GET MORE DETAILS

ఆగుతుందా దోపిడీ ? ఇచ్ఛాపురంలోని సబ్‌ రిజిష్టర్‌ కార్యాలయం

ఆగుతుందా దోపిడీ ? ఇచ్ఛాపురంలోని సబ్‌ రిజిష్టర్‌ కార్యాలయం



- రిజిస్ట్రేషన్ల శాఖలో దళారులపై దృష్టి

- డాక్యుమెంట్‌ రైటర్లకు ప్రవేశానికి చెక్‌

- ఐజీ ఉత్తర్వులు 

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పేరు చెబితే ఠక్కున గుర్తొచ్చేది డాక్యుమెంట్‌ రైటర్ల హడావుడి...దళారుల దోపిడీ. ఇకపై దళారుల జోక్యానికి చెక్‌ పెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోకి డాక్యుమెంట్‌ రైటర్లు,  మధ్యవర్తులను రానీయొద్దని ఆ శాఖ ఐజీ రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. డాక్యుమెంట్‌ రైటర్లు దళారులుగా వ్యవహరిస్తూ.. ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయిస్తూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనే తిష్ట వేస్తున్నారు. కొంతమంది కొద్దికాలంలోనే లక్షాధికారులుగా మారుతున్నారంటే అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తనిఖీల్లో ఎక్కువగా వాళ్లే పట్టుబడుతుండటంతో ఏసీబీ అధికారులు ఈ విషయాన్ని ఆ శాఖ ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. ఏసీబీ సూచనలను పరిగణనలోకి తీసుకొని ఐజీ ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి రాష్ట్రంలో డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థ 1971 నుంచి ఉండేది. అప్పటి ప్రభుత్వం వారికి లైసెన్సులు మంజూరు చేసింది. పనితీరు, నిజాయితీ ఆధారంగా వారి లైసెన్సులు రెన్యువల్‌ చేసేవారు. 2001లో టీడీపీ ప్రభుత్వం ఎవరైనా దస్తావేజులు రాసుకోవచ్చని, డాక్యుమెంటు రైటర్లను ఆశ్రయించవద్దని ఆ వ్యవస్థను రద్దు చేసింది. 2002 నుంచి డాక్యుమెంటు రైటర్లకు రెన్యువల్‌ను నిలిపేసింది. అప్పటి నుంచి రైటర్లకు పూర్తి బాధ్యత లేకుండా పోయింది. ఎవరు పడితే వారు దస్తావేజులు రాస్తూ, తాము డాక్యుమెంటు రైటర్లమని చెప్పుకొంటూ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో తిష్ట వేస్తున్నారు. లైసెన్స్‌డ్‌ డాక్యుమెంటు రైటర్లు లేకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతోంది. ఇటీవల జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా పుంజుకోవడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారుల సంఖ్య పెరిగిపోయింది. ఆస్తి హక్కుదారుడే స్వయంగా దస్తావేజులు రాసుకునే వెసులుబాటు ఉన్నా... తప్పులు రాస్తామేమోనని కొందరు దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. మరోవైపు కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌కు అధికారులు అడ్డు తగులుతున్నారని దళారులు ప్రజలను నమ్మిస్తున్నారు. ఈ క్రమంలో దళారులు చెప్పినంత ముట్టచెప్పి అనేక మంది రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. ఇకపై దళారులు కార్యాలయాల్లో తిరిగితే సబ్‌రిజిస్ట్రార్‌ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ శాఖ ఐజీ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అలా చేస్తే సబ్‌ రిజిస్ట్రార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులను సబ్‌రిజిస్ట్రార్లు ఎంత వరకు అమలు చేస్తారో వేచి చూడాలి. 

చర్యలు తీసుకుంటాం :

జిల్లాలో 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారులు, డాక్యుమెంటు రైటర్లమని చెప్పుకొని తిరిగే వారికి, మధ్యవర్తులకు ప్రవేశం లేదు. వారిని కార్యాలయాల్లోకి అనుమతించవద్దని ఉత్తర్వులు అందాయి. వారిని అనుమతిస్తే సబ్‌ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుంటాం. 

- ఆర్‌.సత్యనారాయణ, జిల్లా సబ్‌రిజిస్ర్టార్‌, శ్రీకాకుళం

Post a Comment

0 Comments