GET MORE DETAILS

శ్రీకాకుళం వంటలు - రుచులు

 శ్రీకాకుళం వంటలు - రుచులు​​​​​సంక్రాంతి... అంటే సంబరం.. సందడి.. పెద్దల పండగ మాత్రమే కాదు. పెద్ద వేడుక కూడా. ఏడాదికోసారి వచ్చి వెళ్లే ఈ మూణ్ణాళ్ల ముచ్చట కోసం ఏడాదంతా ఎదురుచూసేంత గొప్ప పండగ.

ఎక్కడున్నా, ఎలాఉన్నా సొంతూరుకు చేరుకోవాలన్న ఆత్రుత అందరిదీ.. అలాంటి సంబరం రానే వచ్చింది. ఇక ప్రతి ఇంటా సిక్కోలు వంటకాలే పండగ చేస్తాయి. ఆ రుచులు చిన్నప్పటి నుంచి తినడంతో మనకు కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ మన రుచులు ఎరుగనివారు వీటిని ఆస్వాదిస్తారు. అందుకే పండగ నుంచి తిరిగి పనిచేసే చోటుకు వెళ్ల్లేటప్పుడు మనసులో సంక్రాంతి సందళ్లు, చేతిలో సిక్కోలు వంటకాలు తీసుకెళ్లండి.

మరెక్కడా దొరకవు : 

సిక్కోలు వంటకాలకు పేటెంట్లు లేకపోయినా ఇక్కడి రుచులు మరెక్కడా దొరకవనేది నిజం. పల్లెభాషలో చెప్పాలంటే ఇక్కడి పాకం రుచి పట్టడం మరెవరికీ సాధ్యం కాదు. జిల్లాలో అరిసెలు, వెన్నప్పాలు, పొంగడాలు, జున్నుబూరెలు, చంద్రకాంతులు, చెంచుపటాలు, బొబ్బట్లు, పప్పుచెక్కలు, జంతికలు, చుప్పులు వంటివి ప్రతి ఇంట్లో చేసుకొనే వంటకాలు. వీటిని ఇతర ప్రాంతాలకు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భలే గిరాకీ... మువ్వ చెక్కీ : 

ఒడిశా, ఉత్కళ ప్రాంతాల్లో మువ్వ చెక్కీలకు పెట్టింది పేరు. నెయ్యి, పంచదార, జీడిపప్పు, కొబ్బరితో కలసి మువ్వచెక్కీలు అరకిలో రూ.100 నుంచి రూ.350 వరకు వివిధ ప్రాంతాల్లో లభిస్తాయి. పెళ్లయిన ఆడ పిల్లలు పండగకు పుట్టింటికి వచ్చి తిరిగి మెట్టినింటికి వెళ్లేటప్పుడు తమవెంట తీసుకెళ్లడం ఆనవాయితీ. అలాగే మెట్టినింట ఉన్న తమ ఇంటి ఆడపిల్లను చూసేందుకు వెళ్లే సోదరులు వీటిని పట్టుకెళతారు.

మదిని దోచే... మందస కోవా :

కోవా అనగానే మందస గుర్తొస్తుంది. ఇక్కడ లభించే కోవా విభిన్నంగా ఉంటుంది.మందసలో పాలు, పంచదారతో తయారుచేసే ఈ ద్రవరూపంలో ఉండే ఈ పదార్థానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. పశువులు ఇక్కడ ఔషధ మొక్కలు తినడం వల్ల వాటినుంచి వచ్చే పాలల్లో చిక్కదనం ఎక్కువని, దాంతో కోవా తయారు చేయడం వల్లే అంత రుచిగా ఉంటుందంటారు. మందసలో దొరికే దిల్‌కుష్‌ మిఠాయి కూడా పసందుగా ఉంటుంది.

సుదూరానికి... సారవకోట చుప్పులు :

జిల్లావ్యాప్తంగా పలుచోట్ల లభించే చుప్పుల్లో సారవకోట చుప్పులే ప్రత్యేకం. సారవకోటతో పాటు మెళియాపుట్టి, సోంపేట, నరసన్నపేట ప్రాంతాల్లో తయారుచేసే చుప్పులు ప్రత్యేకత చాటుకున్నాయి. తడిసిన బియ్యం పిండి, నూకతో తయారుచేసే ఈ వంటకం రెండు వారాల పాటు రుచి కోల్పోకుండా ఉంటుంది. ఏడాది పొడవునా వీటికి గిరాకీ ఉంది.

నోరూరించే... పేట ఉటంకీలు :

ఉటంకీల తయారీకి నరసన్నపేట ప్రసిద్ధి. జిల్లా వ్యాప్తంగా ఇక్కడినుంచే తయారుచేసి పంపిస్తున్నారు. నోరూరించే ఉటంకీలు తయారుచేయడం కష్టమైనా చేతివృత్తిని విడిచిపెట్టలేకపోతున్నారు ఇక్కడి తయారీదారులు. నరసన్నపేటలోని కలివరపుపేట, ఆదివరపుపేట ప్రాంతాల్లోని మహిళలు ఉటంకీలను తయారుచేసి ఉపాధి పొందుతున్నారు. బియ్యం పిండి, పంచదార, పాలు కలిపి తయారుచేస్తారు

Post a Comment

0 Comments