GET MORE DETAILS

ఇదేమి చోద్యం...?

 ఇదేమి చోద్యం...? 



మధురవాడలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నభోజన పథకం నిర్వహణను అక్షయపాత్రకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 15 ఏళ్లుగా పనిచేస్తున్న మధ్యాహ్నభోజన పథకం కార్మికులను తప్పించి, జనవరి ఒకటి నుంచి అక్షయపాత్రకు భోజన సరఫరా బాధ్యతను అప్పజెప్పేందుకు పావులు కదుపుతున్నారు. మధ్యాహ్న భోజన నిర్వహణను పాఠశాల కమిటీకి ఇవ్వడానికి మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అంగీకరించకపోవడంతో ఎలాగైనా వారిని తప్పించాలని చూస్తున్నారు. పాఠశాల కమిటీ, స్థానిక వైసిపి నాయకుల ఒత్తిళ్లను భరించలేక విద్యాశాఖాధికారులు మధ్యాహ్న భోజన పథకం సరఫరాను అక్షయపాత్రకు అప్పగించేందుకు మొగ్గుచూపుతున్నారు.

చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో దాదాపు నాలుగువేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 2,300 మంది విద్యార్థులు పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనాలు తింటున్నారు. ఈ పాఠశాలలో భోజన పథకం కార్మికులు 10 మంది 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలు తెరిచినప్పటి నుంచి మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. గుడ్డు, బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తోంది. కూరగాయలు, కందిపప్పు, గ్యాస్‌, ఇతర వంట సరుకులన్నీ కార్మికులు సమకూర్చుకొని పేద పిల్లలకు భోజనాలు పెడుతున్నారు. భోజన పథకం కార్మికులను తప్పించేందుకు భోజనపాత్రల్లో గుడ్లు తొక్కలువేయించి ఫొటోలు తీయించి కార్మికులపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. భోజన పథకం నిర్వహణను అక్షయపాత్రకు అప్పజెప్పేందుకు చేయని తప్పులను ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దాదాపు రూ.13 లక్షల బిల్లులు రాకపోయినా, పెరుగుతున్న పిల్లల సంఖ్యకు తగినట్లు వారికి ఇబ్బందుల్లేకుండా వుండేందుకు కొద్ది రోజుల క్రితమే అప్పుజేసి రెండు లక్షల రూపాయల విలువైన పెద్ద గ్యాస్‌ పొయ్యిలు, వంట సామాన్లు కొన్నారు. బిల్లులు సకాలంలో రాకపోయినా, పేద పిల్లలకు భోజనం వండిపెడుతున్నామన్న సంతృప్తిలో కార్మికులు కాలం నెట్టుకొస్తున్నారు. ఇంత కష్టపడి, నాణ్యమైన ఆహారం వండి పెడుతున్న కార్మికుల కడుపుకొట్టాలని అధికార పార్టీ నాయకులు చూస్తున్నారు. '15 ఏళ్లుగా నాణ్యమైన భోజనం పెడుతున్న మధ్యాహ్న భోజనం పథకం కార్మికులను తప్పించి అక్షయపాత్రకు భోజన సరఫరా బాధ్యతను అప్పగించడానికి చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు జి.మంగశ్రీ డిమాండ్‌ చేశారు. పాఠశాలల్లో వండి వేడి భోజనాలు పెడుతున్న కార్మికులను తప్పించి, వాహనంలో భోజనాలు సరఫరా చేసే అక్షయపాత్రకు ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు.

Post a Comment

0 Comments