GET MORE DETAILS

సూర్యనమస్కారం : సంక్రాంతి నాడు - స‌న్ క్రాంతి గురించి తెలుసుకుందామా ?

సూర్యనమస్కారం : సంక్రాంతి నాడు - స‌న్ క్రాంతి గురించి తెలుసుకుందామా ?



మనిషికీ ప్రకృతికీ, మనిషికీ మట్టికీ, ముఖ్యంగా మనిషికీ.. సూర్యుడికీ మధ్యనున్న అన్యోన్య సంబంధాన్నీ, అవినాభావ అనుబంధాన్నీ నొక్కిచెప్పే పండుగ. ప్రతి జీవికీ ప్రత్యక్ష దైవమైన సూర్యుడి మకర ప్రవేశం.. మనం కష్టించి పండించిన ధాన్యలక్ష్మి గృహప్రవేశం.. ఈ రెండు శుభాల సంరంభం సన్‌ క్రాంతి.
కానీ నేడు మనం ఈ ప్రకృతితో మనకున్న బంధాలను బండగా తెంచేసుకుంటున్నాం. సూర్యుడి ముఖం చూడటం మానేశాం. పంటల ప్రస్తావనే వదిలేశాం. అరిసెల నుంచి సఖినాల వరకూ వంటకాలను మాత్రం వదిలిపెట్టకుండా తింటున్నాం. అందుకే పండుగలు ప్రాశస్త్యాన్ని కోల్పోతున్నాయి, శరీరాలు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి.

ప్రకృతితో బంధాలను తెంచుకోవటం మన ఉనికికే ముప్పు. సూర్యుడు కనబడకుండా దాక్కుంటున్న కొద్దీ జబ్బులకు దగ్గరవుతున్నాం. వ్యాయామం కొరవడి వ్యాధుల్లో కూరుకుంటున్నాం. అందుకే ఒకప్పటి కంటే సూర్యనమస్కారాల అవసరం ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. అటు శరీరానికి అద్భుత వ్యాయామం.. ఇటు మెండైన సూర్య కిరణ సంస్పర్శ.. ఉదయాన్నే ఆరుబయట ఒళ్లు వంచితే రెండు లాభాలు! దీన్ని ఆరంభించటానికి సంక్రాంతిని మించిన సుముహూర్తం ఏముంటుంది...?

మన ప్రపంచం మొత్తానికీ సూర్యుడే శక్తి కేంద్రం. ఆయన నుంచి వెలువడే సూర్యరశ్మి లేకపోతే జీవమూ లేదు, ప్రాణమూ లేదు. రెండు మూడురోజులు మనకంటికి సూర్యుడు కనబడకపోతే జీవితం నిరాస్తకంగా, మందకొడిగా మారిపోతుంది. చైతన్య రహితంగా తయారవుతుంది. నిద్ర, మెలకువలను నియంత్రించే మన జీవగడియారాన్ని నియంత్రించేదీ సూర్యుడి వెలుగే. అందుకేనేమో అనాదిగా మనిషి సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా కొలుస్తున్నాడు. యోగులైనా, సామాన్య ప్రజానీకమైనా సూర్య నమస్కారాలకు మొదట్నుంచీ ఇస్తున్న ప్రాధాన్యానికి ఇదే మూలం. యోగ విధానాలను అభివృద్ధిపరిచే దశలో యోగులు మనిషి జీవితానికి ప్రకృతితో ఉన్న సంబంధాన్ని స్థిరపరిచేందుకు గణనీయమైన కృషి చేశారు. అందులో భాగంగానే సూర్య నమస్కారాలు యోగ సాధనలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి. నేడు మనకు అత్యంత చేరువయ్యాయి. సూర్యనమస్కారాల్లో భాగంగా కొన్ని శతాబ్దాల పాటు యోగ సంప్రదాయాల్లో 48 రకాల శరీర స్థితుల్ని పాటించారు. కానీ ప్రస్తుతం 12 స్థితులనే అన్నిచోట్లా పాటిస్తున్నారు. శరీరానికే కాదు, మనో వికాసానికీ, భావోద్వేగాలపై నియంత్రణకూ, ఆత్మానందానికీ సూర్యనమస్కారాలు ఉత్తమమైనవని గుర్తించారు.

నేటి అవసరం : 

నానాటికీ మన జీవితం ఉరుకుల పరుగుల మయంగా మారిపోతోంది. శరీరానికి అసలు వ్యాయామమే ఉండటం లేదు. మనస్సుకూ ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు శరీరానికి శ్రమ అవసరం. మనస్సుకు వికాసం అవసరం. అతి తక్కువ సమయంలో ఈ రెండింటినీ సంపాదించుకునేందుకు ఉత్తమ మార్గం సూర్య నమస్కారాలు. రోజూ సూర్యోదయ సమయంలో 10 నుంచి 15 నిమిషాలు వీటికి కేటాయిస్తే చాలు. అద్భుతమైన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందొచ్చు. అలాగే మన శరీరానికి కావాల్సిన విటమిన్‌-డి అందేది ఒక్క సూర్యరశ్మి ద్వారానే. కాబట్టి రోజూ కొంతసేపు ఎండలో గడపటం మేలని ఆధునిక వైద్య పరిశోధనలూ నొక్కి చెబుతున్నాయి.


ఏమిటీ ప్రత్యేకత...?

యోగాసనాలన్నింటిలోకీ సూర్య నమస్కారాలకు కొంత ప్రత్యేకత ఉంది. 12 శరీర స్థితులతో కూడిన ఇవి చాలా నెమ్మదిగా, సున్నితమైన కదలికలతో క్రమంగా సాగిపోతాయి. ఏదో ఒక భంగిమలో ఆగిపోకుండా ఏదో ఒక భంగిమలో ఆగిపోకుండా.. మొదట్నుంచీ చివరి వరకూ వరుసగా ఒక స్థితి నుంచి మరొక స్థితిలోకి కొనసాగుతుండటం వీటి ప్రత్యేకత. శరీరాన్ని వెనక్కూ ముందుకే కాకుండా పూర్తిగా వంగేలా చేసే ఈ స్థితులకు అవయవాలన్నీ చక్కగా విప్పారతాయి. ముఖ్యంగా వెన్నుపూస పూర్తిస్థాయిలో, మృదువుగా వంగుతుంది.
ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి పెద్ద పెద్ద వ్యాయామాలే చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న యోగాసనాలూ ఎంతో మేలు చేస్తాయి. అలాంటి తేలికైన, కాస్త సాధనతో ఎవరైనా చేయగలిగిన ఆసనాల సముదాయమే సూర్య నమస్కారాలు. ఒకవైపు ప్రకృతితో మమేకం చేస్తూ.. మరోవైపు ఆరోగ్యాన్ని అందించే అపూర్వ సాధనాలు. ముఖ్యంగా క్షణక్షణమూ ఒత్తిడిలో కూరుకుపోతూ, ఉరుకుల పరుగుల జీవితంలో ఉక్కిరిబిక్కిరవుతున్న నేటి యాంత్రిక జీవులకు గొప్ప సహజ వరాలు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే అద్భుత మార్గాలు. 

పన్నెండు స్థితుల క్రమం...

1. నమస్కారాసనం :
  నిటారుగా నిలబడి శ్వాసను పీలుస్తూ రెండు చేతులను జోడించి నమస్కారం చేయాలి. తర్వాత శ్వాసను పూర్తిగా వదాలి. అనంతరం మెల్లగా చేతులు రెండింటినీ ముందుకు సాచాలి. చేతుల బొటనవేళ్లు ఒకదానికి మరొకటి ఆనుకొని ఉండాలి.


2. అర్ధచంద్రాసనం :
  నమస్కారాసన భంగిమలో అలాగే నిలబడి, శ్వాసను పీలుస్తూ నెమ్మదిగా రెండు చేతులను పైకి లేపి, తలతో పాటు సాగదీసి వెనక్కు వంచాలి. కాళ్లు వంచకూడదు. అరచేతులు ఆకాశం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో బ్యాలెన్స్‌ సరిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే వెనకకు పడిపోయే ప్రమాదముంది. మనసును ఛాతీ మీద కేంద్రీకరించాలి.


3. పాద హస్తాసనం :

  అర్ధచంద్రాసన స్థితి నుంచి శ్వాసను వదులుతూ ముందుకు వంగాలి. రెండు చేతులను పాదాలకు తాకించాలి. నుదుటిని మోకాలికి ఆనించేందుకు ప్రయత్నించాలి. మెడనొప్పి ఉన్నవాళ్లు తలను మరీ ఎక్కువగా వంచకూడదు. మనసును మోకాళ్లు, పిక్కలపై కేంద్రీకరించాలి.


4. అశ్వసంచాలనాసనం :

  పాద హస్తాసన భంగిమ నుంచి రెండు చేతులను నేలకు ఆనించి ఎడమ కాలును పూర్తిగా వెనక్కి జరపాలి. తర్వాత శ్వాసను పీలుస్తూ చేతులను పైకి లేపి వెనక్కి వంగాలి. కుడిపాదాన్ని నేల మీద ఆనించాలి. ఈ సమయంలో మనసును భృకుటి మీద లగ్నం చేయాలి.


5. పర్వతాసనం :
  అశ్వ సంచాలనాసన భంగిమ నుంచి రెండు చేతులను కిందికి తెచ్చి, పాదాలకు ఇరువైపులా నేలకు తాకించాలి. ఎడమ కాలుకు జతగా కుడికాలును వెనక్కి తీసుకెళ్లాలి. తర్వాత నడుమును పైకి లేపాలి. మడమలను పైకీ కిందికీ కదుపుతూ శ్వాసను పీలుస్తూ, వదులుతుండాలి. మనసును నడుము మీద కేంద్రీకరించాలి.


6. సాష్టాంగ నమస్కారాసనం : 

  పర్వతాసనంలో పైకెత్తిన నడుమును కిందికి దింపాలి. నేల మీద బారుగా ఉంటూ రెండు కాళ్లు, ఛాతీ, చుబుకం నేలకు ఆనించాలి. నడుము, పొట్ట భాగాలు నేలకు తాకకుండా కొద్దిగా ఎత్తి ఉంచాలి. శ్వాస బయటకు వదలాలి. మనసును పొట్ట మీద లగ్నం చేయాలి.

7. భుజంగాసనం :
  సాష్టాంగ నమస్కారాసన స్థితి నుంచి క్రమేపీ భుజంగాసనంలోకి రావాలి. రెండు చేతులను నేలపై అణచి పెట్టి, శ్వాసను పీల్చుకుంటూ నడుము భాగాన్ని తల దాకా పైకి సాగదీస్తున్నట్టుగా పైకెత్తాలి. శరీర బరువును కాలివేళ్లు, చేతులు మోసేలా చూసుకోవాలి. మనసును కంఠం మీద కేంద్రీకరించాలి.


8. భూకంపాసనం : 
  భుజంగాసనం నుంచి పర్వతాసనంలో మాదిరిగా నడుమును పైకెత్తాలి. చేతులను కాళ్లను అలాగే నేలకు ఆనించాలి. శ్వాసను వదులుతూ శరీర మధ్య భాగాన్ని పైకి లేపాలి. నడుమును, కాలి మడమలను కుడి ఎడమలకు కదిలిస్తూ ఉండాలి. మనసును నడుము మీద లగ్నం చేయాలి.


9. అశ్వసంచాలనాసనం :
  భూకంపాసన భంగిమ నుంచి ఎడమ కాలును పూర్తిగా వెనక్కి తీసుకెళ్లాలి. తర్వాత శ్వాసను పీలుస్తూ చేతులను పూర్తిగా పైకెత్తాలి. కుడి పాదాన్ని నేల మీద ఆనించాలి. మనసును భృకుటి మీద కేంద్రీకరించాలి.


10. పాద హస్తాసనం : 

  అశ్వసంచాలనాసన స్థితి నుంచి రెండు కాళ్లపై నిలబడి ముందుకు వంగుతూ తలను మోకాళ్లకు ఆనించాలి. పిక్కలపై మనసును లగ్నం చేయాలి.


11. వృక్షాసనం : 
  పాదహస్తాసనం నుంచి పైకి లేస్తూ.. శ్వాసను పీలుస్తూ రెండు చేతులను తిన్నగా పైకి లేపాలి. రెండు చేతుల బొటనవేళ్లు ఒకదానికి ఒకటి తాకుతూ ఉండాలి. శరీరాన్ని నిటారుగా నిలిపి ఉంచాలి. ఈ స్థితిలో శరీరాన్ని కొద్దిగా బిగువుగా ఉంచి మనసును మొత్తం శరీరంపై కేంద్రీకరించాలి.


12. నమస్కారాసనం : 
వృక్షాసన స్థితి నుంచి రెండు చేతులను రెండు పక్కలకు తిప్పుతూ ముందుకు తేవాలి. శ్వాసను వదులుతూ రెండు చేతులను జోడించి నమస్కరించాలి. ఛాతీ మధ్యలో హృదయ కమలం మీద మనసును లగ్నం చేసి, సూర్యుడికి నమస్కరిస్తుండాలి. 


మంత్రంతో.. మంత్రం లేకుండా ... 

మొదట్లో సూర్య నమస్కారాలు బహుశా నమస్కార మంత్ర రూపంలోనే ఉండి ఉండొచ్చు. ఇప్పుడు కూడా భక్తులు నదీ తీరాల్లో మంత్రాలతో సూర్యుడికి నమస్కరించటం చూస్తూనే ఉంటాం. తర్వాత శరీర-ఆత్మల సంగమం కోసం వాటికి శారీరక స్థితులు తోడై ఉండొచ్చు. నిజానికి సూర్య నమస్కార మంత్రాలు 1008. వీటిల్లో 15 మంత్రాలు చాలా ప్రచారంలో ఉన్నాయి. ఒకో మంత్రాన్ని పఠిస్తూ 12 శారీరక స్థితుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే మంత్ర ప్రసక్తి లేకుండా వ్యాయామంలో భాగంగా సూర్య నమస్కారాలను చేసేవారూ లేకపోలేదు. ఈ సూర్య నమస్కారాలను ఎవరైనా చేయొచ్చు. విద్యార్థులకు వీటిని వరాలుగా చేప్పుకోవచ్చు.

లాభాలు అనేకం :

క్రమం తప్పకుండా సూర్య నమస్కారాలను చేయటం వల్ల శరీరంలోని అవయవాలన్నీ చురుకుదనంతో, స్ఫూర్తిమంతం అవుతాయి. శరీరాకృతి అందంగా తయారవుతుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలెన్నో దూరమవుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గి స్థిరత్వం, మానసిక ప్రశాంతత చేకూరతాయి.


* శరీరంలోని అన్ని కండరాలకూ వ్యాయామం లభిస్తుంది. వెన్నుపూస, మెడ కండరాలు బిగుసుకుపోకుండా ఉంటాయి. ఛాతీ, కడుపు భాగంలోని కండరాలు విప్పారతాయి. శరీరపై పట్టు పెరిగి- తూలటం, పడిపోవటం వంటి ఇబ్బందులు తగ్గుతాయి.
ఉచితంగా విటమిన్‌ : సాధారణంగా మన శరీరం విటమిన్లను తయారుచేసుకోలేదు. ఆహారం రూపంలో వాటిని బయటి నుంచే తీసుకోవాలి. కానీ ఒక్క విటమిన్‌-డి మాత్రం మన శరీరంలో తయారవుతుంది. దీన్ని మన శరీరం సూర్యరశ్మి సహాయంతోనే తయారుచేసుకుంటుంది. ఆరోగ్య రక్షణలో విటమిన్‌-డి పాత్ర చాలా కీలకం.


* విటమిన్‌ డి.. ఎముకలు క్షీణించకుండా చూస్తూ వాటిని దృఢంగా ఉంచుతుంది. రోగనిరోధకశక్తిని బలోపేతం చేయటంలోనూ పాలు పంచుకుంటుంది. రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి సజావుగా జరిగేలా చేస్తుంది. ఇన్సులిన్‌ను శరీరం గ్రహించేలా చేయటంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్‌-డి కణ విభజననూ నియంత్రిస్తుంది. ఫలితంగా క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది. ముఖ్యంగా విటమిన్‌ డి లోపం మూలంగా పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌, క్లోమ క్యాన్సర్‌ ముప్పు పెరుగుతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి... ఈ విటమిన్‌-డి మనకు దండిగా లభించాలంటే రోజు మొత్తంలో కొద్ది సమయమైనా మనం తప్పనిసరిగా శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి. అందుకే రోజూ ఉదయాన్నే కొద్దిసేపు సూర్య నమస్కార సాధన చేయటాన్ని మించినది లేదు.


సూర్య నమస్కారాలు - జాగ్రత్తలు :


సూర్య నమస్కారాలను ఎవరైనా చెయ్యచ్చు. అయితే వీటికీ కొన్ని పరిమితులు ఉంటాయని మరవరాదు.

* గర్భిణులు మూడోనెల తర్వాత సూర్య నమస్కారాలను వేయరాదు.

* అధిక రక్తపోటు, గుండెజబ్బు, హెర్నియా, పేగుల్లో క్షయ వంటి సమస్యలు గలవారు, గతంలో పక్షవాతం బారినపడ్డవారు వీటిని వేయకపోవటమే మేలు.

* వెన్నునొప్పి, మెడనొప్పి గలవారు సూర్య నమస్కారాలను ఆరంభించే ముందు డాక్టరు సలహా తీసుకోవటం ఉత్తమం.

* నెలసరి సమయంలో అధిక రక్తస్రావం, నొప్పితో బాధపడే మహిళలు వీటికి దూరంగా ఉండటం మంచిది.

ఈ 12 స్థితులనూ క్రమ పద్ధతిలో చేస్తే సూర్య నమస్కారం ఒకటి పూర్తయినట్టు. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చోవాలి. అనంతరం శవాసనం వేసి కాసేపు విశ్రాంతి తీసుకోవాలి.

Post a Comment

0 Comments