GET MORE DETAILS

ప్రదోష కాలంలో శివ పూజ

 ప్రదోష కాలంలో శివ పూజ



శివపూజలో ప్రదోషకాలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఇంతకీ ఈ ప్రదోషకాలం అంటే ఏమిటి? ఆ సమయంలో ఏం చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది? తెలుసుకుందాం రండి! 

ఫలానా సమయం ప్రదోషకాలం అని చెప్పేందుకు స్పష్టమైన నిబంధనలు లేవు. వేర్వేరు ప్రాంతాల బట్టి, సంప్రదాయాల బట్టి ఈ కాలాన్ని నిర్వచిస్తూ ఉంటారు. కొంతమంది సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాలు ప్రదోషకాలంగా పేర్కొంటారు. మరికొందరు సూర్యాస్తమయానికి ముందు 24 నిమిషాలు, తర్వాత 24 నిమిషాలు ప్రదోషకాలమని భావిస్తారు. మరో లెక్క ప్రకారం సూర్యాస్తమయం ముందు గంటసేపు, తర్వాత గంటసేపు ప్రదోషం. వీటిలో దేన్ని పాటించాలనే సందేహం అవసరం లేదు. ఎందుకంటే వీటన్నింటిలోనూ సూర్యాస్తమయమే కీలకం కాబట్టి… ఆ సమయాన్ని ప్రదోషంగా భావిస్తే సరి! 

ప్రదోషకాలంలో సకలదేవతలంతా కైలాసానికి చేరుకుంటారనీ, ఆ సమయంలో స్వామి అర్ధనారీశ్వర రూపంలో తాండవం చేస్తూ ఉంటారని నమ్మకం. ఇది ప్రమథగణాలు లోకాలను చుట్టే సమయంగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ సమయంలో కనుక ఈశ్వరుని సేవిస్తే… ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందన్నది పెద్దల మాట. ఇందుకు స్త్రీపురుషుల బేధం లేదు, కులాల పట్టింపూ లేదు. 

ఎవరైనా సరే, ఈ సమయంలో పూజగదిలో స్వామి ముందు కూర్చుని ఆయనకు ఇష్టమైన రుద్రం చదువుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ రుద్రం నేర్చుకోని పక్షంలో… అందుకు సమానమైన శివపంచాక్షరి వంటి స్తోత్రాలు లేదా మహామృత్యుంజయం వంటి మంత్రాలు చదువుకున్నా స్వామి అనుగ్రహం లభిస్తుంది. రోజూ ప్రదోషకాలంలో నిష్టగా శివారాధన చేసే ఇంట్లో దారిద్ర్యం ఉండదనీ, అనారోగ్యం దరిచేరదనీ, ఎలాంటి సమస్యలైనా ఇట్టే తీరిపోతాయనీ నమ్మకం. ఈ సమయంలో అర్ధనారీశ్వర స్తోత్రం కనుక చదువుకుంటే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుందనీ, కుటుంబ కలహాలు సమసిపోతాయనీ చెబుతారు. 

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని సామెత. అలాంటి లయకారుడైన పరమేశ్వరుని అనుగ్రహాన్ని సాధించేందుకు ప్రదోషకాల పూజ ఓ అద్భుతమైన అవకాశం. ఈ సమయంలో సకల శాస్త్ర పారంగతుడు అయిన నందీశ్వరుని పూజిస్తే, ఆయన అనుగ్రహంతో చదువులోను, కళలలోనూ రాణిస్తారని చెబుతారు. 

ప్రదోషం వచ్చే రోజు, తిథిని బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి. రోజూ వచ్చే ప్రదోషాన్ని నిత్యప్రదోషం అనీ, త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అనీ, ఆ త్రయోదశి ఆదివారం పూట వస్తే రవిప్రదోషం అనీ… ఇలా వేర్వేరు ఆచారాలు, వాటికి ప్రత్యేక విధులు ఉన్నాయి. వీటన్నింటినీ పాటించడం సాధ్యం కాకపోయినా… ప్రతిరోజూ ఆ ప్రదోషకాలంలో ఆ శివుని తల్చుకుని, ఆయన ముందు ఓ దీపాన్ని వెలిగించి, అనుగ్రహించమంటూ ఓ ఇష్టమైన స్తోత్రం కానీ మంత్రం కానీ జపిస్తే తప్పకుండా స్వామి కరుణతో వీక్షిస్తారు. ప్రదోషం అంటేనే పాపాలను తొలగించేది అని అర్థమట. ప్రదోషకాలంలో చేసే పూజతో చేసిన పాపాలన్నీ నశించిపోవడమే కాదు, మనసులోని కోరికలన్నీ సిద్ధిస్తాయి. సుఖశాంతులు లభిస్తాయి.

Post a Comment

0 Comments