GET MORE DETAILS

సీపీఎస్‌ ఉద్యోగుల జీవితాలతో ఆటలు : ఏపీ సీపీఎస్‌ఈఏ విమర్శ

 సీపీఎస్‌ ఉద్యోగుల జీవితాలతో ఆటలు : ఏపీ సీపీఎస్‌ఈఏ విమర్శ



కంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) రద్దుకు అడ్డంకులు ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం.. ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవడమేనని ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (ఏపీ సీపీఎస్‌ఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి విమర్శించారు. ‘ఎన్నికల ముందు కడపలో జరిగిన సమావేశంలో అధికారంలోకి వచ్చిన నెలలో సీపీఎస్‌ రద్దు చేసి, పాత పింఛను అమలు చేస్తానని జగన్‌ ప్రకటించారు. సీపీఎస్‌పై పూర్తి అవగాహనతోనే హామీ ఇస్తున్నట్లు అప్పట్లో పేర్కొన్నారు. అప్పుడు ఈ సలహాదారులు ఏం చేస్తున్నారు? ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని చెప్పడం ఏంటి? సీఎం జగన్‌ మాటలు విని ఆయన వెనక నడిచాం. ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే సీపీఎస్‌ రద్దు చేయకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’ అని వెల్లడించారు.

సీపీఎస్‌ రద్దు సామాజిక న్యాయంగా చూడాలి: ఏపీటీఎఫ్‌

సీపీఎస్‌ రద్దును సామాజిక న్యాయంగా చూడాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్‌) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హృదయరాజు, కులశేఖరరెడ్డి కోరారు. ఈ అంశంపై సాంకేతిక అంశాలు, బడ్జెట్‌ అంచనా లేకుండా హామీ ఇచ్చామని ఇప్పుడు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సబబు కాదన్నారు. బడ్జెట్‌ భారం అనే సాకు కాకుండా సామాజిక న్యాయంగా పరిగణించాలని సూచించారు.

అసంబద్ధ నివేదికను అంగీకరించం: ఏపీయూఎస్‌

అసంబద్ధమైన పీఆర్సీ నివేదికను అంగీకరించబోమని ఏపీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రావణ్‌కుమార్‌, బాలాజీ వెల్లడించారు. అశుతోష్‌ మిశ్ర కమిషన్‌ నివేదికను విడుదల చేయాలని డిమాండు చేశారు. కమిషన్‌ ఇచ్చిన హెచ్‌ఆర్‌ఏను సైతం అధికారుల కమిటీ తగ్గించిందని, పింఛనుదారులకు అదనపు క్వాంటం ఇచ్చే వయస్సును పెంచారని పేర్కొన్నారు.

ఆ నివేదికతో ఉద్యోగులకు నష్టం: ఎమ్మెల్సీ కత్తి :

ఈనాడు, అమరావతి: కార్యదర్శుల కమిటీ సిఫార్సులతో ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. ‘గతంలో ఎప్పుడూ లేనివిధంగా నామమాత్రంగా ఫిట్‌మెంట్‌కు సిఫార్సు చేయడం, హెచ్‌ఆర్‌ఏలో కోత, 2022 అక్టోబరు నుంచి ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం, సీపీఎస్‌ రద్దు  సిఫార్సు లేకపోవడం నష్టం కలిగిస్తాయి. ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు రెగ్యులర్‌ స్కేల్‌ ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్న ప్రభుత్వ హామీ సిఫార్సుల్లో లేకపోవడం సరికాదు’ అని పేర్కొన్నారు

Post a Comment

0 Comments