GET MORE DETAILS

నవగ్రహ పూజ - ఫలితాలు

 నవగ్రహ పూజ - ఫలితాలుహిందువుల జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మానవుల స్థితిగతులు, భవిష్యత్తు వ్యవహారాలపై నవగ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ భూప్రపంచంలో దేవతలతో సమానంగా నవగ్రహాలకి కూడా ప్రాధాన్యం ఇవ్వబడింది. మానవులు చేసిన కర్మలను అనుసరించే వారికి శుభాశుభ ఫలితాల్ని నవగ్రహాలు అందిస్తుంటాయి.

సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి, బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి, శనికి అధిపతి బ్రహ్మ. సూర్యుడు కారానికి, చంద్రుడు లవణానికి, కుజుడు చేదుకు, బుధుడు షడ్రుచులకు, గురువు తీపికి, శుక్రుడు పులుపుకు, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణానికి, కుజుడు ఋతువుకు, బుధుడు మాసానికి, గురువు పక్షానికి, శుక్రుడు సంవత్సరాలకు అధిపతులు.

నవగ్రహాల ద్వారానే ఈ భూమండలం మొత్తం నడుస్తుంది. స్తావర జంగమములు ఏర్పడినవి ఈ గ్రహాల వల్లే. త్రిమూర్తులు త్రిదేవినులు కొలువైనది ఈ గ్రహల్లోనే. గ్రహరూపి జనార్దన , గ్రహరూపి మహేశ్వర అనే వచనం ప్రకారం హరిహరులు గ్రహ రూపంలో కొలువై ఉన్నారు. అటువంటి గ్రహాలనురెండు వర్గములుగా సృష్టి ఆదిలోనే విభజించారు. అవి

గురుపాలితములు: రవి, చంద్ర, కుజ, గురు, కేతు

శనిపాలితములు: శని, బుధ, శుక్ర, రాహు

పాపపుణ్యములు వీరిలోనే ఉన్నవి. గ్రహశాంతి అంటే జాతకునికి ఏ గ్రహం పాపగ్రహమో , ఏది ఎక్కువ బాధిస్తుందో తెలుసుకొని ఆయా గ్రహాలకు వారి ప్రీతికరమైన ధాన్యం, వస్త్రాలను సంకల్పయుతంగా దానమిచ్చిన ఆ గ్రహ పీడా నివారణ జరిగి కొంత ఉపశమనం కలుగుతుంది.

నవ గ్రహాల్లో ప్రతీ గ్రహమూ శుభాన్ని - అశుభాన్ని రెండింటినీ కలిగిస్తుంది. ఈ శుభాశుభాలనేవి ఆ జాతకుడి గ్రహస్థితిని బట్టి ఉంటుంది. మరి నవగ్రహాల ద్వారా కలిగే అశుభాల్ని నివారించుకోవటానికి మార్గం లేదా అంటే ఉంది. అది నవగ్రహాలని నిత్యం స్తుతిస్తూ, పూజిస్తూ వుండడం. ఆయా గ్రహ మంత్రాల్ని జపం చేయటం లేదా చేయించుకోవటం. ఈ కార్యక్రమాల ద్వారా నవగ్రహ శాంతిని పొందచ్చు. ఈ నవగ్రహ పూజ, జప దానాల వల్ల పూర్తిగా దోషం నుంచి తప్పించుకోలేకపోయినా, ఆ దోషం ద్వారా కలుగబోయే పెద్ద ప్రమాదం నుంచి సులభంగా బయటపడవచ్చు.

నవగ్రహ శాంతికి సంబంధించి పూజాది కార్యక్రమాలు చేసేవారు ఆయా ప్రత్యేక వస్తువులతో పూజని నిర్వహించాలి. పూజలో గ్రహ శాంతికి దోష నివారణకు దానాలు చేయాలి. ఇలా చేసిన వారికి దోష నివారణ జరిగి శుభాలు కలుగుతాయి. కోరిన కోర్కెలు నెరవేరతాయి. సూర్య గ్రహ పూజ చేసేవారు గోధుమలను దానం చేయాలి. చేతికి కెంపు ఉంగరాన్ని ధరించటం వల్ల రోగాదులు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి కలుగుతుంది.

గురు గ్రహ పూజను నిర్వహించేవారు శనగలను దానం చేయాలి. అదే విధంగా కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించటం వల్ల అధికారం, ధనయోగంతో పాటు కీర్తివంతులవుతారు. చంద్రుని పూజకు బియ్యాన్ని దానం చేస్తే సరిపోతుంది. ముత్యాన్ని ధరించటం వల్ల నేత్రాలకు సంబంధించిన బాధలకు నివృత్తి కలుగుతుంది. ఇక కుజ గ్రహ పూజలో కందులను దానం చేయాలి. పగడపు ఉంగరాన్ని ధరించటం వల్ల రుణ విముక్తి కలిగి శతృ బాధ తొలగుతుంది. బుధ గ్రహ పూజలో పెసలను దానం చేయాలి. పచ్చల ఉంగరాన్ని ధరించటం వల్ల ధనలాభం కలగటమే కాక వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది.

శుక్రుని పూజలో అలచందల దానం చేయాలి. వజ్రం, పగడము ధరించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. వివాహాది శుభకార్యములకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. రాహు పూజకు మినుములను దానం చేయాలి. గోమేధిక ఉంగరాన్ని ధరించటం వల్ల భయాందోళనలు తగ్గుతాయి. ధనప్రాప్తి కలుగుతుంది.

కేతువు పూజలో ఉలవల దానం చేయాలి. వైఢూర్యం ఉంగరాన్ని ధరించాలి. దీనివల్ల సర్పాది భయాలు తొలగటమే కాక.. దైవశక్తి పెరుగుతుంది. శనిపూజలో నువ్వులను దానం చేయాలి. నీలిరంగు రాయి కలిగిన ఉంగరాన్ని ధరించటం వల్ల ఆరోగ్యవంతులవటమే కాక ఇతర కష్టాలు కూడా తొలగిపోతాయి. నవగ్రహాలు సంతృప్తి చెంది మానవులకు సుఖశాంతుల్ని ప్రసాదించాలంటే వాటిని దేవతల్లా భావించి ఆరాధించాలి. పూజించాలి.

Post a Comment

0 Comments