GET MORE DETAILS

పంచభూత దయ

 పంచభూత దయ

  


నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనేవి పంచభూతాలు అని అందరికీ తెలుసు. వీటితో ఏర్పడిందే మానవ శరీరం. ఈ పంచభూతాలు లేకుంటే ప్రపంచం ఒక్క క్షణం కూడా బతికి బట్టకట్టజాలదు. నిలవడానికి నేల, తాగడానికి నీరు, వంట చేసుకోవడానికి నిప్పు, పీల్చడానికి గాలి, శబ్దాలను వినడానికి ఆకాశం ఉండవలసిందే. వీటిలో ఏ ఒక్కటి లేకున్నా జీవితం లేదు.

నేలకు సహనగుణం ఎక్కువ. అందుకే నేలను తల్లితో పోలుస్తారు. తనలో బాధల బడబాగ్నులు రగులుతున్నా, కీడుల అగ్నిపర్వతాలు బద్దలవుతున్నా, ముప్పుల ఉప్పెనలు ముంచెత్తుతున్నా నిశ్చలంగా నిలిచి, జీవరాశులను కాపాడుతున్న కరుణాంతరంగ భూమి. మనిషి మట్టిలోనుంచి పుడతాడని శాస్త్రం చెబుతోంది. అలాంటిది తన జన్మకు కారణమైన నేల తల్లిని క్షోభ పెట్టకుండా కాపాడి రుణం తీర్చుకోవలసిన బాధ్యత మనిషిపైనే ఉంది.

ఈ ప్రపంచంలో నీరే లేకపోతే ఏ జీవీ క్షణకాలం కూడా మనుగడ సాగించలేదు. అందుకే నీటికి ‘జీవనం’ అనే పేరు ఉంది. జీవికి ప్రాణప్రదమైంది నీరే. మనిషి అన్నం లేకుండా బతకగలడు కానీ నీరు లేకుండా జీవించలేడు. సకల జీవజాలానికి ప్రకృతికీ చైతన్యాన్ని ప్రసాదిస్తున్న నీటిని అమూల్యంగా కాపాడుకోవలసిన బాధ్యత మనిషిపై ఉంది !

పంచభూతాల్లో మూడోది, అగ్ని. సూర్యుడి నుంచి వెలువడే ఉష్ణశక్తి మానవ లోకానికి అదృష్టవరం. సూర్యుడు ఉజ్జ్వలంగా ప్రకాశించకపోతే లోకం అంధకారబంధురమే. సూర్యకాంతి లేనిదే చూపు లేదు. చూపు లేకుంటే అంతా శూన్యమే. ప్రకృతి వికాసానికి మూలకారణం, జీవుల శారీరక వికాసానికి, ఆరోగ్యానికి మూలం- తేజస్సే. సూర్యుడి దయ తేజోరూపంలో నిరంతరం లోకానికి మార్గదర్శకం అవుతున్నందువల్లనే మానవుడి జీవయాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది.

 పంచభూతాల్లో నాలుగోదైన గాలి కారుణ్యం వర్ణనాతీతం. ఒక్క క్షణం గాలి వీచకపోతే ప్రాణాలు ఆగిపోతాయి. శరీరంలో ఏ అవయవాలూ పనిచేయవు. రక్త ప్రసరణ నిలిచిపోతుంది. ప్రపంచమే స్తంభించిపోతుంది. గాలి అనుకూలంగా వీస్తేనే మేఘాలు ఏర్పడతాయి. వానలు కురుస్తాయి. పంటలు పండుతాయి. అటువంటి గాలిని కూడా రసాయనాలతో కలుషితం చేస్తే ప్రాణుల మనుగడ సాధ్యమా? మనిషికి ఆకాశం చేసే మేలు ఎంతో గొప్పది. మనిషి నిత్యజీవనం కొనసాగాలంటే శ్రవణేంద్రియానికి అన్ని ధ్వనులూ వినిపించాలి. ధ్వని మనిషి జీవితావసరం. ఇతరుల మనోభావాలను తెలుసుకోవాలన్నా, తన మనోభావాలను ఇతరులకు తెలపాలన్నా మాటలే కదా శరణ్యం! ఆ మాటలు వినబడటానికి ఆకాశమే ప్రబల యానకం. ఆకాశం లేకుంటే అంతా నిశ్శబ్దమే ఆవరిస్తుంది. మనిషి జీవనం అగమ్యగోచరం అవుతుంది. తన శక్తితో ఈ ప్రపంచాన్నే ధ్వనిమయం చేసి, ప్రపంచాన్ని నడుపుతోంది.

పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో జీవించే మనిషి ఆ ప్రకృతి దైవాలను రక్షించుకోవడానికి బదులుగా భక్షించాలనుకొంటున్నాడు. ప్రాణదాతలైన పంచభూతాల ప్రాణాలు తీయాలనుకొంటున్నాడు. అన్నింటినీ కలుషితం చేసి మృత్యువును కౌగిలించుకొంటున్నాడు. సౌరకుటుంబంలోనే జీవుల మనుగడకు సురక్షిత స్థానమైన భూమండలాన్ని నిర్జీవ గోళంగా మార్చేందుకు స్వార్థ యత్నాలను కొనసాగిస్తున్నాడు. దయతలచి తనను రక్షిస్తున్న పంచభూతాల పట్ల అపచారం చేస్తున్నాడు. ఇప్పటికైనా కళ్లు తెరిచి, పంచ భూతాలకు తాను చేస్తున్న ద్రోహానికి అడ్డుకట్ట వేయకపోతే మనిషిని ఏ దేవుడూ క్షమించడు.

Post a Comment

0 Comments