GET MORE DETAILS

కృత్తివాసేశ్వరుడు - కాశీలోని మరో మహిమాన్విత మహాదేవుని ఆలయం

 కృత్తివాసేశ్వరుడు - కాశీలోని మరో మహిమాన్విత మహాదేవుని ఆలయం



కృత్తివాసేశ్వరమందిరం. కాలభైరవ ఆలయం అతిసమీపములో (ఎదురు సందులో) దివ్యాలంకారశోభితుడై విరాజిల్లుతున్నాడు.

మహిషాసురుని,కుమారుడైన గజాసురునికి, బ్రహ్మదేవుడిచ్చిన వరగర్వంతో, (స్త్రీ,పురుషుల చేతిలో అతనికి మరణం లేదు) సర్వ లోకాలను అతలాకుతలం చేస్తూ, అల్లకల్లోలం చేయసాగాడు. 

ఒకనొకసమయాన,పరమేశ్వరుని భక్తులను బాధిస్తూ తరుముకొస్తున్నాడు.అప్పుడు భక్తసులభుడైన  పరమేశ్వరుడు,తన భక్తులను కాపాడ, కోపోద్రిక్తుడై త్రిశూలంతో,వరగర్వుడైన గజాసురుని గ్రుచ్చి,పైకెత్తి త్రిశూలపై నిల్పిపట్టుకున్నాడు. 

అప్పుడు గజాసురుడు మహాదేవుని 108 దివ్యనామాలతో స్తుతించి స్వామితో, "నీ త్రిశూలాగ్రముపై ఉన్నందుకు ధన్యుడయ్యాను.పుట్టినవాడు గిట్టకమానడు. కానీ,ఇట్టి మృత్యువు మృత్యుంజయుడవైన నీచేతిలో నాకు కలగటం నాకు మోక్షాన్ని కలుగచేస్తుంది అన్నాడు.

అప్పుడు,స్వామి చిరుదరహాసంతో  నవ్వి, తనను స్తుతిస్తూ చేసిన అష్టోత్తర నామాలకు సంతృప్తి చెంది వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు,ఓ!పార్వతీవల్లభా!నేటినుండి "నా చర్మాన్ని ధరించి,కృత్తివాసేశ్వరుడిగా నాపేరుతో భక్తులకు దర్శనమిచ్చి ఇక్కడే వెలసివుండమని ప్రార్ధించాడు! ఈనాటి నుండి నీవు కృత్తివాసేశ్వరుడు అని పిలవబడాలి" అని కోరాడు.

అప్పుడు మహాదేవుడు,"అలాగే! ఈ కృత్తివాసేశ్వరలింగం మహాపాపాలను నశింప చేస్తుంది! కాశీలోని అన్ని లింగాల్లో ఉత్తమోత్తమం అవుతుంది. ముక్తి లభిస్తుంది. ఏడు కోట్ల మహారుద్రాలను జపిస్తే వచ్చే పుణ్యం, కాశీలోని కృత్తివాసేశ్వరుడిని పూజిస్తే లభిస్తుందని, మాఘకృష్ణచతుర్దశి (మహాశివరాత్రి) నాడు ఉపవాసం ఉండి, రాత్రి జాగరణ చేసి, కృత్తివాసేశ్వరుని పూజించిన పరాంగతిని పొందగలరని, చైత్రమాసంలోని పౌర్ణమినాడు మహాఉత్సవాన్ని కృత్తివాసేశ్వరునికి చేసినా మళ్ళీ పునర్జన్మ వుండదని"  చెప్పి, అంధకాసురుని చర్మాన్ని ధరించాడు. త్రిశూలన్ని నిలిపినచోట ఒక కుండం ఏర్పడింది. దానిని హంసతీర్ధము అంటారు. కృత్తివాసేశ్వరుని సమీపాన చేసిన జపము, దానము, హోమము అన్నీ అనంతమయిన ఫలితాన్ని ఇస్తాయి.

కాశీఖండంలో చెప్పబడిన ఈ దేవాలయ దర్శనం పునర్జన్మను లేకుండా చేస్తుంది. మృత్యుంజయకృత్తివాసేశ్వరరత్నేశ్వర మందిరాలు శ్రీకాలభైరవుని మందిరానికి అతిదగ్గరలోనే వున్నందున తప్పకదర్శించవలసినదే.

Post a Comment

0 Comments