డిగ్రీ చదివి - నకిలీ తెలివి : : దేశంలో గుర్తింపు పొందిన వర్సిటీల పేరిట నకిలీ సర్టిఫికెట్ల తయారీ
దందా వెనుక 15 మంది కీలకం. 12 మంది అరెస్ట్. పరారీలో ముగ్గురు. ముఠా గుట్టువిప్పిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్‌జోషి.
వరంగల్ కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు అయింది. విద్యార్థులు, నిరుద్యోగుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న నిందితులు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నకిలీ సర్టిఫికెట్ల సహాయంతో విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్న 12 మంది నిందితులను మంగళవారం వరంగల్ పోలీసు కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ బృందం అరెస్టు చేసింది.
వీరి నుంచి 212 నకిలీ సర్టిఫికెట్లు, ఆరు ల్యాప్‌టాప్‌లు, ఐపాడ్, 2 ప్రింటర్లు, ఐదు సీపీయూలు, 25 నకిలీ రబ్బర్ స్టాంపులు, 2 ప్రింటర్ రోలర్స్, 5 ప్రింటర్ కలర్స్ బాటిళ్లు, లామినేషన్ మిషన్, 12 సెల్‌ఫోన్లు, 10 లామినేషన్ గ్లాస్ పేపర్లను స్వాధీనం చేసుకుంది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ ముఠా వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి వెల్లడించారు.
నిందితులందరూ డిగ్రీ చదివినవారే. దార అరుణ్, ఆకుల రవిఅవినాష్ ప్రధాన నిందితులు. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్న ఈ ఇద్దరు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తుండేవారు. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో పక్కదారి పట్టారు. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ ఇంజనీరింగ్ కళాశాలల పేరిట నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి అర్హతలులేని విద్యార్థులకు కొన్ని కన్సల్టెన్సీ సంస్థల ద్వారా విక్రయించేవారు. ఆ విధంగా విద్యార్థులు విదేశాలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసేవారు.
ముఠా అక్రమాలు అనేకం :
కొన్ని విదేశాల్లో విద్యాభాసనకు కనీస మార్కుల శాతాన్ని తప్పనిసరి చేయడంతోపాటు, మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలని కొన్ని యూనివర్సిటీలు నియమం పెట్టడంతో ఆ మేరకు నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విద్యార్థులకు అందజేసేవారు. ఇందుకుగాను రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేసేవారు. సర్టిఫికెట్లపై ఎవరికీ అనుమానం రాని విధంగా విదేశాల నుంచి సర్టిఫికెట్ల ముద్రణకు అవసరమైన కాగితాలను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేవారు.
పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ ఇన్‌చార్జ్, అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్ అధ్వర్యంలో ప్రత్యేక నిఘా వేసిన పోలీసులు వలపన్ని నిందితులను పట్టుకున్నారు. ఒకే సమయంలో అన్ని ప్రాంతాల్లో ముఠాకు సంబంధించిన కన్సల్టెన్సీ సంస్థలపై దాడులు నిర్వహించడంతో నకిలీ సర్టిఫికెట్ల తయారీ వ్యవహారం బయటపడింది. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
0 Comments