ఉన్నత వ్యక్తిత్వం కోసం అసూయ, ద్వేషాలను విడనాడాలి.
● ప్రతి వ్యక్తీ గొప్పవాడు కావాలని కలలు కంటుంటాడు. ఇది సహజం. కానీ, అందరికన్నా గొప్పవాడు కావాలని కొందరు ఆరాటపడతారు. అలా కావటానికి చేతనైన అన్ని రకాల విధానాలూ అనుసరిస్తారు. అడ్డదారులు తొక్కుతారు. అవినీతికి సిద్ధపడతారు. అనాయాసంగా, నిస్సంకోచంగా అబద్ధాలు ఆడతారు.
● కొందరు విశేషంగా ధనం సంపాదించి, తాము గొప్పవారమనే భ్రమతో గర్విస్తారు. మరికొందరు హోదా లభించగానే అధికార దర్పం, అహంకారం ప్రదర్శిస్తారు. ఇది కూడా ఆధిక్యతాభావం వల్లనే !
● కొందరు తమకంటే అందరూ తక్కువ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటారు. తమకన్నా ఎవరు మించిపోతున్నా భరించలేరు. ‘అసూయ’తో కుమిలిపోతారు. వారిమీద కక్షగా ఉంటారు. అవకాశం లభిస్తే, ఏదో విధంగా, తమకన్నా అధికులకు అపకారం చేస్తారు. వారికి కష్టనష్టాలు కలిగినప్పుడు, లోలోపల సంతోషపడుతూ, పైకి కపట సానుభూతి ప్రకటిస్తారు.
● దుర్యోధనుడికి సుయోధనుడు అనే మరొక పేరు ఉంది. నిజానికి అతడు అసూయాధనుడు. పాండవుల ఔన్నత్యాన్ని, ఆధిక్యతను సహించలేక పోతుండేవాడు. బాల్యం నుంచే పాండవుల పట్ల అసూయ, ద్వేషం కలిగి ఉండేవాడు.*
● ’అసూయ’ అగ్ని వంటిది. ‘ద్వేషమూ’ అంతే..!
● ఏ కర్ర నిప్పు ఆ కర్రనే కాల్చినట్టు, ఎవరు అసూయాపరులో, వారినే అసూయాద్వేషాలు దహిస్తాయి. ఇది నిత్య సత్యం.
● 'స్పర్ధయా వర్ధతే విద్య'- చదువులో అసూయ తప్పులేదు. కానీ, అది ద్వేషపూరితంగా ఉండకూడదు. పోటీతత్వంతో, పట్టుదలగా విద్య నేర్వాలి. వాయిదాలు వేయకుండా విద్యాకృషి చెయ్యాలి. 'రేపు చదవొచ్చు' అని బద్ధకిస్తే, చివరికది పరీక్షల సమయం దాకా ఆచరణగా మారదు! అప్పుడు ఆందోళన, ఆవేదన పడుతూ ఆరోగ్యభంగం చేసుకోవాల్సి ఉంటుంది. కొందరు నిరాశా నిస్పృహలకు లోనై ఆత్మహత్యకు పాల్పడతారు. ఇవన్నీ చేయకూడని పనులే.
'కృషితో నాస్తి దుర్భిక్షం'- నిరంతర కృషి ఒక్కటే విజయ ద్వారాలకు తాళపు చెవి. మరే అడ్డదారులూ ఉండవు.
● సత్కార్యాలకు… ‘ఆలోచన- ఆచరణ’ మధ్య ఆలస్యం ఉండకూడదు.
● కర్ణుడు ఎడం చేత్తో బంగారు పాత్రను దానం చేయటానికి గల కారణం చెబుతూ- 'చెయ్యి మార్చుకునే లోగా మనసు మారిపోవచ్చు' అనటం అందరికీ ఆదర్శం.
● ప్రజాసేవ చేస్తామనేవారికన్నా, చేస్తున్నవారినే ప్రజలు నమ్ముతారు.
● భక్తిని బోధించేవారిని కాకుండా, భక్తిగా జీవించేవారినే భగవంతుడు సైతం ఇష్టపడతాడు. అసూయ లేకపోవటం ఎంత గొప్పదంటే- అసూయలేని ఏకైక మహిళగా, అత్రి మహర్షి అర్ధాంగిగా వినుతికెక్కిన అనసూయా దేవి పుత్రుడిగా జన్మించటానికి, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు ఇష్టపడ్డాడు.
● అసూయలేని హృదయం పరిశుద్ధ దేవాలయం. అసూయ లేదంటే, ప్రేమకు నిలయమని అర్థం.
● ప్రేమ పున్నమి వెన్నెల వంటిది. అందర్నీ ఆకట్టుకొంటుంది. భగవంతుని కూడా ప్రసన్నుణ్ని చేస్తుంది. అసూయ లేనివారికి ద్వేషం ఉండదు. శత్రువులూ ఉండరు.
● ఉన్నత వ్యక్తిత్వం కేవలం అసూయా రహితులకే సాధ్యం. మనం మన దేహంలోని రోగాల నుంచి విముక్తి పొందటానికి తహతహలాడతాం.*
● అసూయ నుంచి విముక్తి పొందటానిక్కూడా తహతహలాడాలి. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జీవితం సాధ్యపడుతుంది.
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
లోకా సమస్తా సుఖినోభవన్తు!
0 Comments