GET MORE DETAILS

మానవాళికి మేలు చేసే గబ్బిలం - సమతుల ప్రకృతికి కీలకం

మానవాళికి మేలు చేసే గబ్బిలం - సమతుల ప్రకృతికి కీలకంఒక గబ్బిలం గంటలో సుమారు వెయ్యి దోమలను తింటుంది. గబ్బిలాలు రాత్రంతా పొలాల్లో, అడవుల్లో, మన చుట్టూ ఉండే పరిసరాల్లో పురుగులు, కీటకాలను వేటాడి భక్షిస్తాయి. ఇవి చాలదా మన శ్రేయస్సుకు? పాలిచ్చే అతి చిన్న జీవి, నిశాచరి అయిన గబ్బిలం- పగటి పూట తలకిందులుగా వేలాడుతూ చెట్లపై నిద్రిస్తుంది. కొండ బిలాల్లో, పాడుపడిన గుడుల్లో, పాత ఇళ్లలోను అవి నివాసముంటాయి. కొన్ని పుాలు, పళ్లు, కాయలు, పుప్పొడులు తింటాయి. తేనె తాగుతాయి. వీటి విసర్జితాల్లోని గింజలు ఖాళీ ప్రదేశాల్లో పడి పలురకాల మొక్కలు మొలకెత్తడానికి దోహదపడతాయి. పరోక్షంగా అటవీ సంపదను పెంచుతాయి. థాయ్‌లాండ్‌కు చెందిన పరిశోధకులు గబ్బిలాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇవి వరిపైరును ఆశించే పురుగులను తినడం ద్వారా పలు రకాల తెగుళ్ల నుంచి పంటను కాపాడుతున్నాయని కనుక్కున్నారు. గబ్బిలాలే లేకపోతే థాయ్‌లాండ్‌లో ఏడాదికి 2,900 టన్నుల ధాన్యాన్ని నష్టపోవాల్సి వచ్చేదని తేల్చారు. ఆ ధాన్యం ఏడాది పాటు 26వేల మంది తినడానికి సరిపోతుందని లెక్కించారు. వీటి విసర్జితాల్లో అధిక మోతాదులో నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌ ఉంటాయి. అవి సహజ ఎరువులుగా నేలను సారవంతం చేస్తున్నాయి.

ధ్రువ ప్రాంతాల్లో మినహా మిగతా ప్రపంచమంతటా గబ్బిలాలు కనిపిస్తాయి. వీటిలో 12 వందలకు పైగా రకాలు ఉన్నాయి. ఇండియాలో 120 రకాలున్నాయి. ఇవి ఎన్నో పర్యావరణ సేవలందిస్తాయి. కానీ ఇతర జీవులతో పోలిస్తే వీటిపై అపోహలూ ఎక్కువగానే ఉన్నాయి. కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచే వ్యాపించిందనే విషయంపై శాస్త్రీయ రుజువులు కనిపించడమే ఇందుకు కారణం. నిఫా, నిండ్రా, మర్‌బర్గ్‌, ఎబోలా, కరోనా వైరస్‌లకు గబ్బిలాలు సహజ ఆశ్రయాలనే భావన ఉంది. ఇవి వైరస్‌లకు నిలయాలైనప్పటికీ జబ్బు పడవు. వైరస్‌లను అణిచిపెట్టగల శక్తి వీటి శరీరానికి ఉంది. అయితే, వైరస్‌ కలిగిన గబ్బిలాలు మానవ ఆవాసాలకు దగ్గరైనా, వాటి మాంసం తిన్నా ఆ వైరస్‌ మనుషులకు సోకే ప్రమాదం ఉంది. కొవిడ్‌ వ్యాధి ప్రపంచ మానవాళిని కష్టాల కడలిలోకి నెట్టింది. ఈ మహమ్మారి వ్యాప్తి అనంతరం జరిగిన పరిశోధనల్లో గబ్బిలాలు పలు ప్రమాదకర వైరస్‌లను తమతో మోసుకువస్తాయని తేలింది. పలు రకాల వైరస్‌లకు నిలయాలైనప్పటికీ వాటన్నింటినీ మానవులపై వెదజల్లుతాయనే భయం అవసరం లేదని నిపుణులు అంటున్నారు. చాలా అరుదుగా మాత్రమే వాటి నుంచి వైరస్‌లు మనుషులను ఆశ్రయిస్తాయి. గబ్బిలాలకు ఉన్న రోగనిరోధక శక్తి ప్రత్యేకమైంది. అందువల్లే దాన్ని వైరస్‌లు ఏమీ చేయలేవని జంతుశాస్త్ర పరిశోధకులు చెబుతున్నారు. ఇంతే శరీర బరువు గల జీవుల్లో ముప్పై ఏళ్లు బతికేది ఇదొక్కటే.

నానాటికీ పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చేందుకు అడవుల నరికివేత, వ్యవసాయ విస్తరణ, గనుల తవ్వకం, రోడ్లు, రైలు మార్గాల ఏర్పాటు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. అభివృద్ధి పేరిట మనిషి తన సౌకర్యం కోసం భుాభౌతికతను పాడు చేస్తున్నాడు. ఈ వినాశనానికి శాస్త్ర, సాంకేతికతలనూ వినియోగించడంవల్ల సహజ వనరులు వేగంగా కనుమరుగవుతున్నాయి. సహజ పర్యావరణ సమతౌల్యం విచ్ఛిన్నమవుతోంది. ఈ క్రమంలో గబ్బిలాల నివాసాలు ధ్వంసమై, అవి ఒత్తిడికి గురయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫలితంగా వాటిలోని వైరస్‌లు మానవులకు సోకే అవకాశాలు పెరిగాయని నిపుణులు అంటున్నారు. కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తున్నా- పర్యావరణ స్పృహను తట్టిలేపిందనే చెప్పాలి. మనకు ఎంతో మేలు చేసే గబ్బిలం గురించి జరుగుతున్న అధ్యయనం ప్రారంభదశలో ఉంది. వైరస్‌లకు చికిత్స అవసరం. కానీ వాటి వ్యాప్తిని అరికట్టే నివారణ చర్యలకూ అంతే ప్రాధాన్యమివ్వాలి. కొన్ని రకాల వృక్ష జాతుల్లో పరపరాగ సంపర్కానికి గబ్బిలాలు తోడ్పడతాయి. తద్వారా ఆయా ఫలాలు మనకు అందుబాటులోకి వచ్చేందుకు తోడ్పడతాయి. ఇవి పంటలను ఆశించే కీటకాలను తినడం వల్ల అమెరికాలో కీటకనాశనుల కొనుగోళ్లపై ఏడాదికి దాదాపు నాలుగు వందల కోట్ల డాలర్లను ఆదా చేయవచ్చని నిపుణుల అంచనా. ప్రభుత్వాలు గబ్బిలాల ఆవాసాలను పునరుద్ధరించడంలో భాగంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. తద్వారా పర్యావరణ సంరక్షణకు అవకాశం కలుగుతుంది. మానవాళికి వైరస్‌ల బెడదా తగ్గుతుంది.

- వి.వరదరాజు

Post a Comment

0 Comments