GET MORE DETAILS

మూడేళ్లలో 2,200 నియామకాలు

 మూడేళ్లలో 2,200 నియామకాలు



వచ్చే మూడేళ్లలో హైదరాబాద్‌ టెక్‌ సెంటర్‌లో 2,200 మంది నిపుణులను నియమించుకోవాలని నెదర్లాండ్స్‌కు చెందిన మొబిలిటీ టెక్నాలజీ కంపెనీ స్టెలాంటిస్‌ భావిస్తోంది. వాహనదారులు తమ కార్లతో మరింతగా కనెక్ట్‌ కావడానికి కొత్తతరం టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌ను అభివృద్ధి చేయడంలో కంపెనీ నిమగ్నమై ఉందని,హైదరాబాద్‌ కేంద్రంలో కృత్రిమ మేధ (ఏఐ), సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌పై దృష్టి కేంద్రీకరిస్తామని స్టెలాంటిస్‌ సాఫ్ట్‌వేర్‌ బిజినెస్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ అధిపతి మమత చామర్తి తెలిపారు. హైదరాబాద్‌లో లభ్యమయ్యే నిపుణుల నుంచి కంపెనీ ప్రయోజనం పొందనుంద ని ఆమె చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంలో 500 మంది పనిచేస్తున్నారని, 2024 నాటికి కొత్తగా 2,200 మంది నిపుణులను ఐటీ, సాఫ్ట్‌వేర్‌ విభాగాల్లో నియమించుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. 2030 నాటికి 20 బిలియన్‌ యూరోల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఈ లక్ష్యాన్ని చేరడానికి హైదరాబాద్‌ కేంద్రం దోహదపడనుందని వివరించారు. కాగా కంపెనీకి చెన్నై, పుణెలో ఇంజనీరింగ్‌ కేంద్రాలున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఆధారిత ప్రొడక్ట్‌లను అందించడం, సబ్‌స్ర్కిప్షన్లు తదితరాల  ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. బీఎండబ్ల్యూ, ఫాక్స్‌కాన్‌ వంటి కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కలిగి ఉంది. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా పార్కింగ్‌ సేవలను అందించనుంది. 

విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు: 

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పని చేసే ప్లాట్‌ఫామ్స్‌ అభివృద్ధిలో భారత్‌ కీలక పాత్ర పోషించనుంది. అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారిని ఆకర్షించడానికి భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 4,500 సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను నియమించుకోవాలని యోచిస్తున్నాం. ఇందులో అధిక భాగం భారత్‌లోనే ఉంటుందని మమత చెప్పారు. మూడు ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు.

Post a Comment

0 Comments