GET MORE DETAILS

ఓటర్‌ఐడీ - ఆధార్‌ లింకేజీతో గోప్యతకు పాతర. పెద్ద ఎత్తున ఓట్లను తొలగించే ప్రమాదం ఉంది.

ఓటర్‌ఐడీ - ఆధార్‌ లింకేజీతో గోప్యతకు పాతర. పెద్ద ఎత్తున ఓట్లను తొలగించే ప్రమాదం ఉంది.బడుగు, బలహీనవర్గాల ఓటు హక్కు గల్లంతు

అవుతుందని దేశవ్యాప్తంగా విపక్షాల ఆందోళన

2018లో తెలంగాణ, ఏపీలో 55 లక్షల ఓట్ల తొలగింపు

2020 ఆగస్టు 31 నాటికి దేశవ్యాప్తంగా

40 వేలకు పైగా నకిలీ ఆధార్‌ నంబర్ల గుర్తింపు, రద్దు

ఆధార్‌ కార్డేమీ ఫుల్‌ ప్రూఫ్‌ కాదంటున్న నిపుణులు

నకిలీ ఓట్లను అరికట్టడానికే అంటున్న ప్రభుత్వం..

ఓటరు ఐడీకి ఆధార్‌ లింక్‌పై భిన్నాభిప్రాయాలు

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ.. అందరికీ సాధారణ గుర్తింపుగా మారిన ఆధార్‌ కార్డును ఓటరు గుర్తింపు కార్డుకు అనుసంధానం చేసేందుకు కేంద్రం మార్గం సుగమం చేసింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, మెరుగైన ఓటింగ్‌ విధానం కోసమే సవరణ బిల్లు తెచ్చినట్లు మోదీ సర్కారు చెబుతోంది. ఎన్నికల విధానంలో అవకతవకలకు చెక్‌ పెట్టడం, నకిలీ ఓట్లను నిరోధించడం బోగస్‌ ఓట్ల తొలగింపు, అవకతవకల్లేని ఓటరు జాబితా తదితర లక్ష్యాలతో ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు వివరిస్తోంది. కానీ, దీనివల్ల వ్యక్తుల గోప్యతకు భంగం కలుగుతుందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా.. దీనివల్ల బడుగు, బలహీన, పేద వర్గాలకు చెందిన లక్షల మంది ఓటు హక్కు గల్లంతవుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పౌరసత్వానికి రుజువుగా పరిగణించని ఆధార్‌ను ఓటరు జాబితాకు లింక్‌ చేయడం అసంబద్ధమనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా.. ఓటర్‌ ఐడీలను ఆధార్‌కు అనుసంధానం చేయడం వల్ల ప్రజలు తమ గోప్యత హక్కును కోల్పోతారని.. ఇది రాజ్యాంగవిరుద్ధమని హక్కుల నిపుణులు, ఎన్నికల సంస్కరణలవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జస్టిస్‌ పుట్టుస్వామి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ప్రస్తావించిన ‘ప్రపోర్షనాలిటీ టెస్ట్‌’కు ఈ చట్టం నిలవదని వారు పేర్కొంటున్నారు. ప్రపోర్షనాలిటీ టెస్ట్‌ అంటే.. ఒక అధికారి తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం అంటూ ఎవరైనా న్యాయసమీక్షకు వెళ్లినప్పుడు, ఆ అంశంలో ఒకటికి మించి హక్కుల మధ్య సంఘర్షణ ఉంటే కోర్టులు అందులో ఏ హక్కు ఆ సందర్భానికి ఉత్తమమైనదో నిర్ణయించి ఆ మేరకు తీర్పునిస్తాయి. ఓటర్‌ఐడీ-ఆధార్‌ అనుసంధానం విషయానికి వస్తే.. ఇందులో ఓటు వేసే హక్కు, గోప్యత హక్కు అనే రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఆధార్‌-ఓటర్‌ఐడీ లింకేజీ ఐచ్ఛికమేనని చెబుతోంది. కానీ, ఆధార్‌ విషయంలో గత అనుభవాలను, దాన్ని వివిధ పథకాలకు అనుసంధానాన్ని చేయడాన్ని బట్టి చూస్తే కాలక్రమంలో ఇది తప్పనిసరిగా మారుతుందనే ఆందోళన పలువురిలో వ్యక్తమవుతోంది. ఉదాహరణకు.. ప్రస్తుత చట్టాల ప్రకారం బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం ఐచ్ఛికం. కానీ, ఏ బ్యాంకుకు వెళ్లినా ఆధార్‌ లేకుండా ఖాతా తెరవలేని పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ‘ఖాతా తెరవడానికి ఆధార్‌ అవసరం లేదు కదా.. అది ఐచ్ఛికమే కదా?’ అని ప్రశ్నిస్తే.. తమ సాఫ్ట్‌వేర్‌ అందుకు ఒప్పుకోదని బ్యాంకు సిబ్బంది చెబుతారు. ఇదే క్రమంలో.. ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్న పౌరులు ఈ చట్టం తమకు కల్పించిన హక్కు ప్రకారం ఆధార్‌ నంబరు ఇవ్వడానికి నిరాకరిస్తే, అధికారులు వేరే సాకులేవో చెప్పి వారికి ఓటర్‌ ఐడీ ఇవ్వడానికి నిరాకరించే ప్రమాదం లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వారు తమ ఓటు హక్కును కోల్పోయినట్టేనని ‘అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌)’ సహవ్యవస్థాపకుడు జగ్దీప్‌ ఎస్‌ చోకర్‌ అన్నారు.

ఒకవేళ పౌరులు ఆధార్‌ నంబర్‌ అనుసంధానానికిఅంగీకరిస్తే.. ఆధార్‌ డేటాలోని వారి వ్యక్తిగత వివరాల గోప్యతకు గ్యారెంటీ లేదు. ఎందుకంటే.. ఆధార్‌ డేటా లీకేజీలపై గత కొన్నేళ్లుగా పలు కథనాలు ప్రచురితమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఓటర్‌ ఐడీని, ఆధార్‌తో అనుసంధానం చేయడం సైబర్‌ క్రిమినల్స్‌కు డబుల్‌ బొనాంజానే అవుతుందని.. దురదృష్టవశాత్తూ ఎప్పుడైనా ఈ మొత్తం డేటా సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కితే భారత సార్వభౌమత్వానికే ముప్పుకలుగుతుందని ప్రముఖ సైబర్‌ భద్రత నిపుణుడు పవన్‌ దుగ్గల్‌ హెచ్చరించారు. ఆధార్‌ డేటా పూర్తిగా సురక్షితమని.. ఎలాంటి లీకేజీకి ఆస్కారం లేదని యుఐడీఏఐ (యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) పదేపదే పేర్కొంటోంది. యూఐడీఏఐ సర్వర్లు నిజంగా పటిష్ఠమైనవి, సురక్షితమైనవి అయినప్పటికీ.. ప్రభుత్వ వెబ్‌సైట్లు, థర్డ్‌పార్టీ వెబ్‌సైట్ల ద్వారా ఆధార్‌ డేటా లీక్‌ అవుతుండడమే అసలు సమస్య. అలాగే.. చాలామంది ఇల్లు మారినా ఆధార్‌లో ఆ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవట్లేదు. ఫలితంగా ఆధార్‌ వివరాలు లీకైనా.. వ్యక్తుల ప్రస్తుత చిరునామా వివరాలు సైబర్‌ నేరగాళ్లకు, హ్యాకర్లకు తెలియవు. కానీ, ఓటర్‌ ఐడీతో అనుసంధానం చేస్తే.. వారి ప్రస్తుత చిరునామా (ఫిజికల్‌ అడ్రస్‌) వివరాలు కూడా తెలిసిపోతాయి. 

ఇది మరో సమస్య. ఇక, మూడో సమస్య.. నకిలీ ఆధార్‌ కార్డులు. దేశంలో 2020 ఆగస్టు 31 దాకా 40,955 నకిలీ ఆధార్‌ నంబర్లను గుర్తించి రద్దు చేసినట్టు కేంద్ర మంత్రి సంజయ్‌ ధోత్రే గత ఏడాది సాక్షాత్తూ రాజ్యసభలో తెలిపారు. అవి గుర్తించినవి మాత్రమే. గుర్తించనివి ఇంకా ఎన్ని ఉన్నాయో? అలా ఫ్రాడ్‌ నంబర్లతో ఓటర్‌ ఐడీని లింక్‌ చేస్తే? అనే ప్రశ్నకు కూడా ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. అలాగే.. అన్‌మోల్‌ సోమాంచి, విపుల్‌ పైక్రా అనే ఇద్దరు స్వతంత్ర పరిశోధకులు దేశంలో జరిగిన ఆధార్‌కార్డు దుర్వినియోగాలకు సంబంధించి 73 సంఘటనలతో ఒక నివేదిక తయారుచేశారు. వాటిలో 52 సంఘటనల్లో వాడిన ఆధార్‌కార్డులు నకిలీవే కావడం గమనార్హం. పాస్‌పోర్టులు, రుణాలు పొందడానికి, భూముల లావాదేవీలకు నేరగాళ్లు వాటిని వాడారు. అంటే, నకిలీ ఆధార్‌ కార్డుల సృష్టి సాధ్యమే. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్న నకిలీ ఓటర్‌ ఐడీలకు, ఈ నకిలీ ఆధార్‌ కార్డులు తోడై.. నిజమైన ఓటర్ల హక్కులకు విఘాతం కలిగితే? ఈ ప్రశ్నకు కూడా ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో భారీగా తొలగింపు :

ఆధార్‌కార్డు, ఓటర్‌ ఐడీ అనుసంధానం కొత్తగా మొదలైంది కాదు. 2015లోనే ఎన్నికల కమిషన్‌ ఈ పని ప్రారంభించింది. ఆ ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు జోక్యంతో నిలిపివేసింది. ఈలోపే దాదాపుగా 30 కోట్ల ఓటర్‌ ఐడీ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసి.. 55 లక్షల ఓటరు కార్డులను ఏపీ, తెలంగాణల్లో తొలగించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ప్రభావం తెలంగాణలో 2018లో జరిగిన ఎన్నికల్లో కనిపించింది. తమ ఓటును తొలగించిన విషయం చాలా మందికి ఓటింగ్‌ రోజున కానీ తెలియలేదు. విపక్షాల ఆరోపణల ప్రకారం.. అప్పట్లో రాష్ట్రంలో 27 లక్షల ఓటర్‌ కార్డులను ఈసీ తొలగించింది. మరికొందరేమో 30 లక్షలకు పైగా ఓటరు కార్డులను తొలగించినట్టు చెబుతారు (బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల వంటివారు సైతం అప్పట్లో తమ ఓటుహక్కును కోల్పోయారు). ఏదేమైనా 27-30 లక్షలంటే.. అది చిన్న సంఖ్య కాదు. రాష్ట్ర ఓటర్ల సంఖ్యలో దాదాపు 10ు. ఎన్నికల ఫలితాలనే తారుమారు చేసేంత శాతం. ఏపీలోనూ 20లక్షలకు పైగా కార్డులను తొలగించినట్టు చెబుతారు. వెరసి, ఆధార్‌ కార్డు లింకేజీని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ప్రమాదమూ లేకపోలేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా.. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ చట్టాన్ని తీసుకురావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటర్‌ ఐడీని, ఆధార్‌తో అనుసంధానం చేయడం సైబర్‌ క్రిమినల్స్‌కు డబుల్‌ బొనాంజానే. దురదృష్టవశాత్తూ ఎప్పుడైనా ఈ మొత్తం డేటా సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కితే భారత సార్వభౌమత్వానికే ముప్పు.

- సైబర్‌ భద్రత నిపుణుడు పవన్‌ దుగ్గల్‌ 

బిల్లును స్వాగతిస్తున్నాం...

భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్నికల చట్టం సవరణ-2021 బిల్లును మేం స్వాగతిస్తున్నాం. ఓటర్ల జాబితాలో దొర్లుతున్న లోపాలను.. ఆధార్‌ అనుసంధానంతో చాలా వరకు తగ్గించవచ్చు. అయితే ఈ సవరణలు ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర అవకతవకలను పూర్తిగా అరికట్టలేవు. ముఖ్యంగా ఎన్నికల్లో డబ్బు పాత్ర, నేరచరితులు చట్ట సభల్లో ప్రవేశించడం వంటి సమస్యలను ఈ సవరణలు తీర్చలేవు. 

- ఎం.పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరంఫర్‌ గుడ్‌ గవర్నెన్స్

గోప్యత ఎలా ఉంటుంది...?

ఓటరు ఐడీకి లింక్‌ చేస్తే గోప్యత ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఆన్‌లైన్‌ ఓటింగ్‌ విధానం వస్తే ఎవరికి ఓటు వేసిందీ తెలిసిపోతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని రాజకీయ పార్టీలు తమకు ఓటు వేయలేదని, పథకాలు ఇవ్వబోమని ప్రజలను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంటుంది. డబుల్‌ ఓటింగ్‌, వేరు వేరు చోట్ల ఓటు హక్కు లేకుండా.. దొంగ ఓట్లు వేయడాన్ని అరికట్టడమే ప్రధాన ఉద్దేశమని చెబుతున్నప్పటికీ.. భవిష్యత్తులో స్మార్ట్‌ ఓటింగ్‌ విధానాన్ని తేవాలన్న లక్ష్యంతోనే కేంద్రం ఈ విధానాన్ని ముందుకు తెచ్చిందని భావిస్తున్నాం. పౌరులకు ఇబ్బంది కలుగకుండా విధి విధానాలను రూపొందిస్తేనే.. ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం వల్ల సమస్యలుండవు. 

- శ్రీనివాస్‌ కొడాలి, గవర్నెన్స్‌ డేటా ఇంటర్నెట్‌ పరిశోధకుడు 

15లక్షల ఓట్లు తొలగించారు : 

ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలని, బోగస్‌, డూప్లికేట్‌ ఓట్లు ఉండొంద్దని అందరూ కోరుకుంటారు. ఆధార్‌ లింక్‌ పేరుతో  జీహెచ్‌ఎంసీలో అధికారులు ఇష్టానుసారంగా 15 లక్షల ఓట్లను తొలగించినట్లే.. దీనివల్ల దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ఓట్లు తొలగించే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని ఎవ్వరూ హర్షించరు. కేంద్ర సర్కారు నిర్ణయంతో భారత పౌరులు కాని వారు కూడా ఓటర్ల జాబితాలోకి చేరే ప్రమాదముంది.

- జి.నిరంజన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు

Post a Comment

0 Comments