GET MORE DETAILS

నేర స్మృతీ ఆయనదే...

  నేర స్మృతీ ఆయనదే...భారతదేశంలో ఆంగ్ల విద్యకు బీజం వేసింది మెకాలే. ఇది అందరికీ తెలిసిందే. ఆయన గురించి తెలియని విషయం మరొకటి ఉంది. అదేమిటంటే.. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)కి రూపకల్పన చేసిందీ ఆయనేనని... భారత ప్రథమ న్యాయ కమిషన్‌ అధ్యక్షుడి హోదాలో థామస్‌ బ్యాబింగ్టన్‌ మెకాలే రూపొందించిన ఆ ఐపీసీయే ఇప్పటికీ అమల్లో ఉంది. యూరోపియన్లు సహా ఎలాంటి జాతి భేదం లేకుండా, అన్ని ప్రాంతాల వారికీ ఒకే తరహా నిబంధనలు అమలు చేయడం కోసం ఏకరూప శిక్షా స్మృతి రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బయటకు చెప్పారు. కానీ, అంతరార్థం మాత్రం వలస పాలకులకు-ప్రజలకు మధ్య యజమాని-సేవకుడు అన్న సంబంధాన్ని సుస్థిరపరచడం. ఆ రోజులకు అది విప్లవాత్మక నిర్ణయంగా అనిపించినా, అంతర్లీనంగా తిరోగమన, దోపిడీదారీ స్వభావాన్ని సంతరించుకొంది.

బెంగాల్‌, బిహార్‌, ఒడిశా, మద్రాసు, బొంబాయి ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ వేళ్లూనుకుని పరిపాలన మొదలుపెట్టినప్పుడు అక్కడ ప్రధానంగా మహమ్మదీయ నేర శిక్షా స్మృతి అమలులో ఉండేది. అది హిందూ ముస్లింలు ఇద్దరికీ వర్తించేది. సివిల్‌ వివాదాలు, పెళ్లిళ్ల వంటి సాంఘిక ఆచారాలకు సంబంధించి మాత్రం హిందూ వ్యక్తిగత న్యాయసూత్రాలు అమలయ్యేవి. మను స్మృతి తదితర ధర్మ శాస్తాల్ర ఆధారంగా హిందువుల మధ్య వివాదాలను బ్రాహ్మణ న్యాయస్థానాలు పరిష్కరించేవి. ఒక హిందువు, ఒక ముస్లింకు మధ్య సివిల్‌ వివాదం ఏర్పడితే దాన్ని మహమ్మదీయ నేర శిక్షా స్మృతి కిందే పరిష్కరించేవారు. హత్యలు, దోపిడీల వంటి తీవ్ర నేరాలకు ప్రతీకార వధలు, అంగవిచ్ఛేదనలు, కొరడా దెబ్బల వంటి కఠిన శిక్షలు విధించేవారు. చాలా సందర్భాల్లో నిబంధనలు అంటూ ఏమీ లేకుండా గ్రామ పెద్దల నిర్ణయాల మేరకే శిక్షలు ఉండేవి. ప్రాంతానికొక రకంగా శిక్షలు ఉండడం ఆంగ్లేయులకు ఇబ్బందికరంగా మారడంతో దేశమంతటికీ ఒకే తరహా శిక్షా స్మృతి ఉండాలన్న ఆలోచనకు మొగ్గ తొడిగింది.

మొదటి భారత న్యాయ కమిషన్‌ అధ్యక్షుని హోదాలో మెకాలే 1834లో భారత శిక్షా స్మృతి (ఐపీసీ) ముసాయిదాను రూపొందించారు. అందులో నెపోలియన్‌ స్మృతి, 1825 నాటి లూసియానా పౌర స్మృతిలోని అంశాలు కొన్నింటిని చేర్చారు. ఐపీసీ మొదటి ముసాయిదాను 1837లో గవర్నర్‌ జనరల్‌కు నివేదించారు. మతపరమైన మధ్యయుగాల శిక్షలను తొలగించారు. అసలు తన శిక్షాస్మృతి హిందూ ముస్లింలకే కాదు, భారతీయులు, తెల్లజాతి యూరోపియన్లకు కూడా సమానంగా వర్తించాలని తొలుత మెకాలే ఉద్దేశించారు. అది ఆంగ్లేయుల ఆగ్రహాన్ని చవిచూసింది. ఫలితంగా ఐపీసీ ముసాయిదా ఆమోదం పొంది చట్టరూపంలోకి రావడానికి రెండున్నర దశాబ్దాలు ఆలస్యమైంది. తరువాత అది పలు సవరణలకులోనై 1860లో ఆమోదం పొంది, 1862 జనవరి 1 నుంచి చట్టరూపంలో అమలులోకి వచ్చింది. ఆలోపు 1853లో రెండో న్యాయ కమిషన్‌ రంగప్రవేశం చేసినా మెకాలే రచించిన ముసాయిదాయే కీలకంగా మారింది. 1861 నాటి భారత నేర శిక్షా స్మృతి (సీఆర్పీసీ), సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీపీసీ), భారత సాక్ష్యాధారాల చట్టం రూపకల్పనలోనూ ఆయన ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ‘రాజద్రోహం’, ‘దైవదూషణ’, ‘నేరపూరిత కుట్ర’ అనే పదాలు ఆయన సృష్టించినవే. ఉద్దేశాలు ఏవైనప్పటికీ స్వాతంత్య్రానికి ముందు, తరువాత కూడా భారతదేశంలో ఇంతగా న్యాయ సంస్కరణలను ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు లేరు. అన్నట్టు మెకాలే ఆజన్మ బ్రహ్మచారి. ఆయనకు సంతానం లేకపోయినా మెకాలే తెచ్చిన చట్టాలే ఆయన పిల్లలని చెప్పుకోవాలి.

Post a Comment

0 Comments