GET MORE DETAILS

సుందరకాండ...! అది ఓ మానసిక విశ్లేషణా శాస్త్రం!

 సుందరకాండ...! అది ఓ మానసిక విశ్లేషణా శాస్త్రం!"బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా 

అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్"

అసలు పూర్తిగా రామాయణమే ఒక సంపూర్ణ మానసిక శాస్త్రం. అందునా సుందరకాండ బహు సుందరంగా మానసిక సంఘర్షణను చూపించి విజయానికి ఎలా పయనమవ్వాలో నిరూపిస్తుంది. అసలు రామాయణమే ఒక జీవి ఆధ్యాత్మిక జీవితానికి దర్పణం. అయోధ్యలో ప్రజలు ఎంత గొప్పవారో వివరిస్తారు. ధర్మం గురించి చెబుతారు. 

అదే లంకలో నగరం ఎంత సుందరమో చెబుతారు. ఇక్కడ భౌతిక౦గా ఎంత ఉన్నతంగా ఈనగరం వుందో విశ్లేషణ చేస్తే అయోధ్యలో ధార్మికత, ఆధ్యాత్మికత గురించి చెబుతారు వాల్మీకి మహర్షి.  దశరధుడు అన్నదే పంచకోశ పాంచ భౌతిక శరీరం, అతడి ముగ్గురు భార్యలే ఆజీవికి సంబంధిత ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలతో యజ్ఞం చేసి ధర్మార్ధకామమొక్షాలనే చతుర్విధపురుషార్థాలు సాధించడం! అదే లంకలో రజో గుణ దశకంఠ రావణుడు, తమోగుణ కుంభకర్ణుని మట్టుబెట్టి సత్త్వ గుణవిభీషణుని నిలబెట్టడం. 

మన మనస్సులో ఆలోచనలే ఒక పెద్ద వానర సమూహం, దాన్ని నియంత్రించి కామం దాచిన జీవాత్మను పరమాత్మకు చేర్చడమే లంకా పయన, రావణ సంహార ఘట్టం. నూరు యోజనాలు దాటడానికి తనకున్న బలం మీద నమ్మకం లేకపోతే జాంబవంతుడు అతడికి తన బలం గురించి తెలియ చేస్తే రివ్వున లంకకు పయనమయ్యాడు పవనసుతుడు. ఆయన ఎన్నో చోట్ల తల్లి సీతమ్మ  కోసం వెతుకుతాడు. చూడరాని ఎన్నో సన్నివేశాలను చూసాడు. కానీ తనకు మానసిక దౌర్భాల్యం, లౌక్యం లేదని సమాధానపడి సీతమ్మ కోసం వెతుకుతూ తిరుగుతుంటాడు స్వామి హనుమ. 

ఎంత వెదకినా తల్లి కనబడక ఎంతో నిరాశకు గురవుతాడు. అసలు తల్లి దొరకకపోతే తాను అక్కడే వుండి తపస్సు చేసుకుందామని, లేదా ప్రాయోపవేశం చేసి తనువు చాలిద్దామని ఎన్నో ఆలోచనలు. అందునా కొన్ని కొన్ని సందర్భాలలో ఎంతో నిస్పృహకు గురయ్యి సాక్షాత్తు హనుమంతుల వారే ఆత్మహత్య గురించి ఆలోచిస్తారు. దాని నుండి ఎలా బయటపడాలో ఆయన ద్వారా చూపెడతారు వాల్మీకి. ఎక్కడికక్కడ సమాధాన పరుచుకుంటూ ముందుకు కదులుతాడు. జీవించి వుంటే ఎప్పటికైనా విజయం సాధ్యం అవుతుందని హనుమంతుని ఆలోచన ద్వారా మనకు సందేశం ఇస్తాడు మహర్షి. 

ఒకానొక సమయంలో ఈ రాక్షసులు సీతమ్మను తినేసారా అని భీతిల్లి తానక్కడ నిరాహారంగా నిర్వాణం పొందుదామని ఆలోచిస్తాడు. ఇంతలో వివేకం తొంగి చూసి అసలు దీనికి కారణం అయిన రావణుని చంపి పాతరేద్దామని, లేదా కట్టి తీసుకెళ్ళి రాముని ముందు పడేద్దామని మరల రోమాంచితుడవుతాడు. 

చివరకు హనుమంతునికి సీతమ్మ దర్శనం అవుతుంది. ఎంత గొప్పవారికైనా క్లేశాలు తప్పవు, అసలు సీతమ్మే ఇటువంటి స్థితికి వచ్చిందంటే కాలం ఎంత బలీయమైనదో  అని అనుకుంటాడు. 

ఇక్కడ ఒక కార్యం సాధించవలసి వచ్చినప్పుడు మనకు కూడా ఎదురయ్యే సంగతులే. ఎంతో ప్రయత్నం చేసినా కొన్ని సార్లు ఎక్కడా కూడా మనం ఆ ఫలితం కనబడడం లేదని డీలా పడిపోతాము. మరికొంత ప్రయత్నం చేస్తే సాధించవచ్చు అన్న ధైర్యాన్ని కోల్పోతాము. మనవంటి వారికి ధైర్యం చెప్పడానికి అతి బలవంతుడైన హనుమంతునే ఎదురుగా పెట్టి మనకు పాఠం నేర్పుతారు. ఎన్నటికీ ధైర్యం కోల్పోకూడదని, సమయం ఆసన్నమైనప్పుడు, మన ప్రయత్న లోపం ఏమీ లేనప్పుడు తప్పక మనకు ఫలితం దక్కుతుంది. మన వాంగ్మయం మనకు ధైర్యాన్నే నేర్పుతుంది. 

స్వామీ వివేకానందుల వారు అన్నట్టు మన వేదం మొత్తం కేవలం ధైర్యం, సంకల్ప బలం గురించి మాత్రమె చెబుతుంది. దైవం మీద భారం వేసి త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నిస్తే తప్పక విజయం సాధిస్తాం. ఎప్పుడైనా కొంత మనకు నమ్మకం సన్నగిల్లినప్పుడు, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం రానప్పుడు పెద్దలు సుందరకాండ పారాయణం చెయ్యమంటారు. 

ఆ పారాయణం వలన ఆ మంత్రరాజ ఫలితంగా ఆధిదైవిక అడ్డంకులు ఏమున్నాయో అవి తొలగిపోతాయి. ఆ ఘట్టాలు మనం పూర్తిగా చదవడం వలన తత్త్వం బోధ పడి, మనమీద మనకు నమ్మకం కుదిరి మన ప్రయత్నాలను మరింత జాగ్రత్తగా పదును పెట్టి ముందుకు వెళ్లి విజయాన్ని సాధించగలుగుతాము.

Post a Comment

0 Comments