ఇంట్లో వేప చెట్టు ఉండటం మంచిదేనా?.. వాస్తు చెప్పే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
చాలా మంది తమ ఇంటి వద్ద వేప చెట్టును పెంచుకుంటారు. కానీ వాస్తు ప్రకారం వేప చెట్టు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనే విషయాలను తెలుసుకోవాలి. ఇంట్లో లేదా ఇంటి చుట్టూ చాలా చెట్లు లేదా మొక్కలు పెంచుకుంటాం. ఇవి మనకు స్వచ్ఛమైన గాలిని అందించడమే కాకుండా, ఇంటి వాతావరణాన్ని కూడా చల్లగా, ఆహ్లాదంగా ఉంచుతాయి. ముఖ్యంగా వేప చెట్టును చాలా మంది పవిత్రంగా భావిస్తారు. వేప ఆకులు, వేప పండ్లు, తొక్క ఇలా ప్రతి ఒక్కటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని తెలిసిందే. అందుకే చాలా మంది తమ ఇంటి వద్ద వేప చెట్టును పెంచుకుంటారు.
కానీ వాస్తు ప్రకారం వేప చెట్టు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అనే విషయాలను తెలుసుకోవాలి. వాస్తు నిపుణుల మాట ప్రకారం, వేప చెట్టు ఇంటికి దగ్గరగా ఉండొచ్చు కానీ అది సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా వేప చెట్టు ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి అడ్డుకుపోతుందని చెబుతారు. దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు, మనస్పర్థలు పెరుగుతాయని నమ్మకం ఉంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశముందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
ఇంకా ముఖ్యంగా దక్షిణ లేదా నైరుతి దిశలో వేప చెట్టు ఉండటం మంచిది కాదని అంటారు. ఈ దిశల్లో వేప చెట్టు ఉంటే, దాని నీడ ఎక్కువగా ఇంటిపై పడుతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నీడ నేరుగా ఇంటిమీద పడితే ఛాయా దోషం ఏర్పడుతుందని నిపుణులు చెబుతారు. ఛాయా దోషం వల్ల ఇంట్లో నివసించే వారికి ఆరోగ్య సమస్యలు రావడం, మనసు ప్రశాంతంగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని నమ్మకం ఉంది. వాస్తు ప్రకారం వేప చెట్టుకు సరైన దిశ తూర్పు లేదా ఉత్తర దిశ. ఈ దిశల్లో వేప చెట్టు ఉంటే, ఇంటికి మంచి గాలి, మంచి శక్తి వస్తుందని చెబుతారు.
అంతేకాదు, వేప చెట్టు వేర్లు ఇంటి పునాదిని తాకకుండా ఉండాలి. వేర్లు గోడల దగ్గరకి లేదా పునాదిలోకి వెళ్లిపోతే, భవిష్యత్తులో నిర్మాణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇది వాస్తు పరంగా కూడా మంచిది కాదని భావిస్తారు. వేప చెట్టు చాలా పెద్దగా పెరుగుతుంది కాబట్టి, ఇంటికి చాలా దగ్గరగా కాకుండా కొంత దూరంలో ఉండేలా చూసుకోవాలి. అలా ఉంటే చెట్టు వల్ల ఎలాంటి సమస్యలు లేకుండా, మంచి లాభాలు మాత్రమే పొందవచ్చు. వేప ఆకుల వల్ల వాతావరణం శుభ్రంగా ఉండటం, దోమలు తగ్గడం, గాలి స్వచ్ఛంగా మారడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి.
మొత్తానికి వేప చెట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిదే. కానీ వాస్తు నియమాలను పాటిస్తూ సరైన దిశలో, సరైన దూరంలో పెంచుకుంటేనే ఇంటికి శుభఫలితాలు వస్తాయి. లేకపోతే తెలియకుండా కొన్ని వాస్తు దోషాలు ఏర్పడి కుటుంబ జీవితంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే చెట్లు నాటేటప్పుడు అందం మాత్రమే కాకుండా వాస్తు కూడా గుర్తుంచుకోవడం మంచిది.
.jpeg)
0 Comments