శివాలయానికి సేవ చేయడం వలన కలిగే విశేష ఫలితాలు
శివాలయం రోజూగానీ, వారానికోసారి కానీ, ఏదైనా పండుగలు, ఉత్సవాలు జరిగే సమయంలో ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వచ్చేస్తాం. ఏవైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకుంటాం. అక్కడ విశేషమైన ఆర్జిత సేవలు జరిపించుకుంటాం.
అవకాశాన్ని బట్టి అక్కడి ఇతర ఆలయాలను, సందర్శనీయ స్థలాలను దర్శిస్తాం. క్షేత్రంలో నిద్రచేస్తాం. అంతవరకే చాలా మందికి తెలిసిన విషయం.
భక్తులకు తెలియాల్సిన మరో విషయం ఏంటంటే ఆలయంలో ఎన్నో సేవలను మనం స్వచ్ఛందంగా నిర్వహించవచ్చు. అలా చేస్తే కలిగే ఫలితం చాలా విశేషంగా చెప్పబడింది.
శివాలయం నిర్మాణం చేస్తే, నిర్వహణ చేస్తే, పునరుద్ధరణ చేస్తే ఎంతైతే ఫలితం ఉంటుందో దానితో సమానమైన ఫలితాలు శివాలయ సేవ ద్వారా పొందవచ్చని శివధర్మశాస్త్రంలో వివరించబడింది.
దర్శిస్తే చాలు...
దూరతః శిఖరం దృష్ట్వా నమస్కుర్యాచ్ఛివాలయమ్ |
సప్తజన్మకృతం పాపం క్షిప్రమేవ వినశ్యతి ||
దూరం నుండి ఆలయశిఖరాన్ని దర్శించిన వెంటనే నమస్కరించాలి. అలా చేస్తే ఏడుజన్మలలో తాను చేసిన పాపాలనుండి వెంటనే విముక్తుడౌతాడు.
పరిశుభ్రం చేస్తే...
పశ్యన్ పరిహరన్ జంతూన్ మార్జన్యా మృదుసూక్ష్మయా |
శనైస్సమ్మార్జనం కుర్యాత్ చాంద్రాయణఫలం లభేత్ ||
శివాలయానికి వెళ్లిన భక్తులు అక్కడ ఏవైనా ప్రాణులు, పశువులు తిరుగుతుంటే వాటిని హింసించకుండా బయటకు పంపి మెత్తటి మార్జని (చీపురు)తో ఆలయాన్ని తుడిచి పరిశుభ్రం చేస్తే చాంద్రాయణ వ్రతం ఆచరించిన ఫలితం కలుగుతుంది.
ఆవు పేడతో అలికితే...
ఆవు పేడతో ఆలయాన్ని శుభ్రంగా అలికితే కూడా ఎంతో ఫలితం ఉందని చెప్పబడుతోంది.
ఆ ఆవు పేడను మంచి ఆవుల నుండి సేకరించాలి. తన ఇంటినుంచి తీసుకురావాలి. లేదా పవిత్రమైన చోటునుండి తేవచ్చు.
ఆ గోమయాన్ని కూడా పైభాగం, కిందభాగం వదిలి మధ్యలో శుద్ధం, మలినం కాని ఆవుపేడనే తీసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగింది.
అలాంటి గోమయంతో శివాలయ పరిసర ప్రాంతాన్ని చక్కగా అలికితే తమ పూర్వీకులు తరించి గోలోకం చేరుకుంటారు. అంతేకాక అలా చేస్తే సిరిసంపదలతో తులతూగుతారు.
నీటితో శుభ్రపరిస్తే....
యః కుర్యాత్ సర్వకార్యాణి వస్త్రపూతేన వారిణా |
స ముని స్స మహాసాధు స్స యోగీ స శివం ప్రజేత్ ||
వస్త్రంతో వడగట్టిన నీటితో ఆలయాన్ని పరిశుభ్రం చేసినవారు సజ్జనులు. అతడు యోగియై శివుని చేరుకుంటాడు.
అలాగే శివాలయం నేలను అద్దంలా.. అంటే నేలవైపు చూస్తే, తన ప్రతిబింబం కనపడేలా తుడిచినా ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది.
పూలతో అలంకరిస్తే...
యావద్ధస్తా భవే ద్భూమిః సమన్తా దుపశోభితా
తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే
శివాలయాన్ని రకరకాల పుష్పాలతో అలంకరించినా, అందంగా తీర్చిదిద్దినా ఎంత ప్రదేశం తీర్చిదిద్దాడో దాన్ని అంగుళాలతో కొలిచి అంతకాలం రుద్రలోకంలో నివసిస్తారని చెప్పబడుతోంది. పుష్పవనాలను పాదుగొల్పినా శివలోకం చేరతాడు.
శివరూపాలను చిత్రిస్తే....
యావంతి రుద్రరూపాణి స్వరూపాణ్యపి లేఖయేత్ |
తావద్యుగసహస్రాణి రుద్రలోకే మహీయతే ||
చిత్రకారులను రప్పించి వారితో శివాలయంలో వేదపురాణాలలో పేర్కొనబడిన శివుని అవతారాలు, లీలలకు సంబంధించిన చిత్రాలు వేయించాలి. అలా ఎన్ని బొమ్మలు చిత్రిస్తారో అంతకాలం రుద్రకాలంలో గొప్పగా ప్రకాశిస్తారు.
వెల్ల వేయిస్తే...
సుధావిలిప్తం యః కుర్యాత్ సర్వయత్నైశ్శివాలయమ్ |
తావత్పుణ్యం భవేత్ సోపి యావదాయతనే కృతే ||
శివాలయానికి, ప్రాకారం గోడలకు సుధాకర్మ (సున్నం పూయించడం) చేయించినవారికి ఆలయనిర్మాణం చేసిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది.
అలాగే ప్రతి సంవత్సరం విడువకుండా, పాలవంటి తెల్లసున్నంతో లేదా వేరే రంగులతో అందంగా వెల్లవేయించినా అతడికి శివలోకవాసపుణ్యం లభిస్తుంది.
అలాగే ఆలయంలోని గోడలకు సుగంధాలు పూయడం, గుగ్గిలంతో ధూపం వేయడం, చక్కగా రంగురంగుల ముగ్గులు పెట్టడం, పూలతోటలను బాగుచేయడం, ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తీసివేయడం, దీపాలకు కావాల్సిన వత్తులను సిద్ధం చేయడం, తోటి భక్తులకు సాయం చేయడం, ఆలయంలో భక్తులకు మంచినీరు ఇవ్వడం, ప్రసాదవితరణ ఇలా ఎన్నో సేవలను భక్తులు ఆచరించవచ్చు.
ఈ అవకాశం మనం గ్రామాల్లో ఉండే ఎన్నో ఆలయాల్లో మనం నిర్వహించుకుంటే ప్రతీ దేవాలయం దివ్యమైన భవ్యమైన శోభతో అలరారుతుంది. భక్తులకూ కల్పవృక్షమై నిలుస్తుంది.
0 Comments