GET MORE DETAILS

జ్ఞానజ్యోతి

 జ్ఞానజ్యోతి 

    


"స్వార్ధపరులు తమ సుఖం కోసమే జీవిస్తారు. సామాన్యులు తమ కుటుంబాల క్షేమం కోసం మనుగడ సాగిస్తున్నారు. మహానీయులు మాత్రం సమాజ కళ్యాణం కోసం తమ జీవితాన్ని త్యాగం చేస్తారు" అట్టి మహనీయుడు బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ అంటే ఒక మానవతామూర్తి, విజ్ఞాన జ్యోతి, త్యాగశీలి, బహుముఖప్రజ్ఞాశాలి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న,బోధిసత్వుని గా ఎందరికో ఆదర్శప్రాయుడు.

ప్రపంచానికి మానవతా సుగంధ పరిమళాలను పంచిన జ్ఞాన సూర్యుడు గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ద్వారా  ప్రభావితుడై లింగ వివక్షత లేకుండా హక్కులను కల్పించిన నవభారత నిర్మాత,భారతదేశ భాస్కరుడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి డిసెంబర్ 6  ను పురస్కరించుకొని....

పేదరికం పెను సవాలుగా మారిన అంటరానితనం వెంటాడినా "వివాహం విద్యకు ప్రతిబంధకం" అనే నానుడిని తలకిందులు చేస్తూ 1907లో మంచి మార్కులతో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించాడు. ప్రముఖ సంఘ సంస్కర్తలు అయిన  SK బోలే మరియు కృష్ణాజి కేలస్కర్ ప్రోత్సాహంతో, బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్ అందించిన ఆర్థిక సహకారంతో విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి అనేక డిగ్రీ పట్టాలను అందుకున్నాడు. "ఆసియా ఖండంలోని అర్థశాస్త్రంలో మూడు మాస్టర్ డిగ్రీలు" సాధించిన మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు.

భారతదేశంలో స్త్రీల స్వేచ్ఛకు ద్వారాలు తెరిచిన వారు గౌతమబుద్ధుడు అయితే, ఆయన స్ఫూర్తితోనే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, పనిగంటల తగ్గింపు, పనిలో ప్రమాదానికి గురైన కార్మికులకు జీవనభృతి కల్పించారు. భారత దేశ ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పురుషులతోపాటు స్త్రీలకు సమాన హక్కులు కల్పించాలని "హిందూ కోడ్ బిల్లు" ను భారత పార్లమెంటులో ప్రవేశపెట్టారు కానీ కొందరు మతఛాందస వాదుల వ్యతిరేకత వల్ల బిల్లు పాస్ కాకపోవడంతో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన 'స్త్రీ జననొద్దారకుడు'  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు.

నేడు భారత దేశంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి కేంద్ర - రాష్ట్రాల లోని  స్త్రీ శిశు శాఖ మంత్రులు, లోపాయికారి చట్టాల రూపకల్పనకు అనుమతులిస్తున్న న్యాయ శాఖ మంత్రులు, నిందితులకు కఠిన శిక్షలను విధించడంలో విఫలమవుతున్న హోంశాఖ మంత్రులు ఎంత మంది రాజీనామా చేసి తమ నైతిక విలువలను చాటుకున్నారు. అయినా నేటి భారత పౌర సమాజానికి కావలసింది పచ్చనోటు, బిర్యాని ప్యాకెట్లు, బీరు సీసా, నైతిక విలువలు లేని నాయకులు ఇది చాలా... నా భారత దేశ ప్రజల్లారా... మీ/ మనకోసం ఆ మహనీయుడు తన 5 గురి సంతానాన్ని, చివరికి తన అర్ధాంగి ఆయన మాత రమాబాయి గారిని కోల్పోయాడు, కడదాకా  తన   జీవితాన్ని త్యాగం చేసిన త్యాగధనుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు. అయినా నేటి భారతదేశ స్త్రీ మూర్తులకు అంబేద్కర్ అంటే ఎవరో తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు. వారికి తెలిసినదల్ల 'సత్యనారాయణ వ్రతం, సీతారామ కళ్యాణం, శ్రీ కృష్ణాష్టమి మరియు శివరాత్రి పూజలు'. ఇక్కడ మిమ్మల్ని విమర్శించడం లేదు వాస్తవాన్ని తెలుసుకొని మేల్కొంటారని వినమ్రతతో వేడుకుంటున్నారు.

పంచాయతీరాజ్ స్థాయి నుంచి పార్లమెంటు వరకు ఎందరో మహిళలు పురుషులతో పాటు సర్పంచులుగా, MLA, MP, మంత్రులుగా,ప్రధానమంత్రిగా సమానమైన రాజకీయ పదవులను పొందుతున్నారు. నేల నుండి నింగి  వరకు మహిళలు ఉన్నతమైన ఉద్యోగాలను అనుభవిస్తున్నారు. దేశంలో అత్యున్నత మైన రాజ్యాంగబద్ధమైన రాష్ట్రపతి పదవిని అలంకరించి ప్రథమ పౌరురాలిగా కొనసాగుతున్నారు. మహిళలు అనుభవిస్తున్న అష్టైశ్వర్యాలు అంబేద్కర్ గారు ప్రసాదించినవి. ఇవన్నీ అంబేద్కర్ గారికి స్త్రీల పట్ల వున్న సమున్నత వైఖరి గా చెప్పవచ్చు.

బహుజన రాజ్యాధికారం కోసం వాక్చాతుర్యంతో, వాద పటిమతో బ్రిటిష్ ప్రభుత్వచేత ఒప్పించి  బ్రిటన్ పార్లమెంటులో   ప్రధాని 'రామ్సే మెక్డొనాల్డ్' చే ఒకవైపు "ఒక మనిషి - ఒకే ఓటు -ఒకే విలువ" మరోవైపు 'కమ్యూనల్' అవార్డును ప్రకటింప చేశాడు. గాంధీ గారి కుటిల నీతి వల్ల తన జాతి ప్రజల నోటికాడి ఫలాలను చేజార్చుకున్న నిఖార్సైన స్వతంత్ర సమరయోధుడు డాక్టర్ BR అంబేద్కర్ గారు. "మహమ్మద్ అలీ జిన్నా గారు పాకిస్తాన్ ను కోరుకున్నట్టు, ప్రత్యేక దళితస్థాన్ ను కోరుకోని నిష్కళంకమైన దేశభక్తుడు  బాబాసాహెబ్ అంబేద్కర్" గారు. సనాతన సంప్రదాయం పేరుతో మనిషిని - మనిషిగా చూడలేని హైందవ / హిందూమతం వదిలి విదేశీ మతాలను స్వీకరించకుండా ఒకనాటి భారతదేశ బౌద్ధాన్ని స్వీకరించి లోకానికి చాటి చెప్పిన లౌకికవాది, మౌర్య సామ్రాజ్య చక్రవర్తి సామ్రాట్  అశోకడు తర్వాత బౌద్ధాన్ని భారతదేశంలో పునరుద్ధరింప చేసిన వారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు. ఇది కాదా... దేశ సంస్కృతి పై అతనికున్న మమకారం. బాక్రానంగల్ దామోదర లోయ వంటి బహుళార్థసాధక ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన రైతు బాంధవుడు. RBI స్థాపనకు  మార్గదర్శకుడయ్యాడు ఇవన్నీ భారత దేశాన్ని ఒక తాటి పైకి తీసుకురావడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు  తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు.

1927 సంవత్సరంలో 'మహాద్ పోరాటం' నిర్వహించి, 1937లో బొంబాయి హైకోర్టు ద్వారా నిమ్న వర్గాల వారికి 'చౌదర్' చెరువు పై హక్కులను సాధించిన సాంఘిక విప్లవ నేత. " ఆఫ్రో అమెరికన్లు అనుభవిస్తున్న బానిసత్వం కన్నా - అస్పృశ్యత నీచమైనది, ఆఫ్రికా నల్లజాతీయులు చవిచూసిన వర్ణ వివక్షత కన్నా - కుల వివక్షత క్రూరమైనది" అని ప్రపంచానికి చాటి చెప్పిన  చైతన్య శీలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు. క్రీ.శ. 175 నుంచి భారతదేశంలో 'అసమానతలను- అన్యాయాన్ని- మతతత్వాన్ని- బానిసత్వాన్ని' బలపరుస్తూ వస్తున్న  మనుస్పృతి ని '1927 డిసెంబర్ 25'న తగలబెట్టి చరిత్ర సృష్టించిన విజేత డాక్టర్ బి.ఆర్  అంబేద్కర్ గారు. డిసెంబర్ 25 "పీడిత జన విజయోత్సవ దినం" గా భారతదేశ చరిత్రలో స్థిరపడిపోయింది.


"నేను నా భార్య బిడ్డల కన్నా పుస్తకాలను ఎక్కువగా ప్రేమిస్తాను. పుస్తకాలు దీపాల వంటివి అవి మనో మాలిన్యమనే  చీకటిని తొలగిస్తాయి" అని, "అధ్యయనం లేకుండా జ్ఞానం పెరగదు.జ్ఞానం లేకుండా శక్తి కలగదు" అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నారు.


శాస్త్రీయ సామ్యవాది ప్రథమ ప్రధాని శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు "మంత్రులలో మణిపూస" లాంటివాడు  అని, రాజ్యాంగ నిర్మాణం పరంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  రుణం తీర్చుకోలేనిది అని రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు,భారత దేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు పేర్కొన్నారు.  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగము 'దక్షిణాఫ్రికా' రాజ్యాంగ రచనకు మార్గదర్శకం అయిందని నోబెల్ బహుమతి గ్రహీత డా. నెల్సన్ మండేలా కొనియాడాడు.USA మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా.... ''ప్రపంచ దేశాలను శాసించే నేను  జ్ఞాన ముందు తల జీవించాల్సి వస్తుంది అంటే అది కేవలం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్" గారికి మాత్రమే అని కొనియాడాడు. నేడు ప్రపంచ దేశాలు అంబేద్కర్ గారిని "సింబల్ ఆఫ్ నాలెడ్జి" గా స్లాగిస్తున్నాయి.   'పుస్తకం నా నేస్తం పఠనం నా క్రాంతి పథం' అనే అంబేద్కర్ గారి సూక్తిని ఆచరిస్తూ ప్రతి వ్యక్తి ఆ మహనీయుని అడుగుజాడల్లో ముందుకు సాగుతారు అని ఆశిస్తున్నాను.

Post a Comment

0 Comments