ఉద్యోగుల సర్దుబాటు - కొత్త జిల్లాల్లో కేటాయింపులపై యంత్రాంగం కసరత్తు
కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రభుత్వశాఖల పరిధిలోని ఉద్యోగులను మూడు జిల్లాలకు కేటాయించే విధంగా విభాగాధిపతులు తుది కసరత్తు చేస్తున్నారు. మంజూరైన పోస్టులు వారీగా మూడు జిల్లాలకు కేటాయిస్తున్నారు. ఇందులో కొన్నిశాఖలు జనాభా ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. కొన్ని విభాగాలు విస్తీర్ణం పరంగా ఉద్యోగులను సర్దుబాటు చేస్తున్నాయి. వ్యవసాయశాఖలో గ్రామస్థాయిలో ఉన్న ఆర్బీకేల సంఖ్య ఆధారంగా ఆయా జిల్లాలకు ఉద్యోగులను కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లాకు సంయుక్త సంచాలకుల(జేడీ) హోదాలో జిల్లా అధికారి పని చేస్తున్నారు. పాత జిల్లాకు జేడీ క్యాడర్ అధికారిని కొనసాగిస్తూ కొత్త జిల్లాల్లో డీడీఏ స్థాయి అధికారులను జిల్లా వ్యవసాయాధికారి హోదాలో నియమిస్తారు. అదేవిధంగా ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖలోనూ గ్రామస్థాయి నుంచి ఉద్యోగుల విభజన చేయనున్నారు. బాపట్ల, చీరాల కేంద్రంగా రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటుచేయాలి. కొన్ని శాఖల్లో నాలుగైదు మండలాలకు ఒక అధికారి ఉన్నందున వారిని ఎలా కేటాయింపులు చేయాలన్న అంశమై రెండు నుంచి మూడు ప్రతిపాదనలు తయారుచేసి ఉన్నతాధికారులకు పంపుతున్నారు. అన్ని శాఖల జిల్లా కార్యాలయాలు కొత్తగా ఏర్పాటుచేయాల్సి వస్తున్నందున ఆయా విభాగాధిపతులు భవనాలను పరిశీలించి నివేదికలు తయారు చేస్తున్నారు.
సీనియారిటీ ఆధారంగా జాబితాలు :
ఉద్యోగులు, సిబ్బంది సీనియారిటీ జాబితాలు తయారు చేయించిన సంబంధిత శాఖాధిపతులు మండలస్థాయి అధికారుల వరకు ఎవరిని ఏ జిల్లాకు పంపాలన్న విషయమై ప్రాథమికంగా కసరత్తు చేసి ప్రభుత్వానికి పంపారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత జిల్లా పరిధిలో జరిగే బదిలీలు, సీనియారిటీ తదితర విషయాల్లో సాంకేతికంగా సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించి జాబితాలు తయారుచేస్తున్నారు. కొన్ని కార్యాలయాల్లో తయారుచేసి ఆ శాఖల రాష్ట్రస్థాయి అధికారులకు పంపిన జాబితాలు కొన్ని బహిర్గతం కావడంతో ఆయా ఉద్యోగులు ఏ ఇద్దరు కలిసినా కొత్త జిల్లాలపైనే చర్చించుకుంటున్నారు. బాపట్ల, నరసరావుపేట కేంద్రంగా కొత్తగా ఏర్పడుతున్న జిల్లాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోనే కార్యాలయాలు ఏర్పాటుచేసినా ఉన్నతాధికారులు విధులు నిర్వహించడానికి అనుగుణంగా భవనాలను తీర్చిదిద్దడానికి, ఫర్నిచర్, వాహనాల కొనుగోలుకు సొమ్ము వెచ్చించాల్సి ఉంది. నిధుల లభ్యత ఆధారంగా తొలుత కార్యాలయాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫర్నిచర్, వాహనాలను వాడుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆయా శాఖల నుంచి జిల్లా యంత్రాంగం సమగ్ర సమాచారాన్ని శనివారం సేకరించింది.
0 Comments