GET MORE DETAILS

అలనాటి అందాల తార, “మహానటి సావిత్రి” గారి జయంతి నేడు.

 అలనాటి అందాల తార, “మహానటి సావిత్రి” గారి జయంతి నేడు.కనుసైగతో కోటి కళలు పండించగల మహానటీమణి, వెండితెరకి మహారాణి, నటనకు శిరోమణి అయిన ఓ బంగారు బొమ్మ సినీ జగతిలో ఆవిడ ప్రయాణం మరచిపోలేని ఓ మధుర జ్ఞాపకం.

ఒక అందం అద్భుతమై కొన్ని దశాబ్దాలుగా వెండితెర వేలుపు అయితే ఆ అద్భుతం సావిత్రమ్మే. బయోపిక్ గా మారి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ విజయం ‘అమ్మాడి’ అయ్యుంటుంది. ఈనాటికి ఎందరి కలల లోనో ఆమె మహారాణి. ఆనాటి వారిని కదిలిస్తే మా సావిత్రి ఒక అద్భుతమేనమ్మా మీకేమి తెలుసు ఆ పసితనం వీడని బంగారు బొమ్మని చూడడానికి థియేటర్ లకు ఎన్నిసార్లు వెళ్లుంటామో అని మనసు నిండుగా ఆస్వాదిస్తూ ఆమె కబుర్లే. కళ్ళతోనే అభినయించిన ఏకైక వెండి తెర అభినేత్రి మహానటి సావిత్రి. అమాయకత్వం, ప్రేమ, దయ ఏకకాలంలో కురిపించే నేత్రాలు సావిత్రమ్మవి. ఎందరో మనసులను,హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న మహా నటి.. కేవలం ముఖ కవళికల ఆధారంగా మంత్రముగ్ధుల్ని చేసిన గొప్ప నటి.. భార్య అంటే ఇలా వుండాలి అని అనిపించిన “దేవత”లో ఆమె నటన వర్ణనాతీతం.

మహనీయుల్ని మర్చిపోలేము ఏ రంగం లో అయినా. అందర్నీ అలరించే సినీ రంగంలో ఒక తెరిచిన పుస్తకం సావిత్రమ్మ జీవితం. అందరూ ఆచరనీయులే అయినా ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఎవరైనా సినీ ఇండస్ట్రీ లో మీకు నచ్చిన మీరు మెచ్చిన నటి ఎవరైనా ఉన్నారా అని తెలుగువాళ్ళని అడిగితే చెప్పుకోక తప్పని పేరు మహానటి సావిత్రిది. ఆ విధంగా తెలుగువాళ్ళకి అభినయకళాపరంగా ఒక గొప్ప వారసత్వాన్ని ప్రసాదించి మన సంస్కృతిని పరిపుష్టం చేసిపోయిన మహామహురాలు ఆమె.

సావిత్రీ, ఆమె అక్కగారూ ఇద్దరూ కస్తూరీబాయి మెమోరియల్ స్కూల్‌కి వెళ్లేవారు. వాళ్ళు బడికేళ్ళే దార్లో ఓ డాన్సు స్కూలుండేది. తిరిగొచ్చేటపుడు నాట్యం చూసే పిల్లల్ని చూసేది సావిత్రి. ఎవరూ నేర్పకుండానే 8 ఏళ్లకే నాట్యగత్తెలా మెడతిప్పటం వచ్చేసింది. ఆ చిన్నవయసులోనే చూసినవారెవ్వరూ సావిత్రి మీద నుంచి చూపు మరల్చుకునేవారు కారు. ఒకటికి రెండుసార్లు చూసేవారు. బుగ్గలు పట్టుకుని లాగేవారు. అందంలో రకాలున్నాయి. చూడంగానే పూజ్యభావాన్ని కలిగిస్తూ “ఇలాంటి అక్కో, చెల్లెలో నాకుంటే బాగుండు”ననిపించేలాంటి దేవీకళతో ఉజ్జ్వలంగా వెలిగిపోయే అందం సావిత్రమ్మది. అందరూ తన అందాన్ని పొగడటంతో సావిత్రికి తన అందం మీద విపరీతమైన నమ్మకం. సావిత్రి సాధించిన విజయాల్లో కనీసం ఒక్క పదోవంతైనా ఈనాడు సాధించాలంటే ఇప్పటి హీరోయిన్లు ఎన్ని కోచింగ్లు తీసుకోవాల్సి వస్తుంది.

వెండితెర పై ఎప్పుడూ చెరిగిపోని చిరునవ్వుల వెన్నెల సంతకం సావిత్రమ్మ. పూలు విచ్చుకుని ఫక్కుమన్నట్టు వినిపించే నవ్వు ప్రతి ప్రేక్షకుణ్ణి మైమరపించేలా చేస్తుంది ఈనాటికి. ఆవిడ అందమైన ముఖంలో అనేక రకాల భావాల సమ్మేళనం. పాత్రకు తగినట్టుగా ఉండే ఆమె హావభావాలు చిన్నా, పెద్దా బీద, గొప్ప ఆడ మగ తేడా లేకుండా సినిమా హాల్ కి క్యూ కట్టించాయంటే అతిశయోక్తి కాదు. ఆనాటి అగ్ర హీరోలకు అభిమాన సంఘాలు ప్రధానంగా ఫలానా ఫలానా అని చెప్పుకోవచ్చేమో కానీ సావిత్రికి అభిమాన సమూహం ఈ సరిహద్దుల కతీతం. అందరూ సావిత్రి అభిమానులే. ఆ తరం వాళ్లే కాదు ఈ తరం వాళ్ళు కూడా గుర్తించి అభిమానించే ఏకైక నటీమణి సావిత్రమ్మ. నటిగానే కాక వ్యక్తి గా కూడా ఎవరి కష్టాలనయినా ,కన్నీళ్లనయినా చూసి కరిగిపోయే మనస్తత్వం, మనుషులను నమ్మే స్వభావం,తనకే పనైనా రాదని యెవరైనా అంటే ఆ పనిని సాధించే పట్టుదల, ఇంకా యెన్నో లక్షణాల బ్లాక్ అండ్ వైట్ వెండితెర సమాహారం సావిత్రి. అయితే నటిగా ఎంతో పేరు, ప్రతిష్ఠలు, డబ్బు సంపాదించినా, ఆవిడ వ్యక్తిగత జీవితంలో అనేక ఎత్తూ, పల్లాలూ, ఒడుదుడుకులూ ఉన్నాయి. కోలుకోలేని దెబ్బ తిని ఒకప్పుడు ఆవిడ నుంచి దానం పొందిన వాళ్ళు పొగరుగా ఎంతో ఎత్తులో ఉండి తెలియనట్టు ప్రవర్తించినా తన అభిమానాన్ని చంపుకోని ఒక మంచి మనిషి. మానవత్వమే ఆభరణం గా సినీ రంగం లో ఒక దేవత గా ఎదిగిన అరుదైన వ్యక్తిత్వం సావిత్రమ్మ.

స్త్రీల పట్ల బలహీనతతో మెలిగే భర్తతో విభేదాలూ, ఇతరుల కష్టాలకి చలించిపోయి చేసే దానాలూ, క్రమశిక్షణలేని జీవితం, జీవితంలో వేటాడే ఒంటరితనం, అభద్రత, ఆమెను మద్యానికి బానిసను చేసి,ఆమె నాశనానికి కారణమయినా ఆవిడ ఎప్పుడూ వెండి తెర మహా సామ్రాజ్ఞి .

Post a Comment

0 Comments