గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః - ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది?, మొదట ఎవరు పలికారు?, ఎందుకు పలికారు?, దాని వెనుక ఉన్న కథ ఏమిటి?
పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాన్ని విద్యాధరుడు అనే గురువు గారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువు గారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు. గురువు గారు తిరిగి వచ్చేవరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు.
గురువు గారు తిరిగివచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుణ్ణి తీసుకెళ్లాడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువు గారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని ఖరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు.
వాళ్ళు వెళ్లిన తరువాత గురువు కారణం అడిగాడు. అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు "గురువు గారూ మీరు కొన్ని రోజుల క్రితం బయటకు వెళ్ళినపుడు మీ జాతకం చూశాను. మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్లలేను" అని చెప్పాడు.
కొన్ని రోజులకు గురువు గారికి క్షయ రోగం వచ్చింది. ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్లి దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేయాలని గురుశిష్యులు కాశీకి వెళ్లారు. గురువు గారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్ళను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువు గారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతో మంది గురువు గారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువు గారిని వదలలేదు.
కౌత్సుడి గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారు వేషంలో వెళ్లి గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారు వేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదయినా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు.
అతని గురు భక్తికి మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి, ఈ రోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు. మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఈ శ్లోకం చెప్పాడు.
గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువే నమః
తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురు భక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువు గారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు.
ఇదీ ఈ శ్లోకం వెనుక ఉన్న కథ.
కొన్ని ముఖ్య శ్లోకాల విలువలను, అర్ధాలను అందరం తెలుసుకోవాలి. అలాగే మన తరువాత వాళ్ళకి కూడా తెలియజేయాలి.
0 Comments