GET MORE DETAILS

Omicron: పిల్లలను స్కూళ్లకు పంపాలా...? వద్దా...? తల్లిదండ్రుల్లో కొత్త దిగులు.

 Omicron: పిల్లలను స్కూళ్లకు పంపాలా...? వద్దా...? తల్లిదండ్రుల్లో కొత్త దిగులు.




దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతాకాదు. ముఖ్యంగా రెండో వేరియంట్‌ ప్రమాదకర స్థాయిలో దేశాన్ని కమ్మేసింది. ఆ పరిస్థితుల నుంచి ప్రజా జీవనం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. మరికొందరు మాత్రం వెనకడుగు వేస్తున్నారు. కొత్తగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ దేశంలోకి ప్రవేశించిన వేళ ఈ భయాలు ఎక్కువయ్యాయి. అయితే, స్కూళ్లకు పంపే విషయంలో ఇప్పటి వరకైతే తల్లిదండ్రులు పెద్దగా సంశయించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు వైద్య నిపుణులు. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

కొవిడ్‌ మొదటి, రెండో ఉద్ధృతి సమయంలో పెద్ద వయసు వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువ సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. పిల్లల్లో మాత్రం పరిమిత స్థాయిలోనే ఈ లక్షణాలు బయటపడ్డాయి. దగ్గు, జలుబు వంటి స్వల్ప లక్షణాలు మాత్రమే వారిలో కనిపించాయి. పిల్లల్లో పెద్దగా ఆస్పత్రి పాలైన దాఖలాలు లేకపోవడం ఊరట కలిగించే అంశం.

దేశంలో ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. చిన్నారులకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కానీ, వివిధ సీరోలాజికల్‌ సర్వేల్లో మాత్రం చిన్నారుల్లో కూడా కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నాయని తేలింది. కొందరు చిన్నారులు ఇదివరకే ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన వారే కాబట్టి.. కొత్తగా వైరస్‌ సోకే అవకాశాలు తక్కువేనని ఎపిడమాలజిస్టులు అంటున్నారు.

మరోవైపు దేశాన్ని ఒమిక్రాన్‌ భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో స్కూళ్లు మళ్లీ మూత పడతాయా? అనే అనుమానాలు చాలా మంది తల్లిదండ్రుల్లో నెలకొన్నాయి. ప్రస్తుతానికి ఈ వేరియంట్‌ వల్ల తీవ్రస్థాయి వ్యాధి లక్షణాల బారిన పడిన ఉదంతాలు ఇంకా బయటపడని నేపథ్యంలో అలాంటి భయాలు పెద్దగా అక్కర్లేదని చెబుతున్నారు వైద్యులు. ఒకవేళ వ్యాక్సిన్‌ వేసుకున్న వారికీ మళ్లీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకుతున్నట్లు తేలినా, పాజిటివిటీ రేటు పెరిగిన సందర్భంలో స్కూళ్లు మూసివేయాలని మాత్రం సూచిస్తున్నారు. కరోనాకు ముందు కూడా వాతావరణంలోని వివిధ వైరస్‌ల వల్ల పిల్లలు ఏడాదిలో రెండు మూడుసార్లు అనారోగ్యం బారిన పడిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలని ముంబయికి చెందిన ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ లాన్స్లెట్‌ పింటో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

పిల్లల్లో కొవిడ్‌ అంత ప్రమాదకరం కానప్పటికీ వారి విషయంలో తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం డాక్టర్‌ పింటో సూచించారు. మాస్కు తప్పనిసరిగా పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ వాడకం విషయంలో వారికి అవగాహన కల్పించాలన్నారు. పాఠశాల యాజమాన్యాలు సైతం తగిన గాలి, వెలుతురు ప్రసరించేలా చూసుకోవాలని సూచించారు. విద్యార్థికి, విద్యార్థికి మధ్య దూరం ఉండేలా చూసుకుంటే కొవిడ్‌ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Post a Comment

0 Comments