GET MORE DETAILS

అశోకుడి సామ్రాజ్యం పతనమైందిలా...! ఈ వర్తమానం ఆయన ప్రవర్తమానం...!

 అశోకుడి సామ్రాజ్యం పతనమైందిలా...! ఈ వర్తమానం ఆయన ప్రవర్తమానం...!చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అనే మాటకు
ఓ సవరణ..చేతులు కాల్చుకుని మరీ ఆకులు పట్టుకున్న వైనం..ది గ్రేట్ అశోక్ గజపతి రాజా వారిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వర్తమానం రాజుగారి ప్రవర్తమానం.!లేకపోతే ఏంటి..ఈ గడ్డపై అన్యుల పెత్తనమా
విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి రాజు
ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీనే గెలవాలి. ఆయన ఏ పార్టీలోనూ లేకపోయినా ఆయన గెలిచి తీరాలి. అలాంటి ఓ మనిషి ఈ రోజున ఇలా వైభవం కోల్పోయి, ప్రాభవానికి దూరమై తన గడ్డపైనే ఇడుముల పాలవుతూ అవమానాలు ఎదుర్కొంటున్నారంటే అది విధి రాత కాదు, ఖచ్చితంగా స్వయంకృతం. దిద్దుకోలేని తప్పులు కోకొల్లలు.
ఇదంతా పొరపాట్ల ఓ పరంపర.         

నిజానికి ఈ కథ 1978 నుంచి మొన్న అంటే 2021 డిసెంబర్ 22 న రామతీర్థం లో జరిగిన దుస్సంఘటన వరకు ఓ అంతులేని కథ తుది లేని వ్యధ.

ఈ కథలో చాలా భాగం దూరం నుంచో, దగ్గర నుంచో చూసిన మొన్నటి తరం కుర్రాడిగా, నిన్నటి తరం జర్నలిస్టుగా, రచయితగా, విశ్లేషకుడిగా సమగ్రంగానే అయినా కాస్త టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి ఇది అందరికీ తెలిసిన కథే..ఒక్క అశోక్ గజపతికి తప్ప..!
      

1978 లో రాజకీయ అరంగేట్రం చేసిన నాడు అశోక్ ఓ హీరో.. అప్పటి వరకు పెద్దాయన పి వి జి రాజు రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్నప్పటికీ ఆయనకు ఒట్లేసిన జనం ఆయన్ని చూసిందే తక్కువ.రాజుగారు బరిలోకి దిగారంటే ఓటు
వేసేయడమే. అప్పటికే ఈ ప్రాంతానికి ఎన్నో చేసిన ప్రభువుల వారి నుంచి మారు ఆశించింది లేదు.అలాంటి దశలో యువరాజు రంగప్రవేశం ఓ పెద్ద విశేషం.ఆ రోజుల్లో ప్రజలకు రాజకీయాలపై పెద్ద అవగాహన..ఆసక్తి ఉండేవి కావు. ఊరు బాగుండాలి.
ఆ ఊరిలో మనం ఉండాలి. అంతే. సహజంగానే విజయనగరం ప్రజలకు రాజకుటుంబంపై గౌరవం జాస్తి. అందుకే అశోక్ గజపతి ఏ పార్టీ తరపున పోటీ చేసారన్నది పట్టించుకోకుండా ఆయన్ని గెలిపించారు. గెలిచిన తర్వాత అశోక్ నాటి నుంచి నిన్నటి వరకు ఒకే రకమైన వ్యవహారశైలితో ఉన్నా ప్రజలు 1978 నుంచి 2004 వరకు ఆయన్ని అప్రతిహతంగా గెలిపిస్తూ వచ్చారు.2004 లో ఓ ఝలక్ ఇచ్చి మళ్లీ 2009 లో ..2014 లో ఆయన్నే గెలిపించారు. మొన్న 2019 ఎన్నికల్లో సైతం అశోక్ ఓటమి ఆయన వ్యక్తిగతం కాదు.జగన్ ప్రభంజనంలో అతిరథ మహారధులే కొట్టుకుపోయిన సీజనది..అయితే అలాంటి వ్యతిరేక వెల్లువలో సైతం గెలవాల్సిన అశోక్ గజపతి విజయనగరం లోక్ సభ స్థానం నుంచి బెల్లాన చంద్రశేఖర్ చేతిలో ఓడిపోవడం రాష్ట్రం మొత్తాన్ని ఆశ్చర్యంలో పడేసింది.ఇక్కడే మనం అశోక్ కథను క్లుప్తంగా చెప్పుకుంటే సరిపోద్ది..సమగ్రంగా కాకుండా పాయింట్ల రూపంలో వివరించే ప్రయత్నం చేస్తా.


✒ అశోక్ ఏనాడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చెయ్యలేదు..


✒ ఎంతసేపు హైదరాబాద్..జిల్లాలో ఉంటే బంగళా మేడ..


✒ జనాల పనులు చేసి పెట్టే కృషి ఆయన నుంచి ఎప్పుడూ కనిపించలేదు.చిన్న పనులు..పీకల మీదకి వచ్చిన పనికైనా అశోక్ వద్దకు వెళ్ళాలన్న ఆలోచన..వెళ్తే అవుతుందన్న నమ్మకం..అసలు ఆయనతో మాటాడే అవకాశం లభిస్తుందన్న ఆశ జనాలకు
ఏ దశలోనూ కలిగిన పరిస్థితి లేదు.దాంతో జనాలు అశోక్ పై పూర్తిగా ఆశలు వదులుకున్న స్థితి..


✒ అన్నిటికంటే కీలకంగా ఆయన చుట్టూ ఓ కోటరీ ఏర్పడి ఇతరులను ఆయన దరి చేరకుండా చేసిందన్న బలమైన అభిప్రాయం. ఆ కోటరీలో ఉన్నది కూడా పూర్తిగా స్వకులస్థులే కావడం మరో బలమైన వ్యతిరేక ముద్ర!


✒ ఇక కాపులంటే అశోక్ గజపతికి నప్పదనే మరో బలమైన ఫీలింగ్..ఆ పరిస్థితి నుంచే సత్తిబాబు అనే ఓ శక్తి పుట్టుకొచ్చింది.. అప్పటికే కాంగ్రెస్ లో కాపు నినాదంతో అక్కడి ఏకపక్ష పాలనను త్రోసి రాజని మొదటి వరసలోకి వస్తున్న సత్తిబాబుకి తెలుగుదేశంలో పరిస్థితులు..అశోక్ వైఖరి కూడా కలిసి వచ్చి ఒకనాటికి విజయనగరం రాజకీయాల్లో ఒక మహాశక్తిగా ఆవిర్భవించి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగాడు.ఇదంతా అశోక్ అనవసర రాజకీయ నైపుణ్యాల పుణ్యమే..


✒ పార్టీలో కాపుల ఎదుగుదల..ఇంకా చెప్పాలంటే పొడ రుచించని అశోక్ 1999లో తీసుకున్న తప్పుడు నిర్ణయం మొత్తానికే ఎసరు తెచ్చింది..సొంత పార్టీలో ఒక దెబ్బకు రెండు పిట్టలు అనుకుంటే విపక్షంలో ఎన్నో పిట్టలకు రెక్కలొచ్చి సైకిల్ గాలి తుస్సుమంది.అక్కడి నుంచి జిల్లాలో తెలుగుదేశం పతనం మొదలై ఒకనాడు పన్నెండుకు పన్నెండు స్థానాలు గెలుచుకున్న సైకిల్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవక పూర్తిగా కుదేలైపోయింది..ఇదంతా అశోకుడి 1999 నాటి నిర్ణయం ఫలితమే..నిస్సందేహం!


✒ చట్టం తన పని తను చేసుకుపోతుంది..ఇది తన వద్దకు పనులపై వచ్చే సామాన్యులకు సైతం అశోక్ చెప్పే పాఠం..ఇదే ఈరోజున ఆయన ప్రతిష్ట..పార్టీ పరువు కొల్లేరులో పడడానికి ప్రధాన కారణం..పనులు చేసి పెట్టకపోగా వచ్చిన వారికి క్లాసులు పీకే పరిస్థితి బంగ్లాలో ఎదురుకావడంతో జనం విసిగిపోయిన పరిస్థితి. బంగ్లా మెట్లు ఆయన దిగిరారు..పైకి ఎక్కే అవకాశం సామాన్యులకే కాదు కాస్త స్థాయి ఉన్నవారికి కూడా దుర్లభం అనే దుస్థితి.


✒ బంగ్లాలో ఎప్పుడూ రాచరిక ఛాయలే. రాజదర్బార్ వాతావరణమే. ప్రజలకు రాజుకు మధ్య దుర్భేద్యమైన అడ్డుగోడలు ఎన్నో.!


✒ ఇక అశోక్ అతి పెద్ద వైఫల్యం అభివృద్ధిలో వెనకబాటు.
1978 నుంచి ఇప్పటివరకు ఎనిమిదేళ్లు మినహా పదవిలో ఉన్న అశోక్ కారణంగా ఆయన సొంత అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం.. లోక్ సభ నియోజకవర్గం..మొత్తంగా విజయనగరం జిల్లా అభివృద్ధిలో ఏ దశలోనూ ముందంజ వేసింది లేదు..ఈ వైఫల్యం విషయంలో అన్ని వేళ్ళు నిస్సందేహంగా అశోక్ వైపే తిరుగుతాయి.


✒ పరిశ్రమలు కొత్తవి రాకపోగా ఉన్నవి మూతపడినా అశోక్
ఏ దశలోనూ పట్టించుకున్న దాఖలాలు లేవు.వ్యక్తుల ప్రయోజనాలు నెరవేర్చకపోగా జిల్లా అభివృద్ధి విషయంలో
కూడా ఏనాడూ ప్రత్యేక శ్రద్ధ చూపించింది లేదన్నది ఆయనపై ప్రధాన విమర్శ.ఇది అశోక్ లో అతి పెద్ద మైనస్ పాయింట్ కూడా..!

ఇది వ్యక్తిగత బలహీనతే అయినా చెప్పక తప్పడం లేదు. తెలుగు గడ్డపై పుట్టి, తెలుగు సంస్కృతికి ఆటపట్టు. కళలకు, సాహిత్యానికి కాణాచి అయిన విజయనగరంలో పెరిగిన ఆయన ఇప్పటికీ తెలుగు భాష స్వచ్ఛంగా మాటాడలేకపోవడం విడ్డూరం. అలాగని ఆయన తెలుగు నేలకు దూరంగా విదేశాల్లో చదువుకున్నదీ లేదు. పోనీ ఆ విషయం పక్కనబెడితే నలభై సంవత్సరాలకు పైగా ప్రజాజీవితంలో ఉన్నా తెలుగు బాగా మాటాడే పరిస్థితి తెచ్చుకున్నది లేదు. దీని కారణంగానే ఆయన ఎన్నో సందర్భాల్లో ఇబ్బందులకు గురైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ బలహీనతని ఆయన అధిగమించ లేకపోయారు.

చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్పకుండా ఇంకేదో మాటాడ్డం కూడా అశోక్ ప్రధాన బలహీనత. ఈ విషయంలో ఆయనపై విమర్శలు ఉన్నాయి.అవి ఆయన వరకు వెళ్ళాయో లేదో కాని మొత్తంగా ఇన్నేళ్ళయినా ఆయన శైలి మారలేదు.

చివరగా మరో పెద్ద అంశం...

అశోక్ ఇంకా రాచరిక పోకడలతోనే వ్యవహరిస్తారన్న
మాట ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావనార్హం..ఆధునిక కాలంలో కూడా ప్రభువులు అధికారం చేసే చోట ఇతరులను ఎదగనివ్వరని..తమ ప్రాంతం అభివృద్ధి చెంది..పరిశ్రమలు ఏర్పడి కొత్త జనాలు వస్తే తమ ఆధిపత్యం పలచబడిపోతుందనే విమర్శ అశోక్ వైఖరి కారణంగా ఈ జిల్లాలో చాలా సందర్భాల్లో ప్రస్తావనకు వస్తుంటుంది.
అలా చేసినా..లేకపోయినా అశోక్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ నిందను మోయక తప్పలేదు.
#ఇప్పుడివన్నీ ఆలోచించి అశోక్ తన వైఖరి మార్చుకునే ప్రయత్నం చేస్తే .. అహ..చేయాలనుకున్నా సమయం మించిపోయినట్టే..పరిస్థితి చెయ్యి దాటిపోయినట్టే..!
ఔనా..కాదా..!?


Post a Comment

0 Comments