GET MORE DETAILS

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు నేటికి 66 ఏళ్ళు.

 నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ : నేటికి 66 ఏళ్ళు. 




ఇక్కడ ఒక జలాశయము కట్టాలనే ఆలోచన బ్రిటిష్ పరిపాలకుల కాలంలోను అనగా నైజాము పరిపాలన కాలములోనే 1911 లోనే వచ్చింది. చివరికి భారత దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేతుల మీదుగా 1955 డిసెంబరు 10 నాడు పునాది రాయి పడింది. భారత దేశ రెండవ ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా 1967 లో కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది.

గతంలో ఈ ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, శాతవాహనులు పరిపాలించేవారు. ఆకాలంలో కట్టబడి అనేక బౌద్ధ స్థూపాలు ఇతర కట్టడాలు ఈ జలాశయములో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. వాటి పరిరక్షణకు వాటిలో చాల వాటిని యదాతదంగా పెకలించి జలాశయం మధ్యలో నెలకొని వున్న నాగార్జునకొండపైకి తరలించి అక్కడ వాటిని యదాతదంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఒక మ్యూజియం కూడా నిర్మించి అందులో ఆనాటి అనేక వస్తువులను ప్రదర్శన కొరకు పెట్టారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ముక్త్యాల రాజా కార్యదక్షతకు, దేశసేవాతత్పరతకు, నిస్వార్ధసేవానిరతికి గొప్ప ఉదాహరణ. ముఖ్యముగా సాగర్ ఆయకట్టు రైతులకు రాజాగారు బహుధా స్మరణీయులు. నార్ల వెంకటేశ్వర రావు మాటలలో "ఆయన అంతగా తపన చెందకపోతే నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ మనకు సిద్ధించేది కాదేమో". రాజా గారిని ప్రజలు "ప్రాజెక్టుల ప్రసాద్" అని పిలుచుకునేవారు.బౌద్ధ అవశేషాలతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన నందికొండ, ప్రాజెక్టు నిర్మాణం తరువాత నాగార్జునసాగర్ గా ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా మరింత స్థిరపడింది. 1954 లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరు 10న (మన్మధ నామ సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి నాడు) అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. అప్పటి హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, బూర్గుల రామకృష్ణారావు, ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ సి.ఎం.త్రివేది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నిర్మాణ సమయములో రాజా గారు యాభైరెండు లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారు. నిర్మాణం కొరకు శరవేగంతో మాచర్లలో వెలగపూడి రామకృష్ణ గారు కెసిపి సిమెంట్ ప్యాక్టరీ నిర్మించారు. మానవ శక్తితో డ్యాము నిర్మాణం 1969లో పూర్తయింది. క్రెస్టు గేట్లను అమర్చే పని 1974లో పూర్తయింది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు అతి పెద్దది. ఇది ఒక బహుళార్థసాధక ప్రాజెక్టు. అప్పటి ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ జిల్లా, గుంటూరు జిల్లా సరిహద్దుల పై నందికొండ వద్ద నిర్మించిన ఈ ఆనకట్టను మొదట్లో నందికొండ ప్రాజెక్టు అని పిలిచేవారు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు.

నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఉంది. ప్రాజెక్టు నిర్మాణానంతరం నాగార్జునసాగర్‌గా ప్రసిద్ధి చెందింది. ఆనకట్టకు ఇరువైపుల దక్షిణ విజయపురి (వి.పి.సౌత్) (గుంటూరు జిల్లా),ఉత్తరవిజయపురిలో భాగంగా పైలాన్ (నల్గొండ జిల్లా), హిల్ కాలనీ (నల్గొండ జిల్లా) ఉన్నాయి.

నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం కూడా. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రిక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో నాగార్జునకొండ అని ఇప్పుడు పిలువబడే ప్రదర్శనశాలలో భద్ర పరచారు.

విమాన శిక్షణ కోసం నాగార్జున సాగర్‌లో చిన్నపాటి విమానాశ్రయం ఉంది.

జాతీయ రహదారి 565 ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాదు నుండి 165 కి.మీ, విజయవాడ నుండి 190 కి.మీ దూరంలోవుంది. సమీప రైల్వే స్టేషన్ మాచర్లనుండి 24 కి.మీ దూరంలో ఉంది. సమీప విమానాశ్రయాలు హైదరాబాదు విమానాశ్రయం, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం.

Post a Comment

0 Comments