ఉద్యోగం వదిలి... సాగుబాటన కదిలి
లక్ష్మి సుజాత పీజీ చేసింది. యాభైవేలకు పైనే జీతం. ఇవేమీ ఆమెకి తృప్తి నివ్వలేదు. తండ్రి ఇచ్చిన భూమి, ఆయన చూపిన బాటే ఆమెకి భవిష్యత్తు బాటగా అనిపించింది. తండ్రిలా వ్యవసాయంలో రాణించాలనే తపనతో ఉద్యోగాన్ని వదిలి నేలతల్లి వైపు అడుగులేశారు. రాళ్ల పొలాన్నే రతనాల భూమిగా మార్చిó, ఏడేళ్ల నుంచి సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తూ మంచి సత్ఫలితాలు సాధించి, శభాష్ అనిపించారు. పేద మహిళలకు ఉపాధి చూపుతూ ఆ కుటుంబాలకు అండగా నిలిచారు.
ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మండలం తిమ్మ సముద్రానికి చెందిన బడ్డుపాటి నాగభూషణానికి ముగ్గురు కూతుళ్లు. వారిలో లక్ష్మి సుజాత రెండవ కుమార్తె. ఆమె బాల్యం నుంచి తండ్రితో పాటు పొలం పనులకు వెళ్లారు. నాగభూషణం ఇంట్లో కన్నా ఎక్కువగా పొలంలోనే నివాసం ఉండేవారు. నేలతల్లే కన్నతల్లి అని భావించే ఆయన చనిపోయేంత వరకూ వ్యవసాయం చేశారు. కూతుళ్లని మంచి చదువులు చదివించారు. స్థిరపడిన కుటుంబాలకే పెళ్లి చేసి పంపారు. ఇద్దరు కూతుళ్లు తండ్రి వారసత్వంగా వ్యవసాయం చేయడం అలవర్చుకున్నారు. కానీ లక్ష్మి సుజాత మాత్రం పై చదువుల నిమిత్తం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వివాహం అనంతరం అక్కడే ఓ పాఠశాల్లో ప్రిన్సిపాల్‌గా పని చేశారు. ఎంతో మంది పిల్లలకు చదువు చెప్పారు. మంచి జీతం పొందారు. కానీ మనసులో ఏదో వెలితి. తండ్రి కష్టం చూస్తూ పెరిగిన తనకి వ్యవసాయం చేయాలని ఉన్నా...పరిస్థితులు అనుకూలిస్తాయా? అన్న అనుమానం ఉండేది. ఏడేళ్ల క్రితం తండ్రి నాగభూషణం అనారోగ్యానికి గురైయ్యారు. ఆయన్ని చూసుకునేందుకు వచ్చిన లక్ష్మి సుజాతకి ఇక్కడే ఉండిపోవాలనిపించింది. ఆయన చూపిన వ్యవసాయ మార్గంలోనే నడవాలనుకుంది. ఆమె నిర్ణయాన్ని భర్త గిరిధర్ కుమార్ రామరాజు కూడా అర్థం చేసుకుని సహకరించారు. ఉద్యోగం విడిచి, తిరిగి సొంత ఊరికి చేరుకున్నారు.
రాళ్ల భూమిలో సాగు :
చీమకుర్తి మండలం ఇలపావులూరు, గాడిపర్తివారిపాలెం, శివరాంపురం గ్రామాలకు దాదాపు మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న కొండ ప్రాంతంలో ఇరవై ఐదు ఎకరాలు కొనుగోలు చేశారు. చుట్టూ కొండలు, మట్టి కన్నా రాళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఆ భూమి దేనికి పనికి రాదని, నష్టం వస్తుందని చుట్టూ పక్కల రైతులు, బంధువులు సలహా ఇచ్చారు. తండ్రి ఇచ్చిన ధైర్యం, తోబుట్టువుల చేయూత ఆమెకి బాధ కలగనివ్వలేదు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు అందులో పండ్ల తోట సాగు చేస్తే బాగుంటుందని భావించారు. భూమిని మెత్తగా దున్ని, మంచి మట్టిని తోలారు. అందులో మహారాష్ట్ర నుంచి భగవాన్ రకం దానిమ్మ మొక్కలను తెచ్చి ఐదు ఎకరాల్లో నాటారు. అంతర పంటగా లోక్నో 49 రకం జామ మొక్కలను వేశారు. దీంతో పాటు మరో ఐదు ఎకరాల్లో బత్తాయి, నిమ్మ పంటల సాగు కూడా చేపట్టారు. నీటి నిల్వ కోసం రెండు ఎకరాల్లో పొలంలోనే పెద్ద పెద్ద రెండు కుంటలను తవ్వారు. బిందు సేద్యం విధానంలో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేశారు. దీంతో జామ, దానిమ్మ కాయలు బాగా వచ్చాయి. మంచి ధర పలికి లాభం వచ్చింది. మరుసటి సంవత్సరం బప్పాయి, కూరగాయలు దొండ, సొరకాయ సాగు చేశారు.
సేంద్రీయ ఎరువుల తయారీ :
రసాయన ఎరువులు, పురుగుల మందులతో పండించిన పంటలతో కలిగే అనర్థాలపై లక్ష్మి సుజాతకి పూర్తి అవగాహన ఉంది. ఎక్కువ లాభం కన్నా ఆరోగ్యం ముఖ్యమని తండ్రి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేదు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేశారు. వేప, ఆముదపు పిండి, ఆవు పేడ, గో మూత్రం ఉపయోగించి ఎరువులు తయారుచేయిస్తున్నారు. పిచికారీ కోసం వేప కాషాయం, మజ్జిగ, శనగ పిండి, నల్లబెల్లం ఉపయోగించి మొక్కలకు తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. విప్ప పువ్వు నూనె, వేప నూనె కలిపి చీడపీడలు రాకుండా మొక్కలకు ఎరువుగా వేస్తున్నారు. పొలంలోనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి మోటార్ ద్వారా మొక్కలకు నీళ్లు పెడుతున్నారు.
మహిళా కూలీలకు నిత్యం ఉపాధి :
లక్ష్మి సుజాత ఒక్కతే పనులన్నీ చూసుకోవడం కష్టం కావడంతో చెల్లెలు విజయలక్ష్మిని భాగస్వామురాలిగా చేసుకుంది. ఇద్దరూ రేయింబవళ్లూ కష్టపడ్డారు. పొలంలో ప్రతిరోజూ ఉండే పనుల కోసం 30 మంది మహిళా కూలీలను పెట్టుకున్నారు. సేంద్రీయ ఎరువుల తయారీ, కలుపు తీయడం, మందులు పిచకారీ చేయడం, కాయలు కోయడం వంటి పనులన్నీ మహిళలే చేయడం విశేషం. వీరికి ప్రతిరోజూ ఉపాధి కల్పిస్తూ, వారి కుటుంబ సమస్యలు తెలుసుకుంటూ..వారికి అండగా నిలుస్తున్నారు. వీరి కష్టం ఫలించి మొదటి సంవత్సరం 20 టన్నుల దిగుబడి రాగా...ఇప్పుడు 120 టన్నుల దిగుబడి వచ్చేలా కృషి చేశారు. ఈ సంవత్సరం కోటిన్నర వ్యాపారం జరుగుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు లక్ష్మి సుజాత. ఈ కాయలను చెన్నై, హైదరాబాదు, ముంబై ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. చుట్టూ పక్కల పండ్ల వ్యాపారులు సైతం ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు.
పేద రైతుల కోసం సొసైటీ :
ఆమెకి వ్యవసాయం చేయడం ఒక ఎతైయితే పండిన పంటని మార్కెటింగ్ చేయడం అనేది చాలా కష్టంగా మారింది. పంటని అమ్ముకునే క్రమంలో నష్టంతో పాటు సవాళ్లను ఎదుర్కొన్నారు. తన పరిస్థితే ఇలా ఉంటే పేద రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించారు. చుట్టుపక్కల గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులను కలిశారు. వారి కష్టాలు, కన్నీళ్లు విని చలించిపోయారు. వారి కోసం 'పీసెంట్ సొసైటీ' ఏర్పాటుచేశారు. వారికి ఏ కాలంలో ఏ పంటలు వేయాలి? ఎలా సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు, ఎరువు తయారీపై సూచనలు చేస్తున్నారు. వారి దగ్గర నుంచి కూరగాయలు, పండ్లు కొనుగోలు చేస్తూ...రైతుల అభివృద్ధికి సహకరిస్తున్నారు.
నాన్నే నాకు స్ఫూర్తి : లక్ష్మి సుజాత
నాన్న నాలుగేళ్ల క్రితం చనిపోయారు. వ్యవసాయ రంగంలో ఆయనే నాకు స్ఫూర్తి. ఆయన కష్టం నాకు బాగా తెలుసు. అందుకే పేద రైతులకు సహాయపడుతున్నాను. వారు నష్టపోకుండా పంటని కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తున్నాను. 'ప్యాసెంట్ ఆగ్రో' సంస్థను ప్రారంభించి ఇతర రైతులకు దానిమ్మ సాగులో మెలకువలు అందిస్తున్నాం. త్వరలో కావ్య ఆగ్రో పేరుతో దానిమ్మ, స్నాక్ ప్యాక్, జ్యూస్, జామ్ లాంటి ఉత్పత్తులను తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తాం.
- పద్మావతి
0 Comments