GET MORE DETAILS

రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఉత్తరాంధ్ర వీర వనిత వీర గున్నమ్మ

రైతుల కోసం బ్రిటిష్ వారితో పోరాడిన ఉత్తరాంధ్ర వీర వనిత వీర గున్నమ్మస్వాతంత్ర్ర్యానికి ముందు చరిత్రలో ఎన్నో రైతు పోరాటాలు జరిగాయి. వీటిలో కొందరు ఆంగ్లేయులపై, మరికొందరు జమీందార్లపై పోరాడారు. ఇంకొందరు ఇద్దరినీ ఎదిరించారు.

అలా ఇటు బ్రిటిషర్లను, అటు జమీందార్లను ఎదిరించిన ఒక సామన్య మహిళ పేరు ఉత్తరాంధ్ర పోరాటాల చరిత్రలో కనిపిస్తుంది.

రైతు కుటుంబానికి చెందిన వీర గున్నమ్మ ఆంగ్లేయులను, జమీందార్లను ఎదిరించారు.

అటవీ సంపదపై జమీందార్ల హక్కును ప్రశ్నించిన గున్నమ్మ, 80 ఏళ్ల క్రితం రైతుల పక్షాన పోరాటం చేసి, తూటాలకు బలయ్యారు. అప్పుడు ఆమె నిండు గర్భిణి.

ఎవరీ గున్నమ్మ...?

మందస సంస్థానం అప్పట్లో విశాఖ జిల్లాలో ఉండేది (ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉంది). గుడారి రాజమణిపురం (జీఆర్‌పురం) గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు గున్నమ్మ.

గున్నమ్మ పుట్టిన సంవత్సరంపై సరైన ఆధారాలు లభించకపోయినా... ఆమె 1914లో పుట్టిందని మందసలోని స్థానికులు తెలిపారు. రైతులకు కోసం జమీందార్లకు వ్యతిరేకంగా పోరాటాం చేస్తూ...ఆమె 1940లో వీర మరణం పొందారు.

ఆమె చరిత్ర నేటి తరాలకు తెలియ చేయాలనే ఆమె జీవిత చరిత్ర పరిశోధన చేసి... సినిమాగా తీస్తున్నట్లు దర్శకులు గూన అప్పారావు బీబీసీతో చెప్పారు.

“అనాటి మందస ప్రాంత ఆచారాల ప్రకారం.. సుమారు పది సంవత్సరాల వయసులోనే గున్నమ్మకు మాధవయ్య అనే వ్యక్తితో వివాహం చేశారు. వివాహం తర్వాత గున్నమ్మ భర్త ఉపాధి కోసం రంగూన్ (ఈనాటి బర్మా) వెళ్లారు. కొంత కాలం తర్వాత తిరిగి స్వగ్రామం వచ్చారు. అయితే ఆ సమయంలో తీవ్రమైన కరవు రావడంతో తిరిగి మళ్లీ రంగూన్ వెళ్తారు. ఆ సమయానికి గున్నమ్మ మూడు నెలల గర్భవతి. రంగూన్ వెళ్లిన భర్త కొంత కాలానికే అక్కడ మరణిస్తారు. భర్తను కోల్పోయినా, జీవితం కష్టాల్లో ఉన్నా.. రైతులకు బాసటగా నిలుస్తూ...జమీందార్లు, బ్రిటిషర్లను సైతం ఆమె ఎదిరించారు. ఆమె పోరాటం స్వాతంత్ర్య పోరాటంగానే చెప్పాలి. ఎందుకంటే దేశం నుంచి ఆంగ్లేయులను వెళ్లగొట్టాలంటే...ముందు వారికి తొత్తులుగా మారిన జమీందార్లను ఎదిరించాలని భావించి ఆమె తిరుగుబాటు చేశారు” అని గూన అప్పారావు చెప్పారు.

జమీందార్ల ఆరాచకాలను ప్రశ్నించిన గున్నమ్మ :

“రైతులు పండించే పంటలో మూడో భాగాన్ని పన్ను రూపంలో జమీందార్లు తీసుకునే వారు. అది వారు ఆంగ్లేయులకు చెల్లిస్తుండేవారు. కరవుతో అల్లాడుతున్న సమయంలోనూ అడవి నుంచి ఎండు పుల్లలు, కలప తెచ్చుకున్నా వాటికి కూడా పన్ను కట్టమనేవారు. అటవీ ఉత్పత్తులను తీసుకొచ్చినా మార్గ మధ్యంలో అడ్డుకుని బ్రిటిష్ సైనికులు పన్ను కింద కొంత భాగం తీసుకునేవారు. ఈ పన్నుల భారం తగ్గించాలని రైతులు జమీందార్లను ఆడిగేవారు. అయినా ఫలితం ఉండేది కాదు. ఈ పరిస్థితులను ఎదుర్కొవాలంటూ వీర గున్నమ్మ రైతులతో సమావేశాలు పెడుతూ చైతన్య పరిచేవారు. ఇవి రైతులకు, ఆంగ్లేయ అధికారులకు మధ్య వాగ్వాదాలకు, చిన్నపాటి ఘర్షణలకు దారి తీసేవి. రైతుల తరపున వీర గున్నమ్మ ప్రాతినిధ్యం వహించేది”అని గూన అప్పారావు తెలిపారు.

“అదే సమయంలో అంటే 1940 మార్చి 27, 28 తేదీలలో స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా పలాసలో జమీందారీ వ్యతిరేక ఉద్యమ రైతు మహా సభలు నిర్వహించారు. ఆ తర్వాత రోజున, మార్చి 29న ఎన్‌జీ రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు, గౌతు లచ్చన్న, మార్పు పద్మనాభం నాయకత్వంలో మందస ప్రాంతంలో ఉన్న గుడారి రాజమణిపురంలో రైతు సభను రైతులే నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు, మహిళలు హాజరైన ఈ సభలో పాల్గొన్న గున్నమ్మ జమీందార్ల అరాచకాలు, రైతులు వారిని ఎదుర్కొవాల్సిన విధానంపై ప్రసంగించారు” అని గున్నమ్మ చరిత్రపై పరిశోధన చేసిన ఎల్ వెంకటాచలం బీబీసీతో తెలిపారు.

“ఆ సభలోనే మందస కొండల్లోని అటవీ ప్రాంతానికి వెళ్లి వంద ఎడ్ల బళ్లపై కలపను తీసుకురావడానికి రైతులు సిద్ధపడాలని గున్నమ్మ పిలుపునిచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన 1874 ఏజెన్సీ చట్టం ప్రకారం అడవిపై అన్ని హక్కులు స్థానిక జమీందారువే. సహజ వనరులపై జమీందారీ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ గున్నమ్మ నాయకత్వాన రైతులు కదిలి అడవిలో కలపను నరికి బళ్లపై ఎక్కించారు. విషయం తెలుసుకున్న మందస జమీందారు జగన్నాథ రాజమణి... గున్నమ్మతో పాటు రైతులను అడ్డుకోవాలని దివాను రామకృష్ణదేవ్‌ను, ఫారెస్ట్‌ రేంజర్‌ కృష్ణ చంద్రరాజును ఆదేశించారు. వీరు వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులను, వారి ఎడ్ల బళ్లను ఆపేందుకు ప్రయత్నించారు. అడవి నుంచి కలప తరలించడానికి వీల్లేదని ఫారెస్టర్‌ హుకుం జారీ చేసినా.. గున్నమ్మ నాయకత్వంలో రైతులు కలపను తీసుకుపోయారు" అని ఆయన వివరించారు.

ఇది జమీందార్లపై రైతులు సాధించిన విజయంగా భావించి గున్నమ్మకు పూలదండలతో, పసుపు కుంకుమలతో గ్రామంలోకి ప్రజలు స్వాగతం పలికారని, 1940 మార్చి 30న రాత్రి రాజమణిపురంలో గున్నమ్మకు అభినందన సభ ఏర్పాటు చేశారని అని వెంకటాచలం తెలిపారు.

1940, ఏప్రిల్ 1న...

అభినందన సభ జరిగిన మర్నాడు అంటే 1940, ఏప్రిల్ 1వ తేదీన ఏం జరిగిందో... గున్నమ్మ బంధువైన చంద్రశేఖర్ బీబీసీకి వివరించారు. గున్నమ్మ గొప్పతనాన్ని తెలియచేస్తూ... ఇదంతా తమ పెద్దలు చెప్పారని ఆయన తెలిపారు.

“కలపను తీసుకుపోవడాన్ని సహించలేని జమీందారు స్థానిక అధికార్లు, బ్రిటిష్ సైన్యాన్ని తీసుకుని ఏప్రిల్ 1న గ్రామంలోకి వెళ్లారు. ఆ సమయంలో పొలాల్లో వీర గున్నమ్మ రైతులతో సమావేశమై చర్చిస్తున్నారు. అక్కడికి వెళ్లి గున్నమ్మ నాయకత్వంలో తీసుకుని వచ్చిన కలపను... సంస్థానానికి తీసుకుపోవాలని జమీందారు ఆలోచన. పొలం వద్దకు చేరుకున్న జమీందారు, అధికారులు తుపాకులు చూపుతూ జనంలోకి ప్రవేశించారు. కదిలితే కాల్చివేస్తామని రైతులను బెదిరించి, అటవీ చట్టాలను ఉల్లంఘించారంటూ కొందరు రైతులకు బేడీలు వేసి పోలీసు జీపులో ఎక్కించారు. మా కష్టాన్ని దోచుకోవడమే కాకుండా... రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లడానికి మీకెంత ధైర్యమంటూ గున్నమ్మ పోలీసు జీపుకు అడ్డంగా నిలిచారు. ఒక మహిళ ఎదిరించడాన్ని తట్టుకోలేక పోయారు పోలీసులు. గున్నమ్మకు తుపాకులు గురిపెట్టి పక్కకు తప్పుకోవాలని హెచ్చరించారు. అయినా ఆమె ధైర్యంగానే నిలబడ్డారు’’అంటూ పోరాటం ఎలా జరిగిందో చంద్రశేఖర్ వివరించారు.

నేలకొరిగిన గున్నమ్మ :

“అయినా గున్నమ్మ తప్పుకోలేదు సరికదా.. అడవిలో మొక్కను నువ్వు నాటవా..? నీరు పోశావా..? వాటిని తీసుకోవద్దనే అధికారం నీకెక్కడిది? అంటూ మరో సారి గొంతెత్తారు. పోలీసులు తుపాకులు గున్నమ్మ వైపే గురిపెట్టినా గున్నమ్మ ఏ మాత్రం చలించలేదు.

దాంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా కూడా గున్నమ్మ, రైతులు, స్థానికులు ఎవ్వరూ భయపడలేదు. ఇంకా ముందుముందుకొచ్చారు. చేసేదేమీ లేక భయభ్రాంతులకు గురైన జమీందారు నేరుగా రైతులపై కాల్పులు జరపాలని ఆదేశాలు జారీ చేశారు. జమీందారు ఆదేశంతో పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అరుపులు, కేకలు, తుపాకి శబ్దాలతో ఆ ప్రాంతమంతా యుద్ధ భూమిగా మారింది. గున్నమ్మ శరీరంలోకి కూడా తుపాకీ గుళ్లు దూసుకుపోయాయి. గున్నమ్మతోపాటు మరో రైతులు గుంట బుదియాదు, గొర్లె జగ్గయ్య, కర్రి కళియాడు, గుంట చిననారాయణ కూడా పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు” అని చంద్రశేఖర్ తెలిపారు.

గున్నమ్మను గుర్తించాలి :

గున్నమ్మకు సరైన గుర్తింపు లభించలేదని ఆమె బంధువులు అంటున్నారు. ప్రభుత్వం భవిష్యత్తు తరాలకు ఆమె చరిత్ర తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే.. ఉత్తరాంధ్రలో ఒక మహిళ చేసిన పోరాటం చరిత్రకెక్కుతుందని గున్నమ్మ మేనకోడలు ఆదెమ్మ బీబీసీకి చెప్పారు.

“రైతుల శ్రమను దోచుకుంటున్న జమీందార్లపై పోరాటం చేసి 26 ఏళ్ల వయసులోనే ఆమె ప్రాణాలు విడిచారు. ఆమె పోరాటానికి గుర్తుగా గుడారి రాజమణిపురం గ్రామానికి వీర గున్నమ్మపురంగా పేరు మార్చారు. గున్నమ్మ పోరాట పటిమని గుర్తిస్తూ...1988 సెప్టెంబరు 10ననాటి గవర్నర్‌ కుముద్‌బెన్‌జోషి ఆ గ్రామాన్ని సందర్శంచి శిలా ఫలకాలన్ని ఆవిష్కరించారు. గ్రామంలోకి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ద్వారంపై కూడా గున్నమ్మ చిత్రాలను చెక్కారు. వీర గున్నమ్మ నివసించిన ఇంటికి మరమ్మతులు చేసుకుని.. మేం ఉంటున్నాం. వీర గున్నమ్మ మా బంధువని చెప్పుకోవడం గర్వంగా ఉంది. ప్రభుత్వం ఆమె పోరాటాలను గుర్తించి ఆమె జయంతి, వర్ధంతులను నిర్వహిస్తే బాగుంటుంది”అని ఆదెమ్మ కోరుతున్నారు.

‘‘మా తాతలు, తండ్రులు, మేం అంతా వీర గున్నమ్మ కథని గానం చేస్తూ గంగిరెద్దులను తిప్పుతున్నాం. ఆమె చరిత్రను గానం చేస్తుంటే ఉత్తేజం వస్తుంది. కొందరు రచయితలు, సినీ దర్శకులు గున్నమ్మ కథను అడిగి తెలుసుకుంటున్నారు’’అని గంగిరెద్దుల కళాకారుడు బాడా సూరన్న చెప్పారు.

“అనాటి రైతులకు అణిగిమణిగి బతకడం తెలుసు. ఎదిరించడం రాదు. అయితే గున్నమ్మ దానిని మార్చేశారు. రైతుల్లో ధైర్యాన్ని నింపి, చైతన్యం తీసుకొచ్చారు. తుపాకులకు భయపడలేదు. ఎర్ర టోపి పెట్టుకున్న ప్రతి ఒక్కడ్నీ (బ్రిటిష్ పోలీసులు) రోడ్డంతా వెంటాడి మరి తరిమింది. ఒక ఆడపిల్ల ఇంత తెగువని చూపించడం అనాటి జమీందార్లు తట్టుకోలేకపోయారు. ఆమె ఉంటే తమ ఆటలు సాగవని... కావాలనే ఊర్లోకి వెళ్లి గొడవకు దిగి ఆమెను చంపేశారు” ఇదే మేం పాట రూపంలో పాడుతామని బాడ సూరన్న బీబీసీతో చెప్పారు. ఈయన అల్లు అర్జున్ నటించిన అలవైకుంటపురంలో సినిమాలోని క్లైమాక్స్‌లో వచ్చే “సిత్తరాల సిరపడు” పాట పాడారు.

గున్నమ్మది స్వాతంత్ర్య పోరాటమే...

వీర గున్నమ్మ పోరాటాల్ని, ఆమె చూపిన తెగువను చరిత్రకారులు పట్టించుకోలేదని గున్నమ్మ చరిత్రపై పుస్తకం రాసిన జర్నలిస్టు, రచయిత నల్లిధర్మారావు అన్నారు.

‘‘శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న గంగిరెడ్ల కళాకారులు వీరగున్నమ్మ చరిత్రను గానం చేస్తుంటారు. నేను పుస్తకం రాయడానికి వారు గానం చేసే ఆ పాటే స్ఫూర్తి. వారి వద్ద నుంచి సమాచారం సేకరించి... అనాటి వార్తా పత్రికలు, కొందరు స్థానిక చరిత్రకారులు అందించిన సమాచారం అంతా క్రోడీకరించి వీర గున్నమ్మ చరిత్రను పుస్తకరూపంలో తెచ్చాను’’ అని ఆయన చెప్పారు. ఈ పుస్తకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆవిష్కరించారు.

“ఉత్తరాంధ్ర పోరాటాలకు, చైతన్యానికి పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో రైతుల కోసం ఒక మహిళ చేసిన ప్రాణ త్యాగం ముందు తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. రాజ్యాలు, వంశ ప్రతిష్ఠల కోసం దేశంలో పోరాటాలు చేసిన మహిళలున్నారు. కానీ రైతుల కోసం పోరాటం చేసి ప్రత్యక్ష పోరాటంలో ప్రాణాలొదిలిన వీర గున్నమ్మ వంటి మహిళలు అరుదు. వీర గున్నమ్మది కూడా స్వాతంత్ర్య పోరాటమే. అంతకంటే తక్కువగా దానిని చూడకూడదు” అని నల్లి ధర్మారావు బీబీసీతో చెప్పారు.

Post a Comment

0 Comments