ఏలియన్స్ పై అధ్యయనానికి నాసా శ్రీకారం
ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు?
24 మంది తత్వవేత్తల ఎంపిక
భిన్న రంగాలకు చెందిన వారి అభిప్రాయాలు సేకరించి రిపోర్టు
గ్రహాంతరవాసుల (ఏలియన్స్) కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏండ్లుగా వెతుకుతున్నారు.
అంగారక గ్రహం మీదకు రోవర్లు, విశ్వాంతరాళంలోకి ప్రోబ్‌లను పంపి అన్వేషిస్తున్నారు. విశ్వం పుట్టుకపై మరింత తెలుసుకొనేందుకు నాసా శనివారం జేమ్స్ వెబ్ టెలిస్కోపును కూడా అంతరిక్షంలోకి పంపించింది. శాస్త్రవేత్తల పరిశోధనలు ఫలించి ఏలియన్స్ నిజంగానే కనిపిస్తే మానవుల పరిస్థితి ఏంటి? వాళ్లు ఎలా స్పందిస్తారు? ఇన్నాళ్లుగా వాళ్లు పాటిస్తున్న విశ్వాసాలపై వారి అభిప్రాయం మారుతుందా? పురాణేతిహాసాలు, దేవుడి సృష్టి వంటి భావనలు ఎలా మారనున్నాయి? ఏలియన్స్ కాన్సెప్ట్‌ను ప్రజలకు ఎలా అర్థం చేయించాలి? ఏలియన్స్ ప్రభావం ఈ భూమిపై ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం నాసా ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రయోగాలతో పాటు మానవ ఆలోచన విధానం తెలుసుకొని విశ్లేషించేందుకు 24 మంది తత్వవేత్తలను/వివిధ మతాలకు చెందిన పండితులను ఎంపిక చేసింది. ఏలియన్స్ కనిపిస్తే.. మనుషులు ఎలా స్పందిస్తారు? తమ మత సంప్రదాయాలను బట్టి వారి ఆలోచనా విధానంలో తేడాలుంటాయా? తేడాలుంటే ఎలా? అన్నదానిపై అధ్యయనం చేయాలని కోరింది.
అధ్యయనానికి మిలియన్ డాలర్లు :
అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ థియోలాజికల్ ఇంక్వైరీ(సీటీఐ)లో ఈ అధ్యయనం నిర్వహించనున్నారు. దీనికి నాసా ఇప్పటికే రూ.8.29 కోట్లు(1.1 మిలియన్ డాలర్లు) కేటాయించింది. శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, స్కాలర్స్, సామాన్యులు ఇలా ఒక్కో రంగానికి చెందిన వారి అభిప్రాయాలపై వీరు అధ్యయనం చేసి నివేదికను తయారు చేస్తారు.
ఈ 24 మంది తత్వవేత్తల్లో రెవరండ్ ఆండ్రూ డేవిసన్ కూడా ఉన్నారు. ఆయన బయోకెమిస్ట్రీలో ఆక్స్‌ఫర్డ్ నుంచి డాక్టరేట్ పొందారు. ఏలియన్స్‌పై మానవుల స్పందన అనేది వారు పాటించే మత సంప్రదాయాలను బట్టి కచ్చితంగా మారుతుందన్నారు. కొన్ని మతాలు గ్రహాంతర వాసుల గురించి చెప్తున్నాయని, మరికొన్ని కాదని అన్నారు. అంతే కాకుండా నాస్తికుల ఆలోచనల్లో కూడా మార్పులు రావొచ్చని పేర్కొన్నారు. ఏలియన్స్‌ను కనిపెట్టడంలో మనం చాలా దగ్గరగా వచ్చామన్నారు.
0 Comments