పాఠశాల విద్యలో ఇన్‌ఛార్జుల పాలన _ డీఈఓకు డీవైఈఓ బాధ్యతలు _ ఒక్కో ఎంఈఓకు 3 మండలాలు
పాఠశాల విద్యను నడిపించాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారికి అదనంగా ఇన్‌ఛార్జి బాధ్యతలు చూడక తప్పడం లేదు. డీఈఓ గంగాభవాని సత్తెనపల్లి డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి(డీవైఈఓ)గా ఇన్‌ఛార్జి బాధ్యతలు చూస్తున్నారు. జిల్లాలో ఒకే ఒక్క రెగ్యులర్ డీవైఈఓ ఉన్నారు. మిగిలిన వారంతా ఇన్‌ఛార్జులే. కొందరు ఎంఈఓలు మూడేసి మండలాలను పర్యవేక్షిస్తూ విద్యాశాఖను నడుపుతున్నారు. మొత్తంగా జిల్లాలో పాఠశాల విద్యను సవ్యంగా నడపటానికి టీచర్లే కాదు.. ఎంఈఓలు, డీవైఈఓలు సైతం సరిపడా లేరు. సత్తెనపల్లి, తెనాలి, బాపట్ల, నరసరావుపేట విద్యాశాఖ డివిజన్లకు రెగ్యులర్ డీవైఈఓలు లేకపోవటంతో డీఈఓ, ఆర్జేడీ కార్యాలయాల్లో పరిపాలనాధికారులుగా పనిచేసేవారిని ఇన్‌ఛార్జులుగా పెట్టి వ్యవస్థను నడుపుతున్నారు. దీంతో పాఠశాలలపై వారికి పర్యవేక్షణ కొరవడి విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది.
పెదకూరపాడు ఎంఈఓ ఏకుల ప్రసాద్, బెల్లంకొండ ఎంఈఓ రాజకుమారి, మాచర్ల ఎంఈఓ నాగయ్య, వెల్దుర్తి ఎంఈఓ సురేష్ వీరు ఒక్కొక్కరు మూడేసి మండలాలకు ఇన్‌ఛార్జులుగా ఉన్నారు. 57 మండలాలకు 28 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నారు. మిగిలినవి ఇన్‌ఛార్జుల ఏలుబడిలో ఉన్నాయి. ఒకవైపు ప్రాథమిక పాఠశాలల మ్యాపింగ్, మరోవైపు నాడు-నేడు రెండోదశ పనులు, ఇంకోవైపు మరుగుదొడ్లు శుభ్రత, మధ్యాహ్న భోజనం పరిశీలన, ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు, సర్వీస్‌మేటర్లు, జీతాలు బిల్లుల తయారీ ఇలా ఏకకాలంలో ఇన్ని పనులు చేయాల్సి రావడంతో ఎంఈఓలు, డీవైఈఓలు పనిభారంతో సతమతమవుతున్నారు.
ఒకేసారి ఇన్ని పనులు పర్యవేక్షించడం ఎలా సాధ్యమని వారు ప్రశ్నిస్తున్నారు. కీలకమైన విద్యా సంబంధిత కార్యక్రమాలు(అకడమిక్ యాక్టివిటి) ఎలా అమలవుతున్నాయో పరిశీలించడానికి సమయం లేకుండా ఉందని ఉప విద్యాశాఖ అధికారులు మొదలుకుని ఎంఈఓలు, హెచ్‌ఎంల దాకా ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 29 మండలాలకు రెగ్యులర్ ఎంఈఓలు లేరు. ఒక్కొక్కరు రెండు, మూడు మండలాలను పర్యవేక్షిస్తున్నారు. ఉపవిద్యాశాఖ అధికారుల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. జిల్లాలో ఒకే ఒక్క రెగ్యులర్ డీవైఈఓ ఉన్నారు. మిగిలిన అన్ని డివిజన్లకు ఇంఛార్జులే దిక్కు. గుంటూరు డివిజన్‌కు రెగ్యులర్ డీవైఈఓ ఉన్నారు. ఆయనే నరసరావుపేటకు ఇన్‌ఛార్జి. సత్తెనపల్లి ఇన్‌ఛార్జిగా డీఈఓ వ్యవహరిస్తున్నారు. డీఈఓ కార్యాలయంలో పనిచేసే ఏడీ నారాయణరావు తెనాలికి ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఆర్జేడీ కార్యాలయంలో పనిచేసే ఏడీ రవిసాగర్ బాపట్ల డీవైఈఓగా ఇన్‌ఛార్జి బాధ్యతల్లో ఉన్నారు.
ఉన్నతాధికారుల తనిఖీలతో బెంబేలు...
ఈ మధ్య పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులంతా తెనాలిలోని పురపాలక ఉన్నత, కొలకలూరిలోని జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికపై పర్యవేక్షణ లోపించిందని, వారు ఏం బోధిస్తున్నారో కూడా చూడడం లేదని హెచ్‌ఎంలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆయా మండలాల ఎంఈఓలు, డివిజన్ల డీవైఈఓలు తాము మ్యాపింగ్, నాడు-నేడు రెండో దశ పనులు ప్రారంభించారా లేదా అనేది చూడటానికే పరిమితం కావల్సి వస్తోందని, అకడమిక్ అంశాలపై దృష్టి పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు సైతం తాము పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రత, మధ్యాహ్న భోజనం పరిశీలన ఇవి ఎప్పటికప్పుడు ఐఎంఎంఎస్ యాప్‌లో అనుసంధానం చేయడానికే సమయం చాలడం లేదని ప్రధానోపాధ్యాయుడు ఒకరు తెలిపారు. సుమారు రెండు నెలల క్రితం తెనాలికి వచ్చిన ఉన్నతాధికార యంత్రాంగం అంతా మరోసారి జనవరిలో జిల్లాలో పర్యటిస్తామని ఇంతకుముందే పేర్కొంది. నాడు-నేడు రెండో దశ పనుల గ్రౌండింగ్‌కు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించడంతో చాలా వరకు హెచ్‌ఎంలు పిల్లల్లో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలుసుకోలేని పరిస్థితి ఉంది.. ఖాళీ పోస్టుల్లో రెగ్యులర్ ఎంఈఓల నియామకానికి చర్యలు తీసుకోవాలని, అప్పుడే పాఠశాలల్లో ఏం జరుగుతుందో పరిశీలించడానికి వీలవుతుందని ఎంఈఓల సంఘం నాయకులు తెలిపారు.
0 Comments