్యక్తిగతంగా శత్రువులు ఏర్పడరు’’ అంటూ తాను అజాత శత్రువుగా ఉండిపోయిన వైనాన్ని చెప్పారు.

సంగీతాన్ని  ఇష్టపడతారు :

రోశయ్య... సంగీతాన్ని  ఇష్టపడతారు తమిళనాడులో గవర్నర్‌గా ఉన్నప్పుడు కూడా డైరీలో ఖాళీ దొరికితే త్యాగరాజ కీర్తనల వంటి సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్లేవారాయన. తన జీవితంలో పుస్తకాలు చదవడం సాధ్యమే కాలేదంటారు. బిజీగా ఉన్న రోజుల్లో మాత్రం పేపర్లలో ఉదయం చదవగా మిగిలిపోయిన పేజీలను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత పూర్తి చేసేవారట.


సమయపాలన:

ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్‌కి ఫలానా టైమ్‌కి వస్తానంటే కచ్చితంగా ఆ సమయానికి అక్కడ ఉండాలనేది ఆయన సిద్ధాంతం. అలా మాట నిలబెట్టుకున్నప్పుడే మనిషికి విశ్వసనీయత అంటారు.

2007లో ఆంధ్ర విశ్వవిద్యాలయం రోశయ్యకు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.

2018 ఫిబ్రవరి 11 ఆదివారం నాడు టి.సుబ్బిరామిరెడ్డి లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యను గజమాలతో సత్కరించి జీవన సాఫల్య పురస్కారం అందించారు.

డిసెంబర్ 4న  హైదరాబాద్‌లో ఎస్‌ఆర్ నగర్‌లోని  నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చనిపోయినట్లుగా నిర్ధారించారు. 

పార్టీలతో సంబంధం లేకుండా రాజకీయనేతలందరితో అందరివాడు అనిపించుకున్న ఘనత రోశయ్యది. రోశయ్య మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేస్తున్నారు.

ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడటంలో ఓ రుషి మాదిరిగా సేవ చేశారు.


కొణిజేటి రోశయ్య గారు

బహుముఖ ప్రజ్ఞాశాలి...

కార్యదక్షుడు...

సహన చెలిమి  సంపన్నుడు...

నిజాయితీ కి సరిజోడు... 

నమ్మకానికి సహతోడు... 

తన వ్యక్తిత్వంతో పదవికే వన్నె తెచ్చిన కారణజన్ముడు...

Post a Comment

0 Comments