GET MORE DETAILS

మన ఇతిహాసాలు _ గయుడు

 మన ఇతిహాసాలు _ గయుడు



శ్రీకృష్ణార్జునులు మంచి బావమర్దులుగా మనకు తెలుసు. అర్జునుడు శ్రీకృష్ణుని కంటి చూపునంటుకుని నడవడమే కాదు భగవంతునిగా కూడా కృష్ణుడు చెప్పిన బాట నడిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడంటే అర్జునునికి ప్రాణం. అర్జునుడన్నా శ్రీకృష్ణునకు ప్రీతి. అలాంటి కృష్ణార్జునులకూ వైరమొచ్చింది. వైరానికి కారకుడైన గయుని గురించి తెలుసుకుందాం.

మణి పురమునకు రాజైన గయుడు గంధర్వుడు. అతడు గొప్ప శివభక్తుడు కూడా. ఒక రోజు శివుని పూజించి ఆకాశ మార్గం గుండా వస్తున్నాడు. తాంబూలం సేవిస్తున్నాడేమో లాలాజలం నోరు నిండగానే ఉమ్మాడు. ఆ ఉమ్మి వెళ్లి సరాసరి సూర్య నమస్కారం చేస్తూ నీళ్లిస్తున్న సాక్షాత్తూ శ్రీకృష్ణ భగవానుడి దోసిళ్లలో పడింది.

శ్రీకృష్ణుడది చూసి ఆ పనిని చేసిన వానిని పట్టి వధింతునని శపథం చేశాడు. ఆ శపథాన్ని గయుడు ఆకాశ వాణి ద్వారా విన్నాడు. విన్న వెంటనే ఒంట్లో వణుకుపుట్టింది. భయకంపితుడై ఏకంగా బ్రహ్మ దగ్గరకు పోయి జరిగిన విషయం చెప్పాడు. తెలియక చేసిన తప్పని చెప్పి, శరణు కాయమన్నాడు. బ్రహ్మ తన వల్ల కాదని శివుని దగ్గరకు పొమ్మన్నాడు. గయుడు శివుని దగ్గరకు వెళ్లాడు. శివుడు గయుడు చెప్పింది విని 'శివ కేశవులు ఒకటని తెలియదా? నా వల్ల కాదు' అని చెప్పాడు. గయునికి ఎటు పోవాలో పాలు పోలేదు. మృత్యు భయంతో గయుడు గజగజలాడాడు.

అదిగో. అలాంటి సమయంలో గయునికి నారదుడు సలహా ఇచ్చాడు. అంతే, గయుడు తిన్నగా అర్జునుడి దగ్గరకుపోయి పాదాల మీద పడ్డాడు. శరణు ఇవ్వందే పాదాలను వీడనన్నాడు. అతని ప్రాణభయాన్ని చూసి అర్జునుడు శరణు ఇచ్చాడు. కాని గయుడు చేసిన అపచారం శరణు ఇచ్చాక తెలుసుకున్నాడు. శ్రీకృష్ణునికి జరిగిన అపచారం ఒక వంక, మరోవంక తనే శ్రీకృష్ణ శపథానికి ఎదురు నిలుస్తున్నందుకు చాలా విచారించాడు అర్జునుడు. అయినా ఇచ్చిన మాటకే కట్టుబడ్డాడు.

దాంతో శ్రీకృష్ణార్జునుల మధ్య అంత వరకూ ఉన్న సయోధ్య సమరంగా మారింది. బంధువులు చేసిన సంధి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. శ్రీకృష్ణార్జున యుద్ధం జరగక తప్పలేదు. యుద్ధం మహా ప్రళయంగా మారిపోయింది. చేసిన శపథానికి శ్రీకృష్ణుడూ, ఇచ్చిన మాటకు అర్జునుడూ కట్టుబడి ఉండటంతో పరిస్థితి చేదాటిపోయింది. ఈ విపత్కరాన్ని గమనించిన దేవతలందరూ దిగి వచ్చారు. శ్రీకృష్ణున్ని ప్రశాంత పరచి నచ్చజెప్పి యుద్ధాన్ని ఆపగలిగారు. గయుడు శ్రీకృష్ణుని పాదాల మీద పడ్డాడు. తెలియక చేసిన తప్పని, క్షమించమని ప్రాణభిక్ష పెట్టమని ప్రాధేయపడ్డాడు. శ్రీకృష్ణుడు శాంతపడి కరుణ చూపడంతో గయుని ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా మిగిలాయి.

Post a Comment

0 Comments