GET MORE DETAILS

భీష్మ ఏకాదశి - భౌమి ఏకాదశి - జయ ఏకాదశి

 భీష్మ ఏకాదశి - భౌమి ఏకాదశి - జయ ఏకాదశి



మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి. భీష్మఏకాదశినే భౌమి ఏకాదశి, జయ ఏకాదశి అని కూడా అంటారు. 

◆ ఈ రోజు కురు పితామహుని స్మరిస్తూ తర్పణం ఇవ్వడం సంప్రదాయం. భీష్మ ఏకాదశి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుందని విశ్వాసం.

◆ భీష్ముడు కురుక్షేత్రంలో తనువు చాలించే సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉద్బోధించిన పరమ పవిత్రమైన తిథి ఈ ఏకాదశి. 

◆ ఈ రోజు శ్రీమహావిష్ణువును పూజించిన వారికి స్వర్గప్రాప్తి కలుగునని విశ్వాసం. భీష్ముడు పరమపదం కోరిన మాఘ శుద్ధ అష్టమిని భీష్మాష్టమి’ గాను, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను, మానవాళి స్మరించడమే మనం ఆ పితామహునికి ఇచ్చే అశ్రుతర్పణం.

◆ తన తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాలకోసం, స్వసుఖాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి, ‘నా జీవితంలో వనితకు, వివాహానికి తావులేదు’ అని సత్యవతికి వాగ్దానం చేసి, భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే ఆయన భీష్ముడయ్యాడు.

◆ భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా, ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకూ వేచి ఉన్నాడు. 

◆ ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున, తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. అలాంటి భీష్ముని కొలిచేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాము.

భగవద్గీతను శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు కానీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. 

◆ భీష్మ ఏకాదశి అని పిలువబడే ఈ రోజున భీష్మాచార్యుని తలుచుకుంటే పితృదేవతలకు స్వర్గ ప్రాప్తి చేకూరుతుంది. అంతేగాకుండా ఆ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని వినే వారికి మోక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

◆ దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది, అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమేది దేనిని జపించుటవలన మనిషి సంసారబంధములనుండి విముక్తి పొందుతాడు అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు భీష్ముడు జవాబు చెపుతూ, జగత్ ప్రభుం, దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ 

‘అనాది నిధానం విష్ణుం, సర్వలోక మహేశ్వరం, లోకాధ్యక్షం స్తువన్నిత్యం, సర్వదుఃఖాతి గో భవేత్. 

◆ ఆది అంతము లేని, సర్వవ్యాపి అయిన, దేవదేవుడైన, భగవంతుడైన విష్ణుస్తుతి వల్ల సర్వదుఃఖాలు తొలగుతవి అని ఇంకా చెబుతూ ఏషమే సర్వధర్మానాం ధర్మాదిక తమో మతః ఇదియే అన్ని ధర్మములోకి ఉత్తమ ధర్మమని నా మాట అంటాడు.

◆ భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్నా ఆయన ప్రవచించిన ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే వుంది. ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన భీష్మాచార్యునికి తిలాంజలులు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిద్దాం.

Post a Comment

0 Comments