ఇంధన సంస్థలకు సీనియర్ ఇంజనీర్లు గుడ్‌బై - వేతన సవరణతో నష్టపోతామనే...
వందల మంది వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు
ఇలాగైతే అనుభవజ్ఞుల కొరత ఖాయం!
రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన కొత్త వేతన సవరణపై రాష్ట్ర ఇంధన సంస్థలకు చెందిన సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇది అమల్లోకి వస్తే తమకు వేతనాలపరంగా పెన్షన్‌పరంగా భారీగా రూ.లక్షల్లో నష్టం వాటిల్లుతుందని కలవరపడుతున్నారు. అందుకే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎ్‌స)కు దరఖాస్తు చేసుకుంటున్నారు.
జగన్ సర్కారు ఖరారు చేసే కొత్త వేతన సవరణ విధానం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని అంచనా. 14.29శాతానికి మించి ఫిట్‌మెంట్ ఇచ్చేది లేదని ప్రభుత్వం భీష్మించడం.. డీఏలను ఎగ్గొట్టి వాటిని వేతనాల్లో కలపాలని చూడడం వంటి చర్యలతో.. జీత భత్యాలు పెరగడం మాట అటుంచి.. బాగా తగ్గిపోతాయన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. తూర్పు, దక్షిణ, కేంద్ర ప్రాంతీయ విద్యుత్ పంపిణీసంస్థ (డిస్కమ్)లు, ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, విద్యుదుత్పత్తి సంస్థల ఉద్యోగులందరిలోనూ ప్రభుత్వ వైఖరి అలజడి కలిగిస్తోంది. ముఖ్యంగా సీనియారిటీ కలిగిన ఇంజనీరింగ్ సిబ్బంది ఒక్కొక్కరూ రూ.30నుంచి 40 లక్షల వరకూ నష్టపోవాల్సి వస్తుందంటున్నారు. నెలవారీ పింఛను కూడా కనీసం రూ.50-60 వేల వరకూ తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రిటైరైతే అధిక ప్రయోజనాలు అందుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు నుంచి ఐదేళ్ల వరకు సర్వీసు ఉన్నప్పటికీ.. కొత్త వేతన విధానం అమల్లోకి వచ్చేలోపే రాజీనామా చేయడం ఉత్తమమని అనుకుంటున్నారు.
పునఃసమీక్ష పేరిట...
విద్యుత్ రంగం జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌లుగా విభజన జరిగాక .. ఏ సంస్థకు ఆ సంస్థ ప్రత్యేక కంపెనీగా ఏర్పడ్డాయి. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో వేతన సవరణపై ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ నిర్వహించడం కంటే.. ఎమర్జెన్సీ విధానం వర్తించే ఇంధన సంస్థల ఉద్యోగులకు ప్రత్యేకంగా వేతన సవరణ ఉండాలన్న ప్రతిపాదనకు సర్కారు అంగీకరించింది. దీనిప్రకారం ఫిట్‌మెంట్‌లో 5శాతం తగ్గించి.. 15 ఏళ్ల సర్వీసు పూర్తయినవారికి అదనంగా ఒక ఇంక్రిమెంట్‌ను కలుపుతున్నారు. దీనివల్ల విద్యుత్ ఉద్యోగులకు అదనంగా 16 వెయిటేజీ ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వీటిని మాస్టర్ పేస్కేల్‌లో కలపకుండా వ్యక్తిగతంగా జీతాల్లో కలిపి ఇస్తున్నారు. ఉద్యోగ విరమణ సమయంలో వాటిని కూడా యాజమాన్యం పరిగణనలోకి తీసుకుంటోంది. దీనివల్ల.. రిటైర్మెంట్ ప్రయోజనాల్లో, పింఛనులో గౌరవప్రదమైన మొత్తం అందుతుంది. 1999 నుంచి ఇప్పటిదాకా.. అంటే 2దశాబ్దాలకు పైగా ఈ విధానం అమలవుతోంది. ఇప్పుడు దీన్ని సమీక్షించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అది తమ జీవితాలనూ.. జీతాలనూ చిదిమేసేదిగా ఉండకూడదని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.
వరాల జల్లులో తడిసి...
2019ఎన్నికలకు ముందు నాటి టీడీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు పలు డిమాండ్లు ప్రతిపాదించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసిన జగన్ కనిపించిన ప్రతి ఒక్కరికీ వరాలు ప్రకటించేశారు. ఈ వరాల జల్లులో విద్యుత్ సంస్థల ఉద్యోగులూ తడిసిముద్దయ్యారు. వైసీపీకి మద్దతుగా నిలిచారు. వేతన సవరణ వెంటనే జరుగుతుందని.. భారీగా జీతభత్యాలు పెరుగుతాయని ఆశపెట్టుకున్నారు. కానీ జగన్ సర్కారు ఝలక్ ఇచ్చింది. వ్యక్తిగత జీతాల్లో కలిపి ఇస్తున్న ఇంక్రిమెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా మాస్టర్ పే స్కేల్ మేరకే.. పదవీ విరమణ లబ్ధితో పాటు పింఛనూ ఉంటుందని చెబుతోంది. ఇదే జరిగితే.. ఉద్యోగి హోదాను బట్టి ఒక్కొక్కరూ రూ.30 నుంచి రూ.50 లక్షల దాకా నష్టపోవాల్సి వస్తుంది. దీనివల్ల పదవీ విరమణ తర్వాత 300 రోజుల లీవ్ ఎన్‌క్యా్‌షమెంట్.. కమ్యూటేషన్‌పై ప్రభావం పడుతుందని.. ఒక్కోఉద్యోగికి రూ.30-60 వేల దాకా పింఛను మొత్తం తగ్గిపోతుందన్న ఆందోళన నెలకొంది.
ఇప్పుడు ఉద్యోగుల స్థాయిని బట్టి లక్షన్నర నుంచి 2లక్షల దాకా పింఛను వస్తోంది. ఇంజనీరింగ్ ఉద్యోగుల మాస్టర్ పేస్కేల్.. ఇంక్రిమెంట్లను రూ.2,03,000కే పరిమితం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదే జరిగితే.. ప్రస్తుత జీతభత్యాల్లో 15% వరకూ తగ్గిపోతుందని చెబుతున్నారు. అందుకే స్వచ్ఛంద పదవీవిరమణకు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే వందలమంది దరఖాస్తు చేశారు. జనవరి, ఫిబ్రవరిల్లో ఇంకొందరు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే భవిష్యత్‌లో ఇంధన సంస్థలు అనుభవజ్ఞుల కొరత ఎదుర్కోవడం ఖాయమని ఇంధనశాఖ వర్గాలే అంటున్నాయి.
0 Comments