శాంతిని , సుఖాన్ని పొందాలంటే ఈ నాలుగు సూత్రాలను పాటించాలి...!
1. సమస్తకోరికలను, వాటి మీద ఆసక్తి ని వదిలిపెట్టాలి.
2. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాలను మనసులోకి రానీయకూడదు.
3.నేను, నాది అనే అహంకారము వదిలిపెట్టాలి.
4. నా వాళ్లు, నా ధనం, నా ఆస్తి అనే మమకారములు వదిలిపెట్టాలి.
అంటే దీని అర్థం ఏ కోరికా లేకుండా మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. ఏ ఒక్క కోరిక ఉన్నా అది మనసును అల్లకల్లోలం చేస్తుంది. నేను ఆత్మస్వరూపుడను. నేను ఈ శరీరం కాదు అనే భావనతో ఉండాలి. ఈ శరీరమే తనది కానపుడు శరీర సంబంధమైన కోరికలకు ఎందుకు బానిస కావాలి అనే భావన కలిగి ఉండాలి. అటువంటి వాడిని ఏ సమస్య బాధించదు. నిశ్చలంగా ఉంటాడు.
స్థితప్రజ్ఞుడు ఎన్ని భోగముల మధ్య ఉన్నప్పటికినీ, ఆ భోగములు ప్రాపంచిక విషయములు విషయభోగములు ఆయనమీద ఎటువంటి ప్రభావమును చూపలేవు. పైగా ఆ విషయము లన్నీ నదులు సముద్రములో కలిసినట్టు ఆయనలో లీనం అయిపోతాయి. తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఆయన మాత్రము నిశ్చలంగా ఉంటాడు. వరమ శాంతిని పొందుతాడు. కాని భోగముల మీద, ప్రాపంచిక విషయముల మీద విపరీతమైన ఆసక్తి కలవారు అటువంటి శాంతిని పొందలేరు. నిరంతరము అశాంతిలో సతమతమౌతుంటారు. దు:ఖములో మునిగితేలుతుంటారు అని తెలుసుకున్నాము. ఈ శ్లోకంలో కూడా అదే విషయాన్ని మరలా చెబుతున్నాడు. శాంతి పొందాలంటే కావాల్సిన అర్హతలను మరలా చెబుతున్నాడు. కోరికలను వదిలిపెట్టడం, ప్రాపంచిక విషయముల మీద ఆసక్తిలేకుండా ఉండటం, మమత, అహంకారము వదిలిపెట్టడం. అహంకారము అంటే ఈ దేహమే నేను అనే భావన. ఈ దేహముతో నేనుసుఖాలు అనుభవిస్తాను. అనుభవించడానికి నాకు సుఖాలు కావాలి. అనే భావన కలిగిఉండటం. ఆ భావనే అహంకారము. దానిని వదిలిపెట్టాలి. ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకపోవడం. ఇటువంటి గుణములు కలిగిన పురుషుడు. పరమ శాంతిని పొందుతాడు అని మరలా ఘంటా పథంగా చెప్పాడు భగవానుడు.
0 Comments