GET MORE DETAILS

కురు వంశము

 కురు వంశము



ఓం పూరుడు జనరంజకంగా రాజ్యపాలన చేసాడు. పూరుని కుమారుడు జనమేజయుడు,అతని కుమారుడు ప్రాచిన్వంతుడు,అతని కుమారుడు సంయాతి అతని కుమారుడు అహంయాతి అతని కుమారుడు సార్వభౌముడు ఆతని కుమారుడు జయత్సేనుడు అతని కుమారుడు అవాచీనుడు అతని కుమారుడు అరిహుడు అతని కుమారుడు మహాభౌముడు అతని కుమారుడు యుతానీకుడు అతని కుమారుడు అక్రోధనుడు అతని కుమారుడు దేవాతిధి అతని కుమారుడు రుచీకుడు అతని కుమారుడు రుక్షుడు అతని కుమారుడు మతినారుడు. మతినారుడు సరస్వతీ తీరాన పన్నెండు సంవత్సరములు సత్రయాగం చేసాడు. సరస్వతీ నది అతనిని భర్తగా చేసుకుంది. వారికి త్రసుడు అనేకుమారుడు కలిగాడు. అతని కుమారుడు ఇలీనుడు అతని కుమారుడు దుష్యంతుడు. 

శకుంతలా దుష్యంతుల పరిచయం :

 దుష్యంతుడు చిన్ననాటి నుండి అడవులలో తిరుగుతూ పులులను సింహాలనూ వేటాడి పట్టుకుంటూ ఆడుకొనేవాడు. దుష్యంతుని రాజ్యపాలనలో ప్రజలు ధర్మ మార్గం అవలంబిస్తూ ప్రశాంత జీవితం అవలంబిస్తూ జీవిస్తున్నారు. ఒక రోజు దుష్యంతుడు వేటకు వెళ్ళి వేటాడుతూ ఒక తపోవనానికి చేరుకున్నాడు. అది బద్ద శత్రువులైన సింహాలూ ఏనుగులూ లాంటి జంతువులనేకం కలసి సహజీవనం చేస్తున్న మహర్షి కణ్వాశ్రం. దుష్యంతుడు మిగిలిన వారిని వదిలి మహర్షి దర్శనార్ధం ఆశ్రమంలోకి ఒంటరిగా వెళ్ళాడు. అక్కడ అతడు సౌందర్యవతి అయిన కణ్వ మహర్షి పెంపుడు కూతురు శకుంతల ను చూసాడు. ఆమె అందానికి ముగ్ధుడైయ్యాడు. శకుంతలనూ దుష్యంతుని అందం ఆకర్షించింది. పరస్పర పరిచయా లయ్యాక ఆమె కణ్వమహర్షి కూతురని తెలుసుకున్నాడు. దుష్యంతుడు శకుంతలతో బ్రహ్మచారి అయిన కణ్వమహర్షికి కూతురెలా కలిగిందని సందేహం వెలిబుచ్చాడు.  మేనకా విశ్వామిత్రుల వృత్తాంతం-శకుంతల జననం : రాజర్షి విశ్వామిత్రుడు ఒకానొకసారి ఘోర తపమాచరిస్తున్నాడు. అది తెలిసిన ఇంద్రుడు అతని తపస్సును భగ్నం చేయటానికి మేనకను నియోగించాడు. దేవేంద్రుని ఆనతి మీరలేని మేనక భయపడుతూనే విశ్వామిత్రిని తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నం ఫలించి విశ్వామిత్రుడు ఆమె మీద మనసు పడ్డాడు. ఫలితంగా వారిరువురికి ఒక ఆడ శిశువు జనించగానే మేనక తన పని అయిందని భావించి ఇంద్రలోకానికి వెళ్ళింది. జరిగిన పొరబాటు గ్రహించిన విశ్వామిత్రుడు ఆ శిశువును వదలి తపోభూమికి వెళ్ళాడు. ఆ తరువాత శకుంత పక్షులచే రక్షింపబడుతున్న ఆడ శిశువును చూసిన కణ్వుడు ఆమెకు శకుంతల అను నామకరణం చేసి తన కన్నబిడ్డవలె చూసుకున్నాడు.  శకుంతలా దుష్యంతుల వివాహం : శకుంతల క్షత్రియ కన్య అని తెలుసుకుని దుష్యంతుడు ఆమె మీద మనసుపడి గంధర్వ రీతిన వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో శకుంతలకు పుట్టిన బిడ్డను చక్రవర్తిని చేస్తానని వాగ్ధానం చేసాడు. రాజలాంఛనాలతో ఆమెను రాజధానికి తీసుకు వెళతానని మాటిచ్చి రాజధానికి వెళ్ళాడు. కణ్వమహర్షి ఆ విషయం దివ్యదృష్టి ద్వారా గ్రహించి వారి వివాహానికి అనుమతించి శకుంతల పుత్రుడు చక్రవర్తి కాగలడని దీవించాడు. ఆపై శకుంతలకు ఆమె పుత్రుడు మహా బలవంతుడై ఆయురారోగ్య ఐశ్వర్యవంతుడు కాగలడని వరం ప్రసాదించాడు. మహర్షి మాటలను నిజంచేస్తూ శకుంతలకు మహాబలవంతుడైన భరతుడు చక్రవర్తి లక్షణాలతో జన్మించాడు. కణ్వమహర్షి శకుంతలను అత్తవారింటికి పంపడం ఉచితమని భావించి శిష్యులను తోడిచ్చి ఆమెను కుమారునితో సహా దుష్యంతుని వద్దకు పంపాడు. దుష్యంతుడు శకుంతలను తెలియనట్లు నటిస్తూ ఆమెను నిరాకరించాడు. శకుంతల దు॰ఖిస్తూ పలువిధాల ప్రార్ధించినా దుష్యంతుడు ఆమెను స్వీకరించడానికి అంగీకరించలేదు. చివరిగా ఆకాశవాణి శకుంతల మాటలు సత్యమని చెప్పడంతో దుష్యంతుడు లోకనిందకు వెరచి భార్యా బిడ్డలను నిరాకరించానని ఒప్పుకుని వారిరువురిని స్వీకరించి భరతునికి యువరాజ్య పట్టాభిషేకం చేసాడు.  

భరతవంశం :

అడవిలో సింహములతో ఆడుకొనుచున్న భరతుడు భరతునికి పట్టాభిషేకం చేసి దుష్యంతుడు భార్యతో వానప్రస్థానికి వెళ్ళాడు. రాజ్యాన్ని జనరంజకంగా పాలించిన భరతుడు వంశకర్త అయ్యాడు. భరతునకు భుమన్యుడు జన్మించాడు. భుమన్యుని కుమారుడు సహోత్రుడు అతని కుమారుడు హస్థి. అతని పేరు మీద హస్థినాపురం వెలసింది. హస్తి కుమారుడు వికుంఠనుడు. అతని కుమారుడు అజఘీడుడు. అజఘీడునకు నూట ఇరవై నాలుగు మంది కుమారులు. వారిలో సంవరణుడు అనే వాడు సూర్యుని కుమార్తె తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి కురు జన్మించాడు. కురు మరొక వంశకర్త అయ్యాడు. అతని పేరు మీద కురువంశం ఆరంభం అయింది. కురువంశస్థులు యుద్ధం చేసిన భూమి కురుక్షేత్రం అయింది. కురు కుమారుడు విధూరుడు. అతని కుమారుడు అనశ్వుడు. అతని కుమారుడు పరీక్షిత్తు . అతని కుమారుడు భీమశేనుడు. అతని కుమారుడు ప్రదీపుడు. అతని కుమారుడు ప్రతీపుడు. అతని కుమారుడు శంతనుడు. శంతనునికి గంగాదేవికి దేవవ్రతుడు పుట్టాడు. అతడు తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడుగా పిలువబడ్డాడు. శంతనుడు తనను గంగాదేవి విడిచివెళ్ళిన చాలా కాలంతరువాత మత్స్యగంధి అనే కారణ నామధేయం ఉండి యోజన గంధిగా మారిన దాశరాజు పెంపుడు కూతురైన సత్యవతిని వివాహం చేసుకున్నాడు. వారికి చిత్రాంగధుడు విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. జనమేయజయుడు శంతన మహారాజు గంగాదేవి వారి కుమారుడైన భీష్ముల గురించి వివరంగా చెప్పమని వైశంపాయుని అడిగాడు.  

భీష్ముని జన్మవృత్తాంతం :

 గంగా నది ఒడ్డున ఒక అందమైన స్త్రీని చూచిన హస్తినాపుర మహారాజు శంతనుడు పూర్వం ఇక్ష్వాకు వంశస్థుడైన మహాభీషుడు వెయ్యి ఆశ్వమేధ యాగాలూ నూరు రాజసూయ యాగాలూ చేసి బ్రహ్మలోక ప్రాప్తి పొందాడు. ఒక రోజు గంగాదేవి బ్రహ్మ సభకు వచ్చినప్పుడు గాలి బలంగా వీచడంతో ఆమెచీర తొలగింది. దేవతలంతా అది చూడకుండా తలలు పక్కకు తిప్పగా మహాభీషుడు ఆమెవంక ఆసక్తిగా చూసాడు. అది చూసిన బ్రహ్మదేవుడు మహాభీషుని మానవలోకంలో జన్మించమని శపించాడు. మహాభీషుడు తన తప్పు గ్రహించి పుణ్యాత్ముడైన ప్రతీపునకు కుమారునిగా జన్మించేలా చేయమని బ్రహ్మదేవిని ప్రార్ధించాడు. బ్రహ్మ దేవుడు అందుకు అంగీకరించాడు. తనవంక ఆసక్తిగా చూసిన మహాభీషునిపై మనసుపడిన గంగాదేవి అతనిని తలచుకుంటూ భూలోకానికి వస్తూ విచార వదనంతో ఉన్న ఆష్ట వశువులను చూసింది. వారి విచారానికి కారణం ఏమిటని గంగాదేవి వారిని అడిగింది. దానికి సమాధానంగా వారు వశిష్ట మహర్షి శాపవశాన తాము భూలోకంలో జన్మించడానికి వెళుతున్నామని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించడానికి వెతుకుతున్నాము. ప్రతీపునకు కుమారుడుగా జన్మించిన శంతనుని వివాహమాడి నువ్వు మాకు జన్మను ప్రసాదించు అని వేడుకున్నారు.

Post a Comment

0 Comments