GET MORE DETAILS

ప్రాణహిత పుస్కరాలు _ 2022 ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 24 వరకు

 ప్రాణహిత పుస్కరాలు _ 2022 ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 24 వరకు



ప్రాణహిత నది పుష్కరాలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే పుష్కరాల ఏర్పాట్లపై అధికారులను అప్రమత్తం చేస్తోంది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రాణహిత నదికి ఇవే తొలి పుష్కరాలు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సుమన్ తో కలిసి ఇటీవల అధికారులతో సమీక్షించారు. పుష్కర స్నానాల నిమిత్తం లక్షల్లో వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏట ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 24 వరకు ప్రాణహిత పుష్కరాలు జరుపుకోనుండగా రాష్ట్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ , మహారాష్ట్ర , చత్తీస్ ఘడ్ ల నుంచి ప్రజలు భారీగా తరలివస్తారని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2010 డిసెంబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాణహిత నది పుష్కరాలు జరుపుకున్నారు. తెలంగాణ ఉద్యమ నాయకునిగా ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రాణహిత నది అర్జున్ గుట్ట పుష్కరఘాట్లో పుష్కర స్నానం చేశారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రాణహిత నది పుష్కరాలకు హాజరయ్యారు. సినీ నటుడు , ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కూడా అర్జున్ గుట్ట పుష్కరఘాట్లో స్నానం చేశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు , ఎమ్మెల్యేలు , సినీ నటులు , ప్రభుత్వ అధికారులు అర్జునగుట్ట పుష్కరఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించారు. రాకపోకలకు అనుగుణంగా రోడ్లు నిర్మించినందున కోటపల్లి మండలం అర్జునగుట్ట పుష్కరఘాటు లక్షల్లో భక్తులు తరలొచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. పుష్కర స్నానాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఇప్పటి నుంచే స్థానిక స్థితిగతులపై దృష్టి సారించాలని , భక్తుల తాకిడికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంబంధిత ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని , ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశారు. 

ప్రాణహిత నది పుష్కరం :

మీనరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి పుష్కరం వస్తుంది. ఈ ఏట ఏప్రిల్ 12న రాత్రి మీనంలో బృహస్పతి ప్రవేశిస్తోంది. బుధవారం చైత్ర శుద్ధ ద్వాదశి ఏప్రిల్ 13 ఉదయం నుంచి పుష్కరం ప్రారంభమై చైత్ర బహుళ అష్టమి ఆదివారం 24 ఏప్రిల్ 2022 వరకు (పుష్పరం) 12 రోజులు పుష్కరాలు నిర్వహిస్తారు.

ఎక్కడి నుంచి ఎలా...

గోదావరి నదికి అతి పెద్ద ఉపనది ప్రాణహిత. ఈ నది మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం , అదేవిధంగా సత్పురాశ్రేణుల దక్షణ వాలుల్లో ప్రవహిస్తోంది. వైన్ గంగ , పైన్ గంగా , వర్ణానది మూడు నదులు మహారాష్ట్రలోని ఆస్తి అనే గ్రామం గుండా ప్రవహించి తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామంలో ప్రాణహిత జన్మించింది. బెజ్జూర్ మండలం గూడెం , సోమిని , తలాయి , వేమనపల్లి మండలం రావులపల్లి , వేమనపల్లి , కలలపేట , ముల్కల్లపేట , రాచర్ల , వెంచపల్లి , కోటపల్లి మండలం జనగామ , నందరాంపల్లి , పుల్లగామ , సిర్సా , అన్నారం , అర్జునగుట్ట గ్రామాల మీదుగా ప్రవహిస్తోంది. మహారాష్ట్ర వైపు గడ్చిరోలి జిల్లాలోని చప్రాల నుంచి ప్రారంభమై అయిరి , ఇందారం , దేవలమర్రి చెట్టులో వెలిసిన వేంకటేశ్వరస్వామి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తోగుల వెంకటాపూర్ మీదుగా ప్రవహిస్తూ రేగుంట , కొత్తూర్ , తేకడా , గిలాస్పేట , రాయిపేట , రంగాయపల్లి , హమురాజీ , సిరోంచ మీదుగా భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తేశ్వర్లుగా వెలిసిన పరమేశ్వరుని పుణ్య క్షేత్రమైన కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తోంది. గోదావరి , ప్రాణహిత , అంతర్వాహిని సరస్వతి నదులతో త్రివేణి సంఘమంగా విరాజిల్లుతోంది.

ప్రాణహిత నది గోదావరిలో కలిసే వరకు...

ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి గ్రామం నుంచి ప్రాణహిత నదిగా బెజ్జూర్ , వేమనపల్లి , కోటపల్లి మండలాల మీదుగా 113 కిలో మీటర్లు ప్రవహించి కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో కలుస్తోంది. తుమ్మిడిహెట్టి , అర్జునగుట్ట , వేమనపల్లిలో ప్రాణహిత నదికి పుష్కరాలు జరుపుకుంటారు. ప్రాణహిత నదికి మంచిర్యాల వరకు రైలుమార్గంలో వచ్చినా లేదా బస్సులో వచ్చినా అక్కడి నుంచి 37 కిలో మీటర్ల దూరంలో ఉన్న చెన్నూర్ చేరుకోవాలి. చెన్నూర్ నుంచి మరో 19 కిలో మీటర్లు మహారాష్ట్ర సరిహద్దు వరకు ప్రయాణిస్తుండగా మధ్యలో ఉన్న అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కరం జరుగుతోంది. చెన్నూర్ నుంచి నేరుగా వేమనపల్లి వరకు 36కిలో మీటర్లు ప్రయాణిస్తే అక్కడ కూడా ప్రాణహిత నది పుష్కరం నిర్వహిస్తారు.

Post a Comment

0 Comments