GET MORE DETAILS

అనితర సాధ్యం - దాన వీర శూర కర్ణ నేటికి 45ఏళ్ళు

అనితర సాధ్యం - దాన వీర శూర కర్ణ నేటికి 45ఏళ్ళు



నవతరం వేగానికి తాము తట్టుకోలేమని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. నిజమే! ప్రస్తుతం అన్నిటా వేగం పెరిగిపోతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘ప్రియదర్శని’ని చేతిలో పట్టుకు తిరుగుతున్న రోజులివి.

సాంకేతికత పేరుతో ఏళ్ళ తరబడి చలనచిత్రాలను రూపొందిస్తున్న రోజులు కూడా ఇవే! ఓ భారీ జానపదం తెరకెక్కించడానికే రెండు, మూడేళ్ళు తీసుకుంటున్నారు దర్శకులు, నిర్మాతలు. నవీన సాంకేతికతతో వేగం పెరిగిన రోజుల్లోనే ఇన్ని రోజులు అయితే, నలభై ఐదేళ్ళ క్రితం ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని రూపొందించడానికి ఎన్ని పనిదినాలు వెచ్చించవలసి ఉంటుంది? ఈ లెక్కను ప్రతిభావంతులైన ఈ తరం పిల్లలకు వేస్తే ఎలాంటి సమాధానం వస్తుంది? అది తెలియదు కానీ, మహాభారతగాథలో దాదాపు కురుక్షేత్ర యుద్ధం ముగిసే దాకా పలు పార్శ్వాలు స్పృశిస్తూ భారతంలోని సారాంశాన్నంతా ఒక చోట రంగరించే ప్రయత్నం అంటే ఖచ్చితంగా ఏళ్ళ తరబడి చిత్రీకరణ జరపవలసి వస్తుంది. అలాంటిది 45 సంవత్సరాల క్రితం కేవలం 43 పనిదినాలలో నాలుగుగంటల పైచిలుకు ప్రదర్శనాసమయం ఉన్న ఓ చిత్రాన్ని రూపొందించడాన్ని ఏమనాలి? అందులోనూ సదరు చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కథానాయకులయిన త్రిపాత్రలు పోషించడం అన్నది సాధ్యమా? మానవమాత్రులకయితే ఇది నిస్సందేహంగా అసాధ్యమే! కానీ, ఆయన నందమూరి తారక రామారావు జనం కోసమే మనం అంటూ సాగిన జగదేక కథానాయకుడు. కేవలం 43 పనిదినాలలో 25 రీళ్ళ నిడివిగల చిత్రాన్ని తెరకెక్కించారు రామారావు. ప్రదర్శనా సమయం నాలుగు గంటల ఏడు నిమిషాలు. నభూతో నభవిష్యతి అన్న చందాన నిలచిన ‘దానవీరశూర కర్ణ’ చిత్రం 1977 జనవరి 14న జనం ముందు నిలచి, వారి మనసులను సునాయాసంగా గెలుచుకుంది.

నిజంగా ‘నటరత్నమే’...!

'దానవీరశూర కర్ణ’ అనగానే ఈ నాటికీ ఆ చిత్రాన్ని తిలకించినవారి మది పులకించి పోతూనే ఉంటుంది. నవతరం ప్రేక్షకులు సైతం ఈ చిత్రరాజాన్ని చూడగానే ఏదో ఒక కోణంలో దానికి బందీ అయిపోతున్నారు. మరి ఇందులో వారిని కూడా ఆకట్టుకొనే అంతటి ఘనమైన అంశాలు ఏమున్నాయి? నిస్సందేహంగా ఓ నటుడు కథలో కీలకమైన శ్రీకృష్ణ, సుయోధన, కర్ణ పాత్రలను అవలీలగా పోషిస్తూ, తనదైన అభినయంతో సాగిన వైనమే అన్నిటినీ మించి ఆకట్టుకున్న అంశమని అంగీకరించక తప్పదు. అసలే రామారావు ‘నటరత్న’. ఆయనకు తక్క వేరెవ్వరికి ఇటువంటి సాహసం చేసే తలంపు కలుగుతుంది? కేవలం ‘నటరత్న’ అని జేజేలు అందుకోవడం కాదు, అందుకు తగ్గ అభినయంతో ఆకట్టుకున్న నాడే ఆ బిరుదుకు సార్థకత! దానిని సాధించిన ధీశాలి తారక రామారావు. అందుకు వేదికగా నిలచిన చిత్రం ‘దానవీరశూర కర్ణ’!

ఎలా సాగుతుందంటే...

‘దానవీరశూర కర్ణ’ చిత్రం – ఓ పెట్టె నీటిలో కొట్టుకుంటూ రావడంతో మొదలవుతుంది. అది సూత పరివారానికి లభిస్తుంది. అందులో సహజకవచ కుండలాలతో ఉన్న బాలుడు దర్శనమిస్తాడు. అతనికి కర్ణ అని పేరు పెట్టుకొని రాధ పెంచడంతో కథ మొదలవుతుంది. రాధేయుడు దానవీరశూర కర్ణగా వెలుగొందుతాడు. పరశురాముడు, విప్రుడు, భూమాత ఒసగిన శాపంతో హస్తినకు చేరుకుంటాడు కర్ణుడు. అక్కడ కురుపాండవ కుమారుల నడుమ సాగుతున్న యుద్ధ విద్యాప్రదర్శనలో అర్జునునికి సరిజోదు ప్రపంచలోనే లేడని ద్రోణాచార్యుడు ప్రకటించడాన్ని విని, తానున్నానని చెబుతాడు కర్ణుడు. అక్కడ సూత కుమారుడు అన్న మాటతో అతనికి అవమానం జరుగుతుంది. అప్పుడే రారాజు అతణ్ణి అంగరాజ్యానికి పట్టాభిషిక్తుని చేస్తాడు. తనకు తగిన గౌరవం కల్పించిన సుయోధన సార్వభౌముని కోసం తుది రక్తపు బిందువు వరకు పోరాడుతానని ప్రకటిస్తాడు కర్ణుడు. మయసభలో సుయోధనుని తడబాటు, పాంచాలి నవ్వడం, తరువాత జూదంలో పాండవులు ఓడిపోవడం, పాంచాలి పరాభవం, పాండవుల దాస్యవిముక్తి, మళ్ళీ పాచికలాటలో పాండవులు ఓడిపోయి వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకోవడం తరువాతి అంశాలు. ఆపై కృష్ణుని కడకు సుయోధన, అర్జునులు వెళ్ళి సాయం కోరడం, కురుపాండవుల మధ్య సంధి కోసం శ్రీకృష్ణరాయబారం, పిమ్మల కురుక్షేత్రం సాగడం. కర్ణుని భీష్ముడు అర్థరథుడని ప్రకటించడం, గాంగేయుడు ఉన్నంత వరకు తాను యుద్ధభూమికి రానని కర్ణుడు వెళ్ళడం జరుగుతాయి. వీరాభిమన్యుని మరణం సంభవిస్తుంది.

మాయోపాయాలతో భీష్మ, ద్రోణులను పాండవులు వధించడం, తదుపరి కర్ణుడు కుంతికి ఇచ్చిన మాటకై అర్జునుని తక్క మిగిలిన పాండవులను యుద్ధంలో అవకాశం లభించినా, చంపకుండా వదలివేయడం జరుగుతాయి. అప్పటికే ఇంద్రుడు బ్రాహ్మణవేషంలో వచ్చి కర్ణుని సహజకవచకుండలాలను దానంగా గ్రహించి ఉంటాడు. ప్రతిగా ఇచ్చిన శక్తిని ఘటోత్కచ వధకు వినియోగిస్తాడు కర్ణుడు. చివరకు కర్ణుడు యుద్ధభూమిలో పార్థుని శరపరంపరకు బలిఅవుతాడు. తన హితుడు కన్నుమూయగానే వైరాగ్యంతో సుయోధనుడు వాయుబంధంతో ఓ మడుగులో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతనిని యుద్ధానికి పిలుస్తారు పాండవులు. తన సైజోదు భీముడేనని అతనితో తలపడతాడు సుయోధనుడు. అతని ఊరువులపై గదతో మోదగానే దుర్యోధనుడు నేల కూలుతాడు. స్వర్గంలో ఉన్న తన మిత్రుడు కర్ణుని కడకు సుయోధనుడు పోవడంతో కథ ముగుస్తుంది.

పైన పేర్కొన్న ప్రధానాంశాలే కాదు, ఉపాంశాలను సైతం ఉటంకిస్తూ చిత్రాన్ని జనరంజకంగా తెరకెక్కించారు తారక రామారావు. ఇందులో ద్రౌపదిగా శారద, కుంతిగా యస్.వరలక్ష్మి, భానుమతిగా ప్రభ, సుభద్రగా కాంచన, సత్యభామగా రాజశ్రీ, ఉత్తరగా దీప, అభిమన్యునిగా బాలకృష్ణ, అర్జునునిగా హరికృష్ణ, భీమునిగా సత్యనారాయణ, ధర్మరాజుగా ప్రభాకర్ రెడ్డి, దుశ్శాసనునిగా జగ్గారావు, భీష్మునిగా మిక్కిలినేని, శకునిగా ధూళిపాల, శల్యునిగా ముక్కామల, ద్రోణునిగా రాజనాల, విదురునిగా పి.జె.శర్మ అభినయించారు. కాగా, సూతుడు, ఇంద్రుడు, బ్రాహ్మణుడు, జరాసంధుడు, ద్రుష్టద్యుమ్నుడు పాత్రల్లో చలపతిరావు కనిపించారు. సూర్యునిగా, ఏకలవ్యునిగా జయభాస్కర్ నటించారు. హలం, జయమాలిని నృత్యతారలుగా తళుక్కుమన్నారు.

మరపురాని సంభాషణలు – పాటలు :

కొండవీటి వేంకటకవి రాసిన సంభాషణలు విశేషాదరణ చూరగొన్నాయి. ఈ నాటికీ ఇందులోని దుర్యోధనుని సంభాషణలు జనాన్ని మురిపిస్తూనే ఉండడం విశేషం! నవతరం కథానాయకులు సైతం “ఏమంటివి.ఏమంటివి.” అంటూ సుయోధనుని పలుకులను అభ్యాసం చేస్తూ ఉండడం గమనార్హం! ఇక ఈ చిత్రానికి నారాయణ రెడ్డి, దాశరథి పాటలు రాశారు. “ఏ తల్లి నిను కన్నదో.” పాటకు సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పన చేశారు. అనివార్య కారణాల వల్ల సాలూరువారు ఈ చిత్రం నుండి తప్పుకోగా, పెండ్యాల నాగేశ్వరరావు తరువాతి ఎనిమిది పాటలకు బాణీలు కట్టారు. “జయీభవా.విజయీభవా.” అంటూ సుయోధనుడు సభలోకి ప్రవేశించే సమయంలో వచ్చే గీతంలో అన్నీ సంస్కృతసమాసాలే కావడం విశేషం! ఇప్పటికీ ఈ పాటను విజయోత్సవాలలో వినియోగించుకుంటూనే ఉన్నారు. “తెలిసెనులే ప్రియరసికా.”, “చిత్రం భళారే విచిత్రం.”, “ఓ కురుసార్వభౌమా.”, “అన్నా దేవుడు లేడన్నా.” పాటలు నారాయణ రెడ్డి కలం నుండి జాలువారాయి. ఇక కురుక్షేత్ర రణభూమిలో పార్థునికి శ్రీకృష్ణుడు బోధించే గీతను సైతం గేయంగా మలిచారు నారాయణ రెడ్డి. “ఏల సంతాపమ్ము. మరి నీకేల సందేహమ్ము.” అంటూ ఆ గేయం సాగుతుంది. అభిమన్యు, ఉత్తరపై చిత్రీకరించిన “కలగంటినో స్వామి.” పాటను దాశరథి రాశారు.

ఈ చిత్రంలో అనువైన చోట మహాభారతంలోని పద్యాలను పొందు పరిచారు. రాయబారంలోని పద్యాలు తిరుపతి వేంకటకవులు రాసిన ‘పాండవోద్యోగ విజయము’లోనివి. అంతకు ముందు ఇవే పద్యాలకు రామారావు “శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణ సత్య” చిత్రాలలో అభినయించారు. ‘దానవీరశూర కర్ణ’లో మూడోమారు అవే తిరుపతి వేంకట కవుల పద్యాలకు నందమూరి కనబరచిన నటన అనితరసాధ్యమనిపించక మానదు. ఈ రాయబార సన్నివేశంలోనే శ్రీకృష్ణ, కర్ణ, సుయోధన పాత్రల్లో ఏకకాలంలో రామారావు కనిపించడం విశేషం! రామారావు తరువాత ఈ చిత్రంలో చప్పున గుర్తుకు వచ్చేది అభిమన్యునిగా నటించిన బాలకృష్ణనే. ఇందులో బాలయ్య తెరపై కనిపించేది కేవలం పది నిమిషాల సేపే అయినా, ఇట్టే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అప్పట్లోనే రామారావు నటవారసుడు ఇతడే అని జనం సైతం జేజేలు పలికారు.

అతి నిడివిలో ఇదే...!

1977 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘దానవీరశూర కర్ణ’ పోటీ చిత్రాలను పక్కకు నెట్టి విజేతగా నిలచింది. తొమ్మిది కేంద్రాలలో నేరుగా శతదినోత్సవం చూసిన ఈ చిత్రరాజం, హైదరాబాద్ లో దాదాపు 40 వారాలు ప్రదర్శితమయింది. నాలుగు గంటల పైచిలుకు ప్రదర్శనా సమయం ఉన్న ఓ చిత్రం ఇన్ని రోజులు ఓ కేంద్రంలో ప్రదర్శితం కావడం అన్నది ఓ చెరిగిపోని చరిత్ర! అంతకు ముందు హిందీలో రాజ్ కపూర్ నటించి, దర్శకత్వం వహించిన ‘మేరా నామ్ జోకర్’ చిత్రం నాలుగు గంటలపై చిలుకు సమయం ఉండేది. కానీ, తరువాత వెంటనే ఆ నిడివిని ప్రేక్షకుల కోసం కుదించాల్సి వచ్చింది. దాని బాటలోనే మరికొన్ని అతి నిడివిగల చిత్రాలు రూపొందినా, వెంటనే జనం కోసం కత్తెర వేయాల్సి వచ్చింది. అందువల్ల ప్రస్తుతం భారతదేశంలో థియేటర్లలో ప్రదర్శితమైన అతి నిడివి గల చిత్రంగా ‘దానవీరశూర కర్ణ’ నిలచింది.

రెండు సార్లు కోటి రూపాయలు...!

1977లో ‘దానవీరశూర కర్ణ’ చిత్రం కోటి రూపాయలు వసూలు చేసింది. 45 సంవత్సరాలలో ఈ మొత్తాన్ని సవరించినట్లయితే, ఇప్పటి లెక్కలకు దాదాపు రూ. 500 కోట్లకు పైగా వసూలు చేస్తుందని పరిశీలకుల అంచనా! ఇక ఇప్పటిలా భారతదేశమంతటా విడుదల చేసే అవకాశం ఉండి ఉంటే, ఈ చిత్రం మరెంత పోగేసేదో కదా! 1963 ‘లవకుశ’ తరువాత తెలుగునాట కోటి రూపాయలు చూసిన చిత్రంగా ‘దానవీరశూర కర్ణ’ చరిత్రలో నిలచింది. అప్పట్లో ఈ చిత్ర నిర్మాణ వ్యయం పది లక్షల రూపాయలు మాత్రమే! పదింతలు పోగేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ చిత్రం 1994లో మరోమారు కోటి రూపాయలు వసూలు చేయడం మరో చరిత్ర! రెండు పర్యాయాలు ఇలా కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రం మరొకటి కానరాదు. దీనికి సమానమైన స్థాయిలో హిందీ చిత్రం ‘మొఘల్-ఏ-ఆజమ్’ కూడా రెండు సార్లు కోటి రూపాయలు వసూలు చేసిన చిత్రంగా ఉంది. 1960లో యావద్భారతమంతటా విజయఢంకా మోగించి, ‘మొఘల్-ఏ-ఆజమ్’ కోటి రూపాయలు పోగేసింది. ‘దానవీరశూర కర్ణ’ కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని కేంద్రాలలో కలిపి ఆ మొత్తం సాధించింది. ఇక 2004లో రంగుల్లో ‘మొఘల్-ఏ-ఆజమ్’ రూపొంది మరోమారు కోటి రూపాయలు చూసింది. అయితే ‘దానవీరశూర కర్ణ’ రెండు సార్లు పాతిక రీళ్ళ నిడివితోనే భళా అనిపించి, కోటి రూపాయలు పోగేసింది. ఏది ఏమైనా తెలుగు చలనచిత్ర చరిత్రలోనే కాదు, భారతదేశంలోనే ఓ చిత్రం ఇంతటి ఘనచరితను సొంతం చేసుకోవడం అనితరసాధ్యమనే చెప్పాలి.

రికార్డుల్లో రికార్డ్...!

ఆ రోజుల్లో ‘దానవీరశూర కర్ణ’ సంభాషణలతో రూపొందిన ఎల్పీ రికార్డులు విశేషంగా అమ్ముడయ్యాయి. ఆ స్థాయిలో పాటలు, మాటలతో రికార్డులు మరే చిత్రానికీ అమ్ముడవ్వలేదు. ‘దానవీర శూరకర్ణ’ చిత్రం సంభాషణలు – ఎల్పీలు , క్యాసెట్స్ , సీడీ, ఆన్ లైన్ లోనూ సేల్స్ అదరహో అనిపించాయి. ఇలా నాలుగు ఫార్మాట్స్ లో హెచ్.ఎమ్.వి., దాని అనుబంధ సంస్థల ద్వారా, ఆడియో సేల్స్ చూసిన సినిమా ఇండియాలో ఏదీ లేదు. ప్రపంచంలో కూడా ఏది కనిపంచడం లేదు.

Post a Comment

0 Comments