GET MORE DETAILS

స్కూలే లేదు.. అయినా టీసీలు, వాటితో చాలామందికి ఉద్యోగాలు - రాయలసీమ వర్సిటీలో నియామకాల తీరిదీ

 స్కూలే లేదు.. అయినా టీసీలు, వాటితో చాలామందికి ఉద్యోగాలు - రాయలసీమ వర్సిటీలో నియామకాల తీరిదీ



10 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కారు ఆదేశం

కర్నూలు జిల్లాలోని ఓ ఉన్నత పాఠశాల చాలాకాలం క్రితం మూతపడింది. అందులో చదివామంటూ టీసీలు తెచ్చిన 40 మందికి రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలిచ్చారు. కాంట్రాక్టు పద్ధతిలో అటెండర్‌, ఫ్యూన్‌, క్లర్క్‌ తదితర ఉద్యోగాల్లో వారంతా కుదురుకున్నారు. ఇలాంటి ఇంకా ఎన్నో అక్రమాలు ఆ వర్సిటీలో  జరిగాయి. ఆ అక్రమాల పుట్ట ఇప్పుడు కదులుతోంది. రాయలసీమ విశ్వవిద్యాలయాన్ని 2008 సంవత్సరం కర్నూలులో ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ వర్సిటీలో చేపట్టిన నియామకాల విషయంలో పలు అక్రమాలు జరిగాయి. వర్సిటీలో పోస్టుల భర్తీకి గతంలోనే జీవో నంబరు 50ని జారీ చేశారు. దాని ప్రకారం నాలుగు రెగ్యులర్‌ ఉద్యోగాలు, 23 ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలి. కానీ, ఏకంగా 200 మందిని నియమించేశారు. ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి నుంచి ఎలాంటి అనుమతీ లేకుండానే కాంట్రాక్టు పద్ధతిలో ఇష్టానుసారం నియామకాలు చేసేశారు. కనీస అర్హతలు కూడా లేనివారిని నియమించేశారు. 1992 యాక్ట్‌ 2 ప్రకారం విశ్వవిద్యాలయాలు తమంతతాముగా ఇలా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలను నియమించుకోవడం అక్రమం. అర్హతలు లేకున్నా ఒక్కో కుటుంబం నుంచి నలుగురైదుగురికి బోధనేతర ఉద్యోగాలు ఇచ్చేశారు. వీరిలో కొందరికి ఉద్యోగ విరమణ వయసు దాటేసినా, ఆధార్‌లో వయసు మార్చేసి ఇంకా కొనసాగేలా కూడా చేశారనే ఆరోపణలున్నాయి. ఇలా నియమితులైనవారిలో 30 మంది ఉద్యోగులు కేవలం 10 కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. దీంతో కచ్చితంగా డబ్బులు చేతులు మారినట్లేనని అంటున్నారు.  

ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీ :

ఈ అక్రమాలపై ఫిర్యాదులు అందడంతో ఉన్నత విద్యాశాఖ ఇద్దరు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. ఆ శాఖ సంయుక్త కార్యదర్శి బిశ్వాస్‌, ఉన్నత విద్యామండలి జాయింట్‌ డైరెక్టర్‌ కృష్ణమూర్తిలతో ఈ కమిటీని వేశారు. వర్సిటీలో అక్రమాలపై విచారించి 10రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. వర్సిటీ అధికారులను, బాధ్యులను కమిటీ ఈ నెల 23న విచారించనుంది. ఆ తేదీన అన్ని ఫైళ్లతో విచారణకు రావాలని కమిటీ ఆదేశించినట్లు సమాచారం. దీంతో అక్రమాలకు పాల్పడిననారిలో ఆందోళన మొదలైంది. విచారణే లేకుండా చేసేందుకు ప్రయత్నాలు కూడా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Post a Comment

0 Comments